Manisharma: ‘ఆచార్య’ ఫెయిల్యూర్ పై మణిశర్మ కామెంట్స్!
November 29, 2022 / 02:27 PM IST
|Follow Us
కొన్ని డిజాస్టర్స్ ను అంత ఈజీగా మర్చిపోలేం. అవి చేసిన గాయాలు అంత త్వరగా మాసిపోవు. ‘ఆచార్య’ సినిమా కూడా అలాంటిదే. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చార కలిసి నటించిన సినిమా కావడంతో అభిమానుల్లో అంచనాలు ఓ రేంజ్ లో ఉండేవి. తీరా విడుదలైన తరువాత అట్టర్ ప్లాప్ అయింది ఈ సినిమా. ఈ సినిమా గురించి గుర్తు చేసుకోవడానికి కూడా అభిమానులు ఇష్టపడరు. అంతగా నిరాశ పరిచింది. ఈ ప్లాప్ కి కారణం దర్శకుడు కొరటాల శివే అంటూ చిరు, రామ్ చరణ్ పరోక్షంగా చేసిన కామెంట్స్ బాగా వైరల్ అయ్యాయి.
ఇప్పటికీ ఏదొక రూపంలో ఈ సినిమాకి సంబంధించిన విషయాలు బయటకొస్తూనే ఉన్నాయి. తాజాగా మణిశర్మ ఈ సినిమా గురించి కొన్ని కామెంట్స్ చేశారు. ‘ఆచార్య’లో కథ కథనాలు ఎంత బాలేనప్పటికీ సంగీతం.. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మీద నెగెటివ్ కామెంట్స్ బాగా వచ్చాయి. అసలు మణిశర్మ కంపోజ్ చేసిన సంగీతమేనా..? అని జనాలకు డౌట్ కూడా వచ్చింది. ఈ విషయాన్నే కమెడియన్ అలీ తన టాక్ షోలో నేరుగా మణిశర్మను అడిగారు.
దానికి ఆయన సమాధానం చెబుతూ.. సినిమాలో రెండు పాటలు హిట్ అయిన సంగతి ఎవరూ మాట్లాడరని, అయినా మెగాస్టార్ సినిమాలకు పని చేస్తూ పెరిగిన తాను కావాలని బ్యాడ్ అవుట్ పుట్ ఎందుకు ఇస్తానని ప్రశ్నించారు. ముందు ఇచ్చిన బీజీఎం వేరే అయితే దర్శకుడు కొరటాల శివ కొత్త వెర్షన్ కావాలని కోరడంతో మార్చినట్లు చెప్పారు మణిశర్మ. ఆ విధంగా ఈ పొరపాటు కూడా కొరటాల శివదే అన్నట్లుగా చెప్పారు.
నిజానికి మణిశర్మ-చిరంజీవి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలన్నీ మ్యూజికల్ గా భారీ హిట్స్ అందుకున్నాయి. ‘ఇంద్ర’, ‘ఠాగూర్’, ‘చూడాలని ఉంది’, ‘బావగారు బాగున్నారా..’ ఇలా అన్ని సినిమాలు మ్యూజికల్ గా మంచి హిట్స్ అందుకున్నాయి. ‘జై చిరంజీవ’, ‘మృగరాజు’ లాంటి సినిమాలకు కూడా మణిశర్మ మంచి మ్యూజిక్ అందించారు. ఒక్క ‘ఆచార్య’ విషయంలో మాత్రమే సెంటిమెంట్ వర్కవుట్ అవ్వలేదు.