గత శుక్రవారం రోజున మంచు విష్ణు మోసగాళ్లు, కార్తికేయ చావుకబురు చల్లగా, ఆది సాయికుమార్ శశి సినిమాలు విడుదలైన సంగతి తెలిసిందే. ఈ మూడు సినిమాలలో మోసగాళ్లు సినిమాకే బెటర్ టాక్ వచ్చినా కలెక్షన్ల పరంగా మోసగాళ్లు సినిమా డిజాస్టర్ గా నిలిచింది. తెలుగులో ఈ సినిమాకు ఫుల్ రన్ లో రెండు కోట్ల రూపాయల షేర్ వచ్చే పరిస్థితి కూడా కనిపించడం లేదు. మోసగాళ్లు సినిమా విడుదలైన కొన్ని థియేటర్లలో ప్రేక్షకులు లేక షోలు క్యాన్సిల్ చేసినట్టు వార్తలు వచ్చాయి.
మోసగాళ్లు సినిమాతో మోసపోయిన మంచు విష్ణు కలెక్షన్ల పరంగా నష్టపోయినా సునీల్ శెట్టి ఆయనను కాపాడారని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కథపై నమ్మకంతో భారీ మొత్తం ఖర్చు చేసిన మంచు విష్ణుకు రిజల్ట్ భారీ షాక్ ఇచ్చినా ఈ సినిమాలో సునీల్ శెట్టి ఉండటంతో హిందీ శాటిలైట్, డిజిటల్, ఇతర హక్కుల ద్వారా మంచు విష్ణుకు ఏకంగా 10.2 కోట్ల రూపాయల ఆదాయం చేకూరిందని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
హిందీ హక్కుల ద్వారా వచ్చిన మొత్తం వల్ల మోసగాళ్లు సినిమాకు భారీగా నష్టాలు తగ్గినట్టేనని చెప్పవచ్చు. కథ బాగానే ఉన్నా కథనంలోని లోపాలు మోసగాళ్లు సినిమా ఫ్లాప్ కావడానికి కారణమయ్యాయి. హాలీవుడ్ దర్శకుడు జెఫ్రీ డైరెక్షన్ చేసినా ఈ సినిమా హాలీవుడ్ స్థాయిలో లేకపోవడం గమనార్హం. కథనంపై దృష్టి పెట్టి ఉంటే ఈ సినిమా ఫలితం మరోలా ఉండేదని విష్ణు ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. మంచు విష్ణు భవిష్యత్ ప్రాజెక్ట్ ల సక్సెస్ పైనే విష్ణు కెరీర్ ఆధారపడి ఉందని చెప్పవచ్చు. కామెడీ స్ట్రెంత్ అయిన మంచు విష్ణు కామెడీ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమాలే విష్ణుకు కమర్షియల్ సక్సెస్ లను తెచ్చిపెట్టిన సంగతి తెలిసిందే.