నాన్నకి నా సినిమా విడుదలకు ముందు మాత్రం చూపించను !! – మంచు లక్ష్మీ
July 8, 2020 / 12:04 PM IST
“మన అమ్మాయిలు, మన తెలుగమ్మాయిలు అని చెప్పుకోవడం తప్ప.. తెలుగమ్మాయిలను ఎక్కడ ఎంకరేజ్ చేస్తోంది మన చిత్ర పరిశ్రమ. క్యారెక్టర్ ను బట్టి ఆర్టిస్ట్ సెలక్షన్ ఉండాలి కాదనను కానీ.. కేవలం ముంబై ఆర్టిస్టులు మాత్రమే కావాలనుకోవడం మాత్రం తప్పు. మన ప్రేక్షకులు కూడా తమిళ చిత్రాలను ఆదరించినట్లుగా.. తెలుగు సినిమాలను ఆదరించేవారు కాదు. అందుకే మొన్నటివరకూ ప్రయోగాత్మక చిత్రాలు తీయాలంటే భయపడేదాన్ని.. కానీ ఇప్పుడు ప్రేక్షకులు సినిమాలు చూసి అర్ధం చేసుకొనే విధానంలో విశేషమైన మార్పులు వచ్చాయి. అందుకే ధైర్యంగా “వైఫ్ ఆఫ్ రామ్”తో ప్రేక్షకుల ముందుకు రాగలుగుతున్నాను” అంటూ తెలుగు కథానాయికగా, దర్శకనిర్మాతగా తన అనుభవాలను ఆమె నటించిన తాజా చిత్రం “వైఫ్ ఆఫ్ రామ్” ఈ శుక్రవారం (జూలై 20) విడుదలవుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని పాత్రికేయులతో పంచుకొంది మంచు లక్ష్మీ ప్రసన్న. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే..!!
ఆడియన్స్ కి ఆలోచించే టైమ్ ఇవ్వం..సాధారణంగా సినిమా అనగానే మొదట క్యారెక్టర్స్ అన్నీ ఇంట్రడ్యూస్ చేసి, తర్వాత కాస్త కథ చెప్పేలోపు ఇంటర్వెల్ వచ్చేస్తుంది. కానీ.. “వైఫ్ ఆఫ్ రామ్” అలా ఉండదు. సినిమాలో ఒక పాట కానీ ఫైట్ కానీ ఉండదు. ప్రేక్షకుల సమయాన్ని ఏమాత్రం వృధా చేయకుండా వారికి ఒక సరికొత్త సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. బేసిగ్గా జోనర్ బేస్డ్ మూవీస్ మన తెలుగులో చాలా తక్కువగా వస్తుంటాయి. అలాంటి ఒక మంచి చిత్రమే “వైఫ్ ఆఫ్ రామ్”.
ఆ సినిమాతో కంపేర్ చేస్తే నా సినిమా స్థాయి పెరిగినట్లే..ట్రైలర్ విడుదలైన తర్వాత “వైఫ్ ఆఫ్ రామ్” చిత్రాన్ని చాలా మంది హిందీ చిత్రం “కహానీ”తో కంపేర్ చేశారు. అలా కంపేర్ చేస్తే నా సినిమా స్థాయి పెరిగినట్లే కదా. ఎందుకంటే అంత సక్సెస్ ఫుల్ సినిమాతో కంపేర్ చేయడం అనేది చాలా పెద్ద ప్లస్ పాయింట్ నాకు. అయితే.. ఆ సినిమాకి, మా సినిమాకి ఏమాత్రం సంబంధం ఉండదు.
ఓ సంఘటన దీక్ష జీవితాన్ని ఎలా మార్చేసిందో శుక్రవారం చూడండి..దీక్ష అనే సగటు మహిళ కథే “వైఫ్ ఆఫ్ రామ్”. త్వరలో తల్లి కాబోతున్న దీక్ష అందరిలాగే చాలా కలలు కంటుంది, భవిష్యత్ గురించి చాలా ఆశలు పెట్టుకొంటుంది. కానీ.. ఒక సంఘటన కారణంగా ఆమె కలలు చల్లాచెదురవుతాయి. న్యాయం, ధర్మం, ఒప్పు-తప్పులను కాకుండా తాను నమ్మిన సిద్ధాంతాన్ని అనుసరించే దీక్ష ఆ సంఘటన కారణంగా మొదలైన సమస్యల నుంచి ఎలా బయటపడింది అనేది “వైఫ్ ఆఫ్ రామ్ కథాంశం”. చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది.
మా డైరెక్టర్ విజయ్ చాలా ప్యాషనేట్..కోట్ల రూపాయలు ఖర్చు పెడదాం, స్టార్ హీరోలతో సినిమాలు తీద్దాం అనే ఆశలకు దూరంగా.. ప్రేక్షకులకు వైవిధ్యమైన సినిమా అందించాలన్న ఆలోచనకు దగ్గరగా ఉండే వ్యక్తి మా డైరెక్టర్ విజయ్. మా సినిమా “వైఫ్ ఆఫ్ రామ్” ఇంటర్నేషనల్ ఫిలిమ్ ఫెస్టివల్ కి ఎంపైందని తెలిసాక బాగా ఎగ్జైట్ అయ్యింది విజయ్ ఒక్కడే. ఇక ఆ ఫిలిమ్ ఫెస్టివల్ లో వేరే ఫిలిమ్ మేకర్స్ ను చూసిన తర్వాత “50 లక్షల్లో ఒక సినిమా తీయాలి మేడమ్” అనేవాడు.
ప్రియదర్శి, శ్రీకాంత్ అయ్యంగర్ లు ఆశ్చర్యపరుస్తారు..ఈ సినిమాలో నేను, సామ్రాట్, ఆదర్శ్ బాలకృష్ణల క్యారెక్టర్స్ ఒకేత్తైతే.. ప్రియదర్శి పోషించిన పోలీస్ క్యారెక్టర్, శ్రీకాంత్ అయ్యంగర్ ప్లే చేసిన నెగిటివ్ రోల్ ఒకెత్తు. అసలు వాళ్ళు స్క్రీన్ మీద కనిపించినంతసేపు ప్రేక్షకులు మమ్మల్ని మర్చిపోతారు. వాళ్ళ నటన సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. మాకంటే వాళ్ళకే ఎక్కువ పేరొచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
తమిళ చిత్రాలను ఆదరించినట్లుగా.. మన సినిమాలు చూడట్లేదుచాలా కాలంగా నేను గమనించిన విషయం ఏంటంటే.. తమిళంలో తెరకెక్కిన సినిమాలను డబ్బింగ్ రూపంలో ఆదరిస్తున్నట్లుగా మన తెలుగు స్ట్రయిట్ సినిమాలను ప్రేక్షకులు ఆదరించడం లేదు. అందుకే మొదట్లో “వైఫ్ ఆఫ్ రామ్” తరహా సినిమాలు చేయాలనిపించినా, అలాంటి కథలు నా వద్దకు వచ్చినా పెద్దగా పట్టించుకొనేదాన్ని కాదు. కానీ.. ఇప్పుడు ప్రేక్షకులు సినిమా చూసే విధానం మారింది. అందుకే ధైర్యంగా ఈ ప్రొజెక్ట్ ను టేకప్ చేశాను.
థియేటర్లో చూస్తుంటే తెలిసిపోతుంటుంది..మనం మన సినిమాని ఎన్నిసార్లు ప్రివ్యూ ల్యాబ్స్ లో, ఎడిట్ సూట్స్ లో చూసుకొన్నా.. మనం చేసిన తప్పులు అర్ధం కావు. కానీ.. ప్రేక్షకుల మధ్యలో కూర్చుని ఎప్పుడైనా సినిమా చూస్తే మాత్రం ఏ సన్నివేశంలో చక్కగా నటించాం, ఏ సీన్ బాగా వచ్చింది, ఏ సీన్ బాగా రాలేదు? అనే విషయాల్లో క్లారిటీ వచ్చేస్తుంది. సాధారణంగా సినిమాలకు వెళ్లినప్పుడు ఒక మూల కూర్చునే నేను, నా సినిమాలను మాత్రం థియేటర్ మధ్యలో కూర్చుని చూస్తూ.. ఆడియన్స్ రియాక్షన్ ను గమనిస్తాను. నేను చాలా సినిమాలు దొంగతనంగా దుప్పట్టా కప్పుకొని చూస్తుంటాను. అలాగే.. రెగ్యులర్ గా ఐమాక్స్, సినీమాక్స్ లలో అన్నీ సినిమాలు చూస్తుంటాను.
అలా ఫోన్ చూస్తుంటే చిర్రెత్తుకొస్తుంది..నేను చాలాసార్లు గమనించాను.. షో నడుస్తున్నప్పుడు జనాలు తమ ఫోన్లు చూసుకుంటూ టైమ్ పాస్ చేస్తుంటారు. అలా జనాలు థియేటర్లు పక్కనున్నవాళ్లని కూడా దిస్టర్బ్ చేస్తూ ఫోన్లు చెక్ చేస్తుంటుంటే నాకు చిర్రెత్తుకొస్తుంది. అలాగే.. కొందరు తెగ మాట్లాడేస్తుంటారు. సినిమాని ఆస్వాదించాలి. ఆ విషయాన్ని మన ప్రేక్షకులు నేర్చుకోవాలి.
అప్పటికి శేష్ కూడా పెద్దగా పేరున్న నటుడేమీ కాదు..“వైఫ్ ఆఫ్ రామ్” సినిమాలో భర్త పాత్ర కోసం అంతగా పేరు లేని సామ్రాట్ ను ఎంపీక చేయడం పట్ల “అతను కాకుండా వేరే ఆర్టిస్ట్ అయితే సినిమాకి వేల్యూ యాడ్ అయ్యేది కదా” అంటూ చాలా కామెంట్స్ వచ్చాయి. అలా అనుకొంటే.. “దొంగాట” సినిమా చేసే టైమ్ కి అడివి శేష్ కూడా అంత పాపులర్ ఆర్టిస్ట్ ఏమీ కాదు. నేను పాపులారిటీ, స్టార్ డమ్ కంటే టాలెంట్ ను ఎక్కువగా నమ్ముతాను. మంచి క్యాస్టింగ్ సెట్ అయ్యిందంటే సగం సినిమా పూర్తయినట్లే అనేది నా భావన.
ప్రభావం ఉండదు అని అబద్ధం చెప్పను కానీ..సాధారణంగా మేం పోషించే పాత్రల వ్యవహార శైలి మా పర్సనల్ క్యారెక్టర్స్ ను కూడా ప్రభావితం చేస్తుంది. ఒక్కోసారి ఎఫెక్ట్ అయ్యారా అని అడిగితే అవ్వలేదు అని అబద్ధం చెబుతుంటామ్ కానీ.. ఎఫెక్ట్ అవుతామ్. కానీ.. నేను వరల్డ్ క్లాస్ యాక్టింగ్ స్కూల్ లో వరల్డ్ బెస్ట్ ట్రయినర్ దగ్గర నటనలో శిక్షణ తీసుకొన్నాను. ఎలాంటి పాత్రలో అయినా నేను నటించగలను. అందుకే “దీక్ష” పాత్ర చూస్తున్నప్పుడు మీకు మంచు లక్ష్మీ కనిపించదు.
నాన్నకి మాత్రం చూపించను..“వైఫ్ ఆఫ్ రామ్” సినిమా ఆల్రెడీ నా ఫ్రెండ్స్ అందరికీ చూపించాను. వాళ్ళందరూ చాలా బాగుంది అంటూ భీభత్సమైన కాన్ఫిడెన్స్ ఇచ్చారు. అందుకే ఆనందంతో ఎగిరెగిరి పడుతున్నాను. అయితే.. సినిమా నాన్నకి మాత్రం ఇంకా చూపించలేదు. ఆయనకి ఈ తరహా సినిమాలు పెద్దగా నచ్చవు. పూసుక్కున బాలేదు అనేస్తే నేను ఏడ్చుకుంటూ కూర్చోవాలి. అందుకే ఇంకా నాన్నకి మాత్రం చూపించలేదు. ఆయన కూడా తిరుపతిలో ఉన్నారు. సో, సినిమా రిలీజయ్యాక అక్కడే చూడామని చెప్తాను.
అలాంటి కథలు తీసుకురండి..నాకు కూడా “కిల్ బిల్, పీకు” లాంటి సినిమాలు చేయాలని ఉంటుంది. కానీ.. ఎవరూ ఆ తరహా కథలతో నా వద్దకు రావడం లేదు. అసలు “పీకు” చూశాక నేను-నాన్న కలిసి ఆ సినిమా చేస్తే ఎంత బాగుంటుంది కదా అనిపించింది. మళ్ళీ మనసులో ఇంకో ఆలోచన ఏంటంటే.. ఈ సినిమాని ఆడియన్స్ చూస్తారా? అనే డౌట్ ఒకటి.
ఆ టెన్షన్ లో జ్వరం వచ్చేస్తుంది..ఇవాళ “సినిమా రిలీజైపోయిందా? నేను మర్చిపోయి పడుకొన్నానా?” అంటూ టెన్షన్ తో నిద్ర లేచాను. కట్ చేస్తే ఇవాళ బుధవారం అని తెలిసి కాస్త రిలీఫ్ వచ్చింది. రిలీజ్ టెన్షన్ పుణ్యమా అని జ్వరం కూడా వచ్చేసింది. ఒక్కోసారి ఈ టెన్షన్ ఎందుకురా బాబు హ్యాపీగా నాన్న చెప్పినట్లు ఇంట్లో కూర్చున్నా బాగుండేది అనిపిస్తుంటుంది. అసలు సినిమాలు చేయడం, తీయడం మానేద్దామా అనే ఆలోచన కూడా అనిపిస్తుంటుంది. కానీ.. నాలోని నటి, ఫిలిమ్ మేకర్ నన్ను బాగా ఇన్స్ ఫైర్ చేసి మళ్ళీ సినిమాల వైపుకు తోస్తుంది.
పాలిటిక్స్ రాను రానూ నీచంగా తయారవుతున్నాయి..బేసిగ్గా నాకు పాలిటిక్స్ లోకి రావాలన్న ఆలోచన లేదు కానీ.. నువ్ వెళ్తే బాగుండు అని కొందరు అంటుంటారు. కానీ.. ఈమధ్యకాలంలో పాలిటిక్స్ చాలా పర్సనల్ అయిపోయాయి. వ్యక్తి దూషణ ఎక్కువైంది. అందుకే అటువైపు వెళ్లాలన్న ఆలోచన కూడా భయపడేలా చేస్తుంది.
మేము సైతంకి వస్తున్న స్పందన గురించి ఎంత చెప్పినా తక్కువే..నా జీవితంలో ఇప్పటివరకూ నాకు పూర్తిస్థాయిలో మానసిక సంతృప్తి కలిగించిన విషయం ఏదైనా ఉంది అంటే అది “మేము సైతం” ప్రోగ్రామ్ మాత్రమే. అసలు ఆ షో ద్వారా నేను నిర్వహిస్తున్న కార్యక్రమాలు, సహాయపడుతున్న కుటుంబాలు, మారుస్తున్న తలరాతలు నాకు ఎనలేని ఆనందాన్నిస్తున్నాయి. ముఖ్యంగా.. ఎవరెవరో ఈ షో ద్వారా అవసరార్ధులకు సహాయపడాలని ముందుకొస్తుండడం నాకు కొండంత ధైర్యాన్నిస్తుంది. ఇటీవల రాజశేఖర్-జీవితల కుమార్తె శివాని మా ఆఫీస్ కి వచ్చింది. అక్కడ పరిస్థితులు గమనించి.. ఫోన్ కొనుక్కొందామని దాచుకొన్న తన మొదటి రెమ్యూనరేషన్ డబ్బులు లక్ష మాకు విరాళంగా ఇచ్చింది. మనషుల్లో మంచిని పెంచుతోంది “మేము సైతం”, ఇంతకంటే మాకేం కావాలి చెప్పండి.
తమిళ పరిశ్రమ నన్ను అక్కున చేర్చుకుంది..ఎంతసేపు తెలుగమ్మాయిలు మనవాళ్లు అని చెప్పుకోవడం తప్ప.. మన ఇండస్ట్రీ వాళ్ళని అస్సలు అస్సలు ఎంకరేజ్ చేయడం లేదు. అందుకే మన తెలుగమ్మాయిలు వేరే భాషల్లో రాణిస్తున్నారు. ఇటీవల నేను జ్యోతికతో “తుమారీ సులు” తమిళ రీమేక్ లో నటిస్తున్నాను. ఆ చిత్రంలో ముఖ్యపాత్ర పోషిస్తున్నాను. అక్కడివాళ్ళందరూ నన్ను చాలా ముద్దుగా చూసుకొంటున్నారు. అర్జెంట్ గా తమిళ చిత్రసీమకి షిఫ్ట్ అయిపోదామా అనిపించేలా ఉంది అక్కడి ట్రీట్ మెంట్.
సామ్రాట్ కి సపోర్ట్ చేయమని అందరికీ చెబుతున్నాను..తొలుత సామ్రాట్ వెళ్ళి “బిగ్ బాస్” హౌస్ లో కూర్చోగానే నాకు విపరీతమైన కోపమొచ్చింది. సినిమా రిలీజ్ పెట్టుకొని ఈ అబ్బాయి అక్కడ కూర్చున్నాడు. ప్రమోషన్స్ సంగతి ఏంటా అని తెగ ఆలోచించేశాను. తర్వాత ఆ షో ద్వారా సామ్రాట్ రీజనల్ ఆడియయ్న్స్ కి దగ్గరవ్వడం నాకు ప్లస్ అవుతుంది అనిపించింది. అందుకే మా స్కూల్ స్టూడెంట్స్, ఎంప్లాయిస్ అందరికీ “సామ్రాట్ కి ఓట్ చేయండి” అని చెబుతున్నాను. ఇంతకీ ఆ హౌస్ లో కూర్చున్న సామ్రాట్ కి అసలు సినిమా రిలీజ్ అవుతుందని తెలుసా లేదా అని భయంగా ఉంది.