మెగా ఫ్యామిలీకి అవార్డులు రాకపోవడంపై బన్నీ వాసు కామెంట్!
November 20, 2017 / 09:51 AM IST
|Follow Us
ఒకేసారి మూడేళ్లకు కలిపి నంది అవార్డులను ప్రకటించినందుకు ప్రశంసలు కురుస్తాయనుకుంటే.. విరామర్శలను ఎదుర్కొంది టీడీపీ ప్రభుత్వం. మూడేళ్ళలో అవార్డులు అందుకొని వారి గళం కలిసేసరికి ఈ సారి వివాదం పెద్దదయింది. ఇప్పుడిప్పుడే ఈ విమర్శల పర్వం తగ్గుతోంది. అయితే నిన్న నంది అవార్డుల విషయంలో హైదరాబాద్ లోని దసపల్లా హోటల్లో ఓపెన్ డిబేట్ కార్యక్రమాన్ని ఏబీఎన్ నిర్వహించింది. ఈ డిబేట్ లో అవార్డులు రాని వారి గొంతుకను కొంతమంది వినిపించారు. వీరిలో ప్రధానంగా బన్నీవాసు ఉన్నారు. ఈ చర్చ కార్యక్రమంలో బన్నీ వాసు మాట్లాడుతూ.. “అవార్డుల ఎంపికలో రికమండేషన్సే ఎక్కువ. మా చిరంజీవి, మా ‘మెగా’ ఫ్యామిలీకి 2002 నుంచి అవార్డుల విషయంలో అన్యాయం జరిగింది” అని వెల్లడించారు.
గతంలో రామ్ చరణ్ నటించిన మగధీరకు అనేక కేటగిరీల్లో నంది అవార్డు ఇచ్చి ఉత్తమనటుడు కేటగిరీలో రామ్ చరణ్ కి ఇవ్వకుండా దాసరి నారాయణరావు కి ఇచ్చిన సంగతిని గుర్తుచేశారు. ఇలా అనేక అవార్డులు మెగా ఫ్యామిలీకి రాలేదని వివరించారు. అటు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా సమయంలో, ఇటు టీడీపీ పాలనలోను అన్యాయం జరగడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా అవార్డుల కోసం ఏ మెగా హీరో నటించడం లేదని, ప్రజలు గుండెల్లో స్థానం కోసం కష్టపడుతుంటారని స్పష్టం చేశారు.