Merlapaka Gandhi: రీమేక్ సినిమానా.. వామ్మో: మేర్లపాక గాంధీ
November 3, 2022 / 03:54 PM IST
|Follow Us
సినిమా ప్రమోషన్స్ అంటే ఇలా చేయాలి అనేలా సరికొత్తగా ఆలోచిస్తోంది ‘లైక్ షేర్ సబ్‌స్క్రైబ్’ టీమ్. హీరో సంతోష్ శోభన్, నటుడు సుదర్శన్ కలసి చిత్రవిచిత్రమైన ఆలోచనలతో ప్రమోషన్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో తమ సినిమా మీద తాము సెటైర్లు వేసుకుంటే భలేగా నవ్విస్తున్నారు. సినిమాలో కూడా ఇలాంటి మంచి నవ్వులు ఉంటాయి అని చెప్పకనే చెబుతున్నారు. అయితే తమ సినిమా ప్రమోషన్లతోపాటు చిరంజీవి కూడా తమకు చాలా సాయం చేశారు అని చెప్పారు దర్శకుడు మేర్లపాక గాంధీ.
కరోనా పరిస్థితులు – లాక్డౌన్ సమయంలో వచ్చిన ఓ ఆలోచనతో ‘లైక్ షేర్ సబ్స్క్రయిబ్’ సినిమా పుట్టిందట. ఆ సమయంలో చాలా మంది యూట్యూబ్ కంటెంట్‌కి అలవాటుపడ్డారు. అలా నేను కూడా యూట్యూబ్‌లో చాలా వీడియోలు చూశాను. ట్రావెల్ వీడియోలు చాలానే చూశాను. అప్పుడే ఓ యూట్యూబర్ కథ చెప్తే బాగుంటుందని అనిపించింది అని చెప్పారు దర్శకుడు మేర్లపాక గాంధీ. ట్రావెల్ వ్లాగర్లు, వాళ్లకున్న కష్టాలు, సవాళ్లు, ప్రమాదాల నేపథ్యంలో ‘లైక్ షేర్ సబ్స్క్రయిబ్’ సినిమా కథ ఉంటుంది అని చెప్పారు.
మా సినిమాకు ఏదో ఒక అద్భుతం జరగాలని ఎదురుచూశాం. అది చిరంజీవి గారి వల్ల జరిగింది. ‘వాల్తేరు వీరయ్య’ టీజర్ రూపంలో మాకు ఆ అవకాశం కలిగింది. ఆ సినిమా టీజర్ ఆఖరున చిరంజీవి ‘లైక్ షేర్ సబ్స్క్రయిబ్’ అనే డైలాగ్ చెప్పారు. దీంతో చాలామంది స్నేహితులు, నెటిజన్లు.. చిరంజీవి మీ సినిమా గురించి చెప్పారంటూ మమ్మల్ని ట్యాగ్ చేశారు. అది మా సినిమాకు చాలా ఉపయోగపడింది అని చెప్పారు మేర్లపాక గాంధీ.
తన తర్వాతి సినిమాల గురించి చెబుతూ మేర్లపాక గాంధీ రీమేక్‌లపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, యూవీ క్రియేషన్స్, నిహారిక ఎంటర్టైన్మెంట్తోపాటు, నిర్మాత కృష్ణకు సినిమాలు చేయాల్సి ఉంది. అవన్నీ కొత్త కథలతోనే సినిమాలు చేస్తాను తప్ప, రీమేక్ చేయను అని క్లారిటీ ఇచ్చేశారు. ‘అంధాధున్’ రీమేక్‌ని అనుభవం కోసమే చేశాను తప్ప. తర్వాత అలాంటి ఆలోచనే చేయలేదు అని క్లారిటీ ఇచ్చారు గాంధీ.