స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విశేషమైన క్రేజ్ ఎంజాయ్ చేస్తున్న నటుడు రావు రమేష్ (Rao Ramesh). ప్రస్తుతం పాన్ ఇండియన్ సినిమాలతో చాలా బిజీగా ఉన్న రావు రమేష్ టైటిల్ పాత్రలో తెరకెక్కిన చిత్రం “మారుతీనగర్ సుబ్రమణ్యం” (Maruthi Nagar Subramanyam). లక్ష్మణ్ కార్య (Lakshman Karya) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని దర్శకుడు సుకుమార్ (Sukumar) సతీమణి తబిత సమర్పణలో విడుదల చేయడం, ప్రీరిలీజ్ ఈవెంట్ కు అల్లు అర్జున్ (Allu Arjun) ముఖ్య అతిథిగా విచ్చేయడం సినిమాకి విపరీతమైన పబ్లిసిటీ తీసుకొచ్చింది. ప్రమోషనల్ కంటెంట్ కూడా జనాల్ని విశేషంగా అలరించింది. మరి సినిమా కూడా అదే స్థాయిలో ఆకట్టుకుందో లేదో చూద్దాం..!!
Maruthi Nagar Subramanyam Review
కథ: 1998లో డీఎస్సీలో రావాల్సిన ప్రభుత్వ ఉద్యోగం కోర్టు కేసులో ఇరుక్కుని రాకపోవడంతో.. ఎప్పటికైనా గవర్నమెంట్ ఉద్యోగం వస్తుందనే ఆశతో, భార్య కళారాణి (ఇంద్రజ(Indraja)) సంపాదన మీద బ్రతికేసే ఓ మధ్యతరగతి వ్యక్తి సుబ్రమణ్యం (రావు రమేష్). తన తండ్రి అల్లు అరవింద్ అని పిచ్చిగా నమ్మే సుబ్రమణ్యం కొడుకు అర్జున్ (అంకిత్ కొయ్య) (Ankit Koyya) ఏ పనీ చేయకుండా తండ్రితో కలిసి సిగరెట్ కొడుతూ టైమ్ పాస్ చేస్తుంటాడు. మారుతీ నగర్ నిండా అప్పులు చేస్తూ.. ఉద్యోగం లేక ఇంట్లో, సమాజంలో గౌరవం లేక మదనపడే సుబ్రమణ్యం బ్యాంక్ ఎకౌంట్లో ఒక్కసారిగా 10 లక్షల రూపాయలు డిపాజిట్ అవుతాయి. అసలు ఆ డబ్బులు ఎవరు వేశారో తెలియక, వచ్చిన డబ్బులతో ఏం చేయాలో అర్థం కాక తండ్రీకొడుకులిద్దరూ తెగ కన్ఫ్యూజ్ అయిపోతుంటారు.
అసలు రూపాయిన్నర బ్యాలెన్స్ ఉన్న సుబ్రమణ్యం ఎకౌంట్ లోకి 10 లక్షల రూపాయలు ఎవరు డిపాజిట్ చేసారు? ఆ డబ్బులతో సుబ్రహ్మణ్యం ఏం చేశాడు? ఆ డబ్బులు ఉన్న సమస్యలను తీర్చిందా? లేక కొత్త సమస్యలను తెచ్చిపెట్టిందా? అనేది “మారుతీ నగర్ సుబ్రమణ్యం” (Maruthi Nagar Subramanyam) సినిమా కథాంశం.
నటీనటుల పనితీరు: ప్రకాష్ రాజ్ లాంటి అత్యద్భుతమైన నటుడికి రీప్లేస్మెంట్ లా ఇండస్ట్రీకి దొరికిన టాలెంట్ రావు రమేష్. ఆయన్ని కూడా కొన్ని సినిమాలతో రొటీన్ యాక్టర్ ను చేసేశారు. అందుకు కారణం దాదాపుగా ఒకే రకమైన పాత్రలు ఆయనతో పోషింపజేయడం. “మారుతీ నగర్ సుబ్రమణ్యం” ఆ టైప్ క్యాస్టింగ్ ను బ్రేక్ చేసింది. రావు రమేష్ లోని కామెడీ టైమింగ్ & ఎమోషనల్ యాంగిల్ ను పూర్తిగా ఎక్ప్లోర్ చేసింది సుబ్రమణ్యం పాత్ర. అయితే.. కొన్ని సన్నివేశాల్లో కాస్త అతి అనిపించినా మాస్ సెంటర్స్ లో సదరు సన్నివేశాలకు రెస్పాన్స్ బాగుంటుంది. సినిమాలో అన్నిటికంటే ఆశ్చర్యపరిచేది రావు రమేష్ ఎనర్జీ. ఆ ఎనర్జీని మాత్రం ఆడియన్స్ కచ్చితంగా ఆస్వాదిస్తారు.
అంకిత్ కొయ్య మెల్లమెల్లగా డిపెండబుల్ యాక్టర్ గా ఎదుగుతున్న తీరు ప్రశంసనీయం. గత వారం “ఆయ్”తో ఆకట్టుకున్న అంకిత్ ఇప్పుడు ఈ చిత్రంలో అర్జున్ గా మంచి నటన కనబరిచాడు. రావు రమేష్ వెర్సటాలిటీని తట్టుకొని ఆయన పక్కన నిలబడడం అనేది మామూలు విషయం కాదు. ఆ విషయంలో మాత్రం అంకిత్ ను మెచ్చుకోవాలి. అలాగే.. ఇంద్రజకు మంచి పాత్ర లభించింది. కుటుంబ బాధ్యతలు మోసే గృహిణిగా ఆమె నటన, భర్తను డబ్బులు విషయంలో నిలదీసే సన్నివేశంలో ఆమె హావభావాలు ప్రశంసనీయం. అలాగే.. చివర్లో చిన్నపాటి డ్యాన్స్ తోనూ ఆకట్టుకుంది.
రమ్య పసుపులేటి (Ramya Pasupuleti) పాత్రకి తగ్గట్లుగా ఇంటర్మీడియట్ నిబ్బిలా ఒదిగిపోయింది. ఆమె గ్లామర్ ఆల్రెడీ సినిమాకి ప్లస్ పాయింట్ గా మారింది. సినిమాలో ఆమె సీన్స్ కు యూత్ బాగా కనెక్ట్ అవుతారు. హర్షవర్ధన్ (Harshvardhan) , అజయ్ (Ajay) , శివన్నారాయణ తదితరులు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతికవర్గం పనితీరు: కళ్యాణ్ నాయక్ (Kalyan Nayak) పాటలు & నేపథ్య సంగీతం సినిమాకి బాగా హెల్ప్ అయ్యాయి. సన్నివేశంలోని భావానికి తగ్గ సాహిత్యంతో కూడిన నేపథ్య సంగీతాన్ని విని చాలా రోజులైంది. ఈ సినిమాలో ఆ సాహిత్యంతో కూడిన నేపథ్య సంగీతమే పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పాలి. “మేడమ్ సార్ మేడమ్ అంతే” పాట ఆల్రెడీ పెద్ద హిట్ అన్న విషయం తెలిసిందే. బాల్ రెడ్డి (M.N.Bal Reddy) సినిమాటోగ్రఫీ వర్క్ డీసెంట్ గా ఉంది, ఇచ్చిన బడ్జెట్ కి న్యాయం చేశాడాయన.
దర్శకుడు లక్ష్మణ్ కార్య మొదటి సినిమా “హ్యాపీ వెడ్డింగ్” (Happy Wedding) విషయంలో జరిగిన తప్పులు ఆరేళ్ల తర్వాత వచ్చిన “మారుతీ నగర్ సుబ్రమణ్యం” సినిమాలో దొర్లకుండా జాగ్రత్తపడ్డాడు. ల్యాగ్ లేకపోవడం సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్. అలాగే.. మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకునే కామెడీ పుష్కలంగా ఉంది. అయితే.. మెయిన్ ట్విస్ట్ ను త్వరగా రివీల్ చేయకుండా ఉండడం కోసం సినిమాలో ఇరికించిన కొన్ని కామెడీ ట్రాక్స్ వర్కవుటవ్వలేదు.
అలాగే.. రావు రమేష్ పాత్ర ప్రభుత్వ ఉద్యోగం కోసం 25 ఏళ్లు వెయిట్ చేశాడు అని ఎస్టాబ్లిష్ చేయాలనుకోవడంలో తప్పు లేకపోయినా మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అండగా ఉండడం కోసం కనీసం అప్పులు చేయకుండా ఎందుకు ఉండలేకపోయాడు, అది కూడా భార్య మీద విపరీతమైన గౌరవం ఉన్నోడు అనేది సరిగా ఎస్టాబ్లిష్ చేయలేదు. అందువల్ల ఎమోషనల్ కనెక్టివిటీ మిస్ అయ్యింది. పంచ్ డైలాగులు మాత్రం బాగా పేలాయి. ఒక దర్శకుడిగా, రచయితగా లక్ష్మణ్ కార్య రెండో ప్రయత్నంలో బొటాబొటి మార్కులతో పాసయ్యాడు.
విశ్లేషణ: క్యారెక్టర్ బేస్డ్ కామెడీ సినిమాలు ఈమధ్య బాగా తగ్గిపోతున్నాయి, సిచ్యుయేషనల్ కామెడీ అనేది బోర్ కొట్టేస్తున్న తరుణంలో లక్ష్మణ్ కార్య “సుబ్రమణ్యం” అనే పాత్రతో జనాలు రిలేట్ అయ్యేలా చేసి నవ్వించడం అనేది చెప్పుకోదగ్గ విషయం. రావు రమేష్ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్, అంకిత్ కొయ్య క్యారెక్టరైజేషన్, రమ్య పసుపులేటి గ్లామర్ & ఇన్నోసెన్స్, కళ్యాణ్ నాయక్ సంగీతం కలగలిసి “మారుతీ నగర్ సుబ్రమణ్యం” (Maruthi Nagar Subramanyam) చిత్రాన్ని ఈ వీకెండ్ కి బెటర్ ఆప్షన్ గా మలిచాయి.