మసక్కలి

  • September 14, 2018 / 09:55 AM IST

“లవ్ యు బంగారం” ఫేమ్ శ్రావ్య తప్ప సినిమాలో నటించినవారెవరూ ప్రేక్షకులకు తెలియదు కానీ.. ట్రైలర్ తో ఆసక్తి రేపిన చిత్రం “మసక్కలి”. పోయిటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రంలోని కొన్ని మనసుకి హత్తుకొనే సంభాషణలు ప్రేక్షకుల్ని ఆకట్టుకొన్నాయి. మరి ట్రైలర్ తో రేపిన ఆసక్తిని సినిమాతో కంటిన్యూ చేశాడా అనేది చూద్దాం..!!

కథ : సూర్య (సాయి రొణక్) ఓ సైకాలజీ స్టూడెంట్. తన సీనియర్ డాక్టర్ అప్పజెప్పిన మెంటల్లీ అన్ ఫిట్ పేషంట్స్ ను పరిశీలించి ఒక క్లియర్ రీపోర్ట్ ఇస్తుంటాడు. ఆ క్రమంలో డాక్టర్ సూర్యను శృతి (శ్రావ్య)ను పరిచయం చేస్తాడు. ఆమె కొన్నాళ్లుగా వింతగా బిహేవ్ చేస్తుందని ఆమె తండ్రి చెప్పడంతో ఆమెను అబ్జర్వ్ చేయడం మొదలెడతాడు సూర్య. అయితే.. శ్రుతి అప్పుడప్పుడూ విచిత్రంగా బిహేవ్ చేయడానికి కారణం ఆమె మానసికంగా డిస్టర్బ్ అవ్వడం కాదని ఆమెలో ఉన్న మరో మనిషి ఆకాంక్ష అలా చేయిస్తోందని తెలుసుకొంటాడు.

ఇంతకీ ఆకాంక్ష ఎవరు? ఆమెకు శ్రుతికి సంబంధం ఏమిటి? చివరికి సూర్య తన పేషెంట్ శ్రుతిని ట్రీట్ చేయగలిగాడా? లేదా? అనేది “మసక్కలి” సినిమా చూసి తెలుసుకోవాల్సిన విషయం.

నటీనటుల పనితీరు : “గుప్పెడంత ప్రేమ, లంక” లాంటి చిత్రాల్లో నటించిన అనుభవం ఉన్న సాయి రోణక్ ఈ చిత్రంలోనూ మంచి నటనతో ఆకట్టుకొన్నాడు. సినిమా మొత్తంలో ఆకట్టుకొనే అంశం ఏదైనా ఉంది అంటే అది సాయి రోణక్ నటన మాత్రమే. భగ్న ప్రేమికుడిలోని బాధను, మానసిక సంఘర్ణణను తన హావభావాలతో అద్భుతంగా వ్యక్తపరిచాడు. శ్రావ్య మునుపటి సినిమాలతో పోల్చి చూస్తే అందంగా కనిపించింది కానీ.. తన పాత్రలోని రెండు వేరియేషన్స్ ను సరిగా అండర్ ప్లే చేయలేకపోయింది. సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలవాల్సిన ఆమె పాత్ర శ్రావ్య నటన పుణ్యమా అని మైనస్ గా నిలిచింది.

సెకండ్ హీరోయిన్ గా నటించిన శిరీషా ముఖంలో ఆఖరికి చనిపోతున్నప్పుడు కూడా ఎలాంటి భావం కనిపించకపోవడం గమనార్హం. నటనలో కనీస మెళకువలు తెలియని అమ్మాయి చేత అంత వెయిట్ ఉన్న క్యారెక్టర్ ను ప్లే చేయించడం చాలా మైనస్. నవీన్ నేనీ నవ్వించడానికి తిన్న చంప దెబ్బలు అతడికి నొప్పి కలిగించాయో లేదో తెలియదు కానీ.. చూస్తున్న ప్రేక్షకుడికి మాత్రం చిరాకు తెప్పించాయి. ఇక మిగతా పాత్రధారుల గురించి ప్రస్తావించాల్సిన అవసరం రాలేదు.

సాంకేతికవర్గం పనితీరు : మిహిరామ్స్ సంగీతం – బ్యాగ్రౌండ్ స్కోర్, సుభాష్ దొంతి కెమెరా వర్క్ సినిమాకి ఎలాంటి ప్లస్ అవ్వలేదు, అలాగని మైనస్ గానూ మారలేదు. కానీ.. హరివర్మ ఆర్ట్ వర్క్ మాత్రం సన్నివేశంలోని ఎమోషన్స్ తో సంబంధం లేకుండా కళ్ళకి ఇబ్బంది కలిగించడమే కాకుండా మైనస్ పాయింట్స్ లో ఒకటిగా నిలిచింది.

దర్శకుడు నబి ఏనుగుబాలలో మంచి కవి ఉన్నాడనే విషయం ప్రతి సంభాషణలో కనిపిస్తుంది కానీ. కొన్ని సంభాషణలు మనసుకి హత్తుకొనేలా ఉన్నాయి. కానీ.. సినిమా మొత్తం ఆర్టిస్టిక్ గా తీస్తానంటే ఎలా సాధ్యం. సినిమాకి టార్గెట్ ఆడియన్స్ ఎవరో గుర్తించి కనీసం వాళ్ళకి నచ్చే అంశాలైనా కాసిన్ని యాడ్ చేయాల్సింది. కేవలం దర్శకుడిగా తన ప్రతిభను చూపించుకొన్నాడు తప్పితే ఆడియన్స్ ను మెప్పించే అంశాలను యాడ్ చేయడం కానీ ఆడియన్స్ ను నచ్చేలా సినిమాను మలచడం మాత్రం చేయలేదు.

విశ్లేషణ : బి, సి సెంటర్ ఆడియన్స్ సైతం న్యూ ఏజ్ సినిమాలను ఎంకరేజ్ చేస్తుంటే ఇంకా ఈ పాత తరం కథలను పట్టుకొని ప్రేక్షకులపై రుద్ధడానికి యంగ్ డైరెక్టర్స్ చేస్తున్న ప్రయత్నాలు ఇకనైనా ఆగి.. ఇకనుంచైనా మీనింగ్ ఫుల్ సినిమాలు తీయాలని కోరుకోవడం తప్ప ఏమీ చేయలేం. ఇక ఈ “మసక్కలి” గురించి చివరిగా చెప్పాలంటే.. టైటిల్-ట్రైలర్ లో ఉన్న అందం సినిమాలో లేదు.

రేటింగ్ : 1/5

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus