‘చెప్పాలని ఉంది’ యూత్ అంతా చూడాల్సిన సినిమా: మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
December 1, 2022 / 12:31 AM IST
|Follow Us
ప్రతిష్టాత్మక సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఆర్.బి చౌదరి సమర్పణలో రూపొందిన 94వ చిత్రం ‘చెప్పాలని ఉంది’. ‘ఒక మాతృభాష కథ’ అనేది ఉప శీర్షిక. యష్ పూరి, స్టెఫీ పటేల్ ప్రధాన పాత్రలలో అరుణ్ భారతి ఎల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని వాకాడ అంజన్ కుమార్, యోగేష్ కుమార్ నిర్మించారు. అస్లాం కీ సంగీతం అందించారు. డిసెంబర్ 9న థియేటర్స్ లో విడుదకానున్న ఈ చిత్రం ఆడియో రిలీజ్ వేడుక గ్రాండ్ గా జరిగింది. తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, హీరో నిఖిల్ ఈ వేడుకకు ముఖ్య అతిధులు పాల్గొన్నారు. ఈ వేడుకలో యష్ పూరి, స్టెఫీ పటేల్ ఆల్బమ్ లోని పాటలకు వేదికపై డ్యాన్స్ చేయడం ప్రేక్షకులని అలరించింది.
తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. యువత ఎంతో సంతోషంగా చూడాల్సిన సినిమా ‘చెప్పాలని ఉంది’. హీరోగా పరిచయం అవుతున్న యష్ పూరికి అభినందనలు. యష్ పూరి తల్లితండ్రులు సంతోషపడే రోజిది. తెలుగు చిత్ర పరిశ్రమలో యువతకు గొప్ప అవకాశం వుంది. వారికీ అవకాశం ఇస్తే అద్భుతాలు సృష్టిస్తారు. యువతని ప్రోత్సహించడానికి మా వంతు పూర్తి సహాయ సహకారాలు వుంటాయి. యష్ పూరి మంచి ప్రతిభ గల నటుడు. ఒక సవాల్ గా తీసుకొని ఎంతో కష్టపడి ఈ సినిమా చేశారు. ఈ సినిమా విడుదల తర్వాత తనకి బ్రహ్మాండమైన మార్కెట్, అన్ని చోట్ల మంచి గుర్తింపు వస్తుందనే నమ్మకం వుంది. యష్ పూరి నాన్నగారు నా చిన్నప్పటి స్నేహితుడు. నా పూర్తి సహాయ సహకారాలు అందిస్తాను. దర్శకుడు అరుణ్ కూడా ఒక సవాల్ గా తీసుకొని సినిమాని చేశారు. సూపర్ గుడ్ ఫిల్మ్స్, ఆర్.బి చౌదరి, హీరోయిన్ స్టెఫీ పటేల్.. ఈ చిత్రంలో పని చేసిన అందరికీ నా అభినందనలు. తెలుగు చిత్ర పరిశ్రమకు యువత రావాల్సిన అవసరం వుంది. నేపధ్యంతో పని లేకుండా ప్రతిభతో చరిత్ర సృష్టించే అవకాశం సినిమా పరిశ్రమలో వుంటుంది. యష్ పూరి భవిష్యత్ లో మున్ముందుకు వెళ్ళాలి” అని పేర్కొన్నారు.
నిఖిల్ మాట్లాడుతూ..’చెప్పాలని ఉంది’ ట్రైలర్ చూశాను. యష్ పూరి చాలా బావున్నాడు. హీరోయిన్ స్టెఫీ పటేల్ కూడా అందంగా వుంది. సినిమా అద్భుతంగా ఉంటుందనే నమ్మకం వుంది. టీం అందరికీ నా బెస్ట్ విశేష్. మన యూత్ సినిమా ఇది. ‘చెప్పాలని ఉంది’ సినిమాని అందరం థియేటర్లో చూద్దాం” అన్నారు.
యష్ పూరి మాట్లాడుతూ ..ఈ సినిమా కోసం మా టీం అంతా చాలా కష్టపడ్డాం. కాశ్మీర్ లో చాలా ప్రతికూలమైన పరిస్థితులలో పదిహేను రోజుల పాటు షూట్ చేశాం. ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ లా ఉండాలనే ఆ రిస్క్ చేశాం. మంచి సినిమా ఖచ్చితంగా ఆడుతుందనే నమ్మకం వుంది. ఈ వేడుకకు వచ్చిన మంత్రి తలసాని గారికి, నిఖిల్ కి కృతజ్ఞతలు. మీ అందరి సపోర్ట్ కావాలి. డిసెంబర్ 9 నుండి సినిమా మీ చేతుల్లో వుంటుంది. ‘చెప్పాలని ఉంది’ కి ఫస్ట్ డే ఫస్ట్ డే ఫస్ట్ షో అందరూ వెళ్లాలని ఆశిస్తున్నాను. ఈ సినిమా మీకు నచ్చితే అందరికీ చెప్పాలి. మీరే ఒక వేవ్ క్రియేట్ చేయాలి. ఇద్కొక్క మాటే చెప్పాలని వుంది” అన్నారు.
స్టెఫీ పటేల్ మాట్లాడుతూ.. యాక్టింగ్ నా డ్రీమ్. ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన సూపర్ గుడ్ ఫిలిమ్స్ కి బిగ్ థాంక్స్. దర్శకుడు అరుణ్ గారు వెన్నెల అనే అద్భుతమైన పాత్ర ఇచ్చారు. అస్లామ్ గారు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. సినిమా తప్పకుండా మీ అందరికీ నచ్చింది. డిసెంబర్ 9న సినిమా వస్తోంది. అందరూ థియేటర్ లో చూడాలి” అని కోరారు.
దర్శకుడు అరుణ్ మాట్లాడుతూ.. ‘చెప్పాలని ఉంది’ ఒక విధంగా పాన్ ఇండియా ఫిలిం. అన్ని భాషల్లో వుండే సాంకేతిక నిపుణులు, నటీనటులు ఈ సినిమా కోసం పని చేశాం. డిసెంబర్ 9న ‘చెప్పాలని ఉంది’ విడుదలౌతుంది. మీ అందరికీ సపోర్ట్ కావలి” కోరారు.
సంగీత దర్శకుడు అస్లాం కీ మాట్లాడుతూ.. సూపర్ గుడ్ ఫిలిమ్స్ కి మ్యూజిక్ చేయడం ఒక గౌరవం. దర్శకుడు అరుణ్ అద్భుతమైన కథని తెరపై ఆవిష్కరించారు. ఈ సినిమా మ్యూజిక్ కథ నుండి పుట్టింది. సినిమా పాటలు మీ అందరికీ నచ్చడం ఆనందంగా వుంది. సినిమా ఖచ్చితంగా మిమ్మల్ని అలరిస్తుంది” అన్నారు.
సి. కళ్యాణ్ మాట్లాడుతూ.. సూపర్ గుడ్ ఫిలిమ్స్ ప్రతిష్టత్మకమైన సంస్థ. వారితో హమ్స్ టెక్ ఫిలిమ్స్ కలవడం చాలా శుభపరిణామం. హీరో యష్ పూరి చాలా ఎనర్జిటిక్ గా వున్నాడు. ఖచ్చితంగా ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుంది” అన్నారు.