‘రావణాసుర’ కోసం రవితేజ – సుధీర్ వర్మ కొత్త ప్లానింగ్.. క్లిక్ అయితే మామూలుగా ఉండదు!
March 1, 2023 / 04:08 PM IST
|Follow Us
రవితేజలో ఎంత మాస్ ఎనర్జీ ఉందో కానీ.. సినిమా సినిమాకు క్వింటాల్ క్వింటాల్ బయటకు వస్తోంది. ఏజ్ పెరిగినా ఆయన మాస్ గేజ్ మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు. మొన్నీమధ్య వచ్చిన ‘ధమాకా’లోనూ తన మాస్ మేనరిజమ్స్, యాక్షన్‌తో అదరగొట్టేశారు. తాజాగా మరోసారి తన మాస్ మేనియా చూపించడానికి సిద్ధమవుతున్నారు. అయితే ఈసారి ఆ మాస్ ఫుల్ నెగిటివ్‌లో ఉంటుంది అంటున్నారు. అంటే విలన్‌గా రవితేజ అదరగొట్టే పనిలో బిజీగా ఉన్నాడట.
రవితేజ – సుధీర్ వర్మ కలసి ‘రావణాసుర’ అనే సినిమా చేస్తున్నారు. ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఏప్రిల్‌లో విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఆ సినిమాలో రవితేజను రెండు డిఫరెంట్ రోల్స్‌లో చూపిస్తారని సమాచారం. ఒకటి రవితేజకు టైలర్ మేడ్ అయిన హీరో పాత్ర కాగా, రెండోది రవితేజకు మాత్రమే సాధ్యమయ్యే మాస్ విలన్ పాత్ర అని అంటున్నారు. ఈ మేరకు రవితేజ మేకోవర్ కూడా సూపర్‌గా ఉంటుందని సమాచారం.
విలన్ పాత్ర కోసం ప్రోస్థటిక్ మేకప్ బాగా వాడారు అని తెలుస్తోంది. పాత్రను కూడా ఆ మేకప్ నేపథ్యంలోనే రాసుకున్నారట. అంటే ఇతర మనుషుల ముఖాలను ధరించి నేరాలు చేసే పాత్రలో రవితేజను సుధీర్ వర్మ చూపించబోతున్నట్టు వినికిడి. 2019 బెంగాలీలో వచ్చిన ‘విన్సీడా’ అనే సినిమా స్ఫూర్తితో ఈ సినిమా రూపొందిస్తున్నారట. అలాగే ఈ సినిమాలో సుశాంత్ ఓ కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పాత్ర కూడా ప్రత్యేకంగా నిలుస్తుంది అంటున్నారు.
‘ధమాకా’, ‘వాల్తేరు వీరయ్య’ లాంటి వరుస విజయాలతో ఊపు మీదున్న రవితేజ ఈ సినిమాతో ఆ జోరు కొనసాగించాలని అనుకుంటున్నాడు. అలాగే ఆ తర్వాత ‘ఈగల్’, ‘టైగర్ నాగేశ్వరరావు’ కూడా రెడీ చేస్తున్నారు. అలా వరుస విజయాలతో దూసుకుపోవాలనేది రవితేజ ఆలోచన అట. ‘ధమాకా’కి ముందు రవితేజకు విజయాలు లేక తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే.