మేడ మీద అబ్బాయి

  • September 8, 2017 / 12:04 PM IST

అల్లరి నరేష్ నటించిన 53వ సినిమా “మేడ మీద అబ్బాయి”. మలయాళ సూపర్ హిట్ సినిమా “ఒరు వడక్కన్ సెల్ఫీ”కి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రం నరేష్ కెరీర్ కు చాలా కీలకం. అందుకే ఒరిజినల్ వెర్షన్ డైరెక్టర్ అయిన ప్రజిత్ కే తెలుగు వెర్షన్ దర్శకత్వ బాధ్యతలు కూడా అప్పగించాడు. అన్నిటికంటే ముఖ్యంగా “జబర్దస్త్” కామెడీ షోలో తన సింగిల్ లైన్ పంచస్ తో విశేషమైన క్రేజ్ సంపాదించుకొన్న హైపర్ ఆదిని సినిమాలో ముఖ్యపాత్ర కోసం సెలక్ట్ చేసుకొన్నాడు. మరి నరేష్ ఇన్ని జాగ్రత్తలు తీసుకొని మరీ నటించిన “మేడ మీద అబ్బాయి” ఫలితం ఏమయ్యిందో చూద్దాం..!!

కథ : శీను (అల్లరి నరేష్) జీవితంలో ఒక ధ్యేయం లేకుండా తండ్రి సంపాదన మీద ఆధారపడి స్నేహితులతో కలిసి టైమ్ పాస్ చేస్తూ కాలం గడిపేస్తుంటాడు. ఇంజనీరింగ్ లో 24 సబ్జెక్టుల్లో ఫెయిల్ అవ్వడం, ఆ సబ్జెక్ట్స్ మళ్ళీ రాసినా పాసవుతానన్న నమ్మకం తనకే లేకపోవడంతో.. ఏదైనా ఉద్యోగం బదులు, సినిమా డైరెక్టర్ అయిపోదామనుకొంటాడు. అయితే.. శీను సినిమా తీయడానికి మాత్రమే కాదు దేనికీ పనికిరాడని, అందువల్ల తనతోపాటు కిరాణా షాప్ కి వచ్చి తనకు సహాయంగా ఉండమని చెబుతాడు తండ్రి.

సప్లీమెంటరీలో కూడా ఫెయిల్ అవ్వడంతో ఇక్కడే ఉంటే తననెక్కడ కొట్లో కూర్చోబెట్టేస్తారో అన్న భయంతో.. సినిమా డైరెక్టర్ అయిపోదామని ఇంట్లో చెప్పకుండా హైద్రాబాద్ ట్రైన్ ఎక్కేస్తాడు శీను. అదే ట్రైన్ లో తారసపడుతుంది తాను ఇష్టపడిన సింధు (నిఖిలావర్మ). తన ఫ్రెండ్స్ దగ్గర గొప్ప కోసం ఆమెకు తెలియకుండా ఆమెతో ఒక సెల్ఫీ తీసుకొని ఫ్రెండ్ బాబ్జీ (హైపర్ ఆది)కి పంపుతాడు శీను. ఆ ఒక్క సెల్ఫీతో శీను జీవితంలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటాయ్. ఆ మార్పులేమిటన్నది “మేడ మీద అబ్బాయి” సినిమా చూసి తెలుసుకోవాలి.

నటీనటుల పనితీరు : ఇప్పటికీ 52 సినిమాల్లో నటించిన అల్లరి నరేష్ కు ఈ సినిమాలో శీను పాత్ర “కేక్ వాక్” లాంటిది. చాలా సరదాగా చేసేశాడు. అయితే.. ఒరిజినల్ వెర్షన్ లో నటించిన నివిన్ పౌలీతో కంపేర్ చేసినప్పుడు మాత్రం అతడి స్థాయిలో పాత్రను పండించలేకపోయాడు. ఒరిజినల్ వెర్షన్ లో హీరో పాత్ర చాలా అమాయకమైనది కాగా.. తెలుగులో ముదురు బెండకాయ అన్నట్లుగా ఉంటుంది. ఇక నిఖిలావర్మ చూడ్డానికి పద్ధతిగా, ముద్దుగా కనిపించినప్పటికీ.. అభినయంతో మాత్రం మెప్పించలేకపోయింది. పైగా కొన్ని ఎమోషనల్ సీన్స్ లో కళ్ళలో భావనకి, ముఖంలో హావభావాలకి సంబంధం లేనట్లుగా కనిపించడం గమనార్హం.

హైపర్ ఆది సినిమా మొత్తం “జబర్డస్త్” శైలి పంచ్ డైలాగ్స్ తో అక్కడక్కడా నవ్వించినా.. ఓవరాల్ గా బోర్ కొట్టించాడు. తాను స్వయంగా రాసుకొన్న సింగిల్ లైన్ పంచ్ డైలాగులే అందుకు కారణం. నాలుగైదు పంచ్ డైలాగ్స్ అంటే పర్లేదు కానీ.. అస్తమానం ఆ “జబర్డస్త్ పంచ్”లు వినాలంటే ప్రేక్షకులకు మాత్రం విసుగు రాదా చెప్పండి. అవసరాల శ్రీనివాస్ ఒక డిఫరెంట్ షేడ్ ఉన్న పాత్రలో పర్వాలేదనిపించుకొన్నాడు.

సాంకేతికవర్గం పనితీరు : మలయాళ ఒరిజినల్ వెర్షన్ కు వర్క్ చేసిన సంగీత దర్శకుడు షాన్ రెహమాన్ తెలుగు వెర్షన్ కు కూడా సంగీత సారధ్యం వహించడంతో పెద్దగా ఇబ్బందిపడకుండా సేమ్ ట్యూన్స్ అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ వాడేశాడు. కుంజున్ని ఎస్.కుమార్ సినిమాటోగ్రఫీ రెగ్యులర్ గానే ఉంది. లైటింగ్ విషయంలో కాస్త జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది. ఇక ఎడిటింగ్, సౌండ్ రికార్డింగ్ అండ్ కలర్ మిక్సింగ్ వంటి టెక్నికల్ అంశాల గురించి ఎంత తక్కువ మాట్లాడుకొంటే అంత మంచిది.

ఒకసారి 500 మీటర్ల రన్నింగ్ రేసులో ఇసుకపై పరిగెట్టి ఫస్ట్ వచ్చినోడ్ని వెంటనే మళ్ళీ రేస్ పెట్టి ఫస్ట్ ప్లేస్ కొట్టాలి, అది కూడా కంకర్రాళ్లపై పరిగెట్టి అనే రూల్ పెడితే ఎలా ఉంటుందో.. మలయాళంలో “ఒరు వడక్కన్ సెల్ఫీ”తో హిట్ కొట్టిన ప్రజిత్ ను తెలుగులో అదే సినిమాతో మళ్ళీ హిట్ కొట్టమంటే కూడా అదే జరిగింది. మలయాళంలో నివిన్ పౌలీ ఇమేజ్, అతడి ఇన్నోసెంట్ పెర్ఫార్మెన్స్, నేటివిటీ “ఒరు వడక్కన్ సెల్ఫీ” విజయం సాధించడానికి ముఖ్యకారణాలు. కానీ.. తెలుగులో ఈ మూడు లేకపోవడం.. ఏమాత్రం మార్పులు చేయకుండా “ఫ్రేమ్ టు ఫ్రేమ్” దించేయడంతో “మేడ మీద అబ్బాయి” పూర్ రీమేక్ గా మిగిలిపోయింది.

విశ్లేషణ : మలయాళ ఒరిజినల్ వెర్షన్ చూసినవారికి “మేడ మీద అబ్బాయి” నచ్చడు. ఆ సినిమా చూడనివారికి సరిగా ఎక్కడు. సో, నరేష్ కి మరో చేదు జ్ణాపకంలా నిలిచిపోయే సినిమానే “మేడ మీద అబ్బాయి”. అయితే.. ఫస్ట్ టైమ్ నరేష్ నటుడిగానూ ఫెయిల్ అయ్యాడనిపిస్తుంది. మరి తదుపరి చిత్రాలతోనైనా నరేష్ విజయం సాధించాలంటే ఈ మూస ధోరణి నుండి బయటపడాల్సిందే.

రేటింగ్ : 1.5/5

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus