Miss Shetty Mr Polishetty Review in Telugu: మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా రివ్యూ & రేటింగ్!

  • September 7, 2023 / 02:40 PM IST

Cast & Crew

  • నవీన్ పోలిశెట్టి (Hero)
  • అనుష్క శెట్టి (Heroine)
  • మురళీ శర్మ, జయసుధ, అభినవ్ గోమటం, సోనియా దీప్తి, తులసి తదితరులు.. (Cast)
  • మహేష్ బాబు.పి (Director)
  • వంశి-ప్రమోద్ (Producer)
  • రధన్ - గోపీసుందర్ (Music)
  • నిరవ్ షా (Cinematography)

“ఏజెంట్ సాయిశ్రీనివాస్ ఆత్రేయ, జాతిరత్నాలు” లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ అనంతరం నవీన్ పోలిశెట్టి నటించిన తాజా చిత్రం “మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి”. అనుష్క శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాపై మొదటి నుంచి మంచి అంచనాలున్నాయి. విడుదలైన పాటలు పెద్దగా ఆకట్టుకోలేకపోయినా.. సెకండ్ ట్రైలర్ మాత్రం సినిమాకి మంచి బజ్ క్రియేట్ చేసింది. చాన్నాళ్ల డిలే అనంతరం ఎట్టకేలకు నేడు (సెప్టెంబర్ 07) విడుదలవుతున్న ఈ చిత్రం ఆడియన్స్ ను ఏమేరకు ఆకట్టుకోగలుగుతుందో చూద్దాం..!!

కథ: లండన్ లోని మోస్ట్ సక్సెస్ ఫుల్ చెఫ్ లలో ఒకరు అన్విత (అనుష్క శెట్టి), కెరీర్ లో ఎంత బాగా సెటిలైనా.. పెళ్లి చేసుకోలేదని మాత్రం తల్లి తెగ బాధపడిపోతుంటుంది. పెళ్లి చేసుకోవడంపై మంచి భావన లేని అన్వితకు స్టాండప్ కమెడియన్ సిద్ధు (నవీన్ పోలిశెట్టి) పరిచయమవుతాడు.

తల్లి మరణం అనంతరం.. పెళ్లి చేసుకోవాలని లేకపోయినా, ఒక తోడు కోసం డోనర్ ద్వారా పిల్లల్ని కనాలి అనుకుంటుంది. అందుకోసం సిద్ధు సహాయం అడుగుతుంది.

అప్పటికీ.. అన్విత మీద పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన సిద్ధు ఆమెకు సహాయం చేయగలిగాడా? అసలు అన్విత పెళ్ళికి ఎందుకు విరుద్ధం? చివరికి అన్విత-సిద్ధుల జంట కలిసిందా? వంటి ప్రశ్నలకు సమాధానమే “మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి” చిత్రం.

నటీనటుల పనితీరు: కామెడీ టైమింగ్ తో నవీన్ పోలిశెట్టి మరోమారు సినిమాను తన భుజస్కంధాలపై మోశాడు. కామెడీతోపాటు ఈసారి ఎమోషన్స్ సీన్స్ తోనూ మెప్పించాడు. ఆఫ్ స్క్రీన్ మాత్రమే కాదు ఆన్ స్క్రీన్ కూడా ఎవరి పక్కనైనా అడ్జస్ట్ అయిపోవడం నవీన్ పోలిశెట్టికి వెన్నతో పెట్టిన విద్య. ఈ సినిమాలోనూ అనుష్క పక్కన ఒదిగిపోయాడు. నిజానికి ఇద్దరి పెయిర్ కు పెద్దగా ప్రామిసింగ్ కెమిస్ట్రీ లేదు. కానీ.. నవీన్ తన పాత్రలో ఇమిడిపోయే విధానం వల్ల ఆ లోటు కనిపించదు. ఇద్దరి కాంబినేషన్ బాలేదు అని ప్రేక్షకులకు ఆలోచన వచ్చినప్పుడల్లా తన స్క్రీన్ ప్రెజన్స్ తో ఆ విషయాన్ని మర్చిపోయేలా చేశాడు.

అనుష్కకు నటిగా పేరు పెట్టాల్సిన పని లేదు. కాకపోతే.. ఆమెను కాస్త సన్నగా చూపించడం కోసం చిత్రబృందం వృధా ప్రయాస పడ్డారు. ఎక్కడలేని ఫిల్టర్లు, గ్రాఫిక్స్ వాడి ఆమెను సన్నగా చూపించే ప్రయత్నం బెడిసికొట్టింది. మరీ ముఖ్యంగా కాంబినేషన్ సీన్స్ లో ఆమె క్లోజప్ షాట్స్ సదరు ఫిల్టర్లు/సీజీ వర్క్ కారణంగా మరీ ఎబ్బెట్టుగా ఉంది. సహజ సుందరి అయిన అనుష్కను నేచురల్ గానే చూపించి ఉంటే ఇంకా బాగుండేది. పోనీ ఆదేమైనా గ్లామర్ రోల్ అనుకుంటే అది కూడా కాదు. మరి ఎందుకని ఈ అనవసరమైన గ్రాఫిక్స్ వాడారో మేకర్స్ కే తెలియాలి. ఆ ఫిల్టర్ల వల్ల సినిమాకి ఎంత ప్లస్ అయ్యిందో తెలియదు కానీ.. అనుష్క అభిమానులు మాత్రం బాధపడేలా చేసింది.

చాన్నాళ్ల తర్వాత సోనియా దీప్తి తెరపై కనిపించింది. ఆమె చాలా ఈజ్ తో నటిస్తుంది. ముఖ్యంగా ఆమె డైలాగ్ డెలివరీ బాగుంటుంది. ఆమెను ఎందుకో తెలుగులో సరిగా వినియోగించుకోలేకపోయారు అనిపిస్తుంది. తండ్రి పాత్రలో మురళీశర్మ, తల్లి పాత్రలో జయసుధ, తులసి తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతికవర్గం పనితీరు: రధన్ పాటలు కానీ, గోపీసుందర్ నేపధ్య సంగీతం కానీ సినిమాకి పాజిటివ్ పాయింట్ గా నిలవలేకపోయాయి. పైపెచ్చు సదరు పాటల ప్లేస్ మెంట్ సినిమాకి మైనస్ గా నిలిచింది. సినిమాటోగ్రఫీ వర్క్ మాత్రం డీసెంట్ గా ఉంది. యువి ప్రొడక్షన్ వారి కాస్ట్లీ ప్రొడక్షన్ డిజైన్ ప్రతి ఫ్రేమ్ లో కనిపించింది. ఆర్ట్ డిపార్ట్మెంట్ & కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ కి డబ్బు ధారాళంగా పోశారు అనిపిస్తుంది.

“ఒక అబ్బాయి తొలి చూపులోనే అమ్మాయిని ప్రేమిస్తాడు, ఆమెను సాధించుకోవడం కోసం నానా తిప్పలు పడతాడు” అనే అత్యంత రెగ్యులర్ కాన్సెప్ట్ కథకు దర్శకుడు మహేష్ బాబు “డోనార్” పాయింట్ యాడ్ చేసి కాస్త కొత్తదనం చూపించే ప్రయత్నం చేశాడు. కానీ.. రాసుకున్న పేలవమైన కథనం కారణంగా ఆ కొత్తదనం ఎలివేట్ అవ్వలేదు. ముఖ్యంగా ఫస్టాఫ్ బాగా సాగదీశాడు. సెకండాఫ్ కూడా స్ట్రయిట్ గా పాయింట్ కి రాకుండా మరీ ఎక్కువ మెలికలు తిప్పాడు. అందువల్ల ఎమోషనల్ గా కాస్త స్ట్రాంగ్ అయిన సెకండాఫ్ కూడా బోర్ కొట్టిస్తుంది. పాటలు, స్క్రీన్ ప్లే విషయంలో జాగ్రత్త తీసుకొని ఉంటే మంచి హిట్ కొట్టేవాడు మహేష్ బాబు.

అయితే.. అనుష్క-నవీన్ ల కాంబినేషన్ సెట్ చేసుకోగలగడం, ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ను కథనానికి ముఖ్యాంశంగా వాడుకోవడం వంటివి ఒక ఫిలిమ్ మేకర్ గా అతడికి ఉన్న మెచ్యూర్ ఐడియాలజీని పరిచయం చేసినప్పటికీ.. ఆచరణ రూపంలో మాత్రం చాలా తడబడ్డాడు. తదుపరి సినిమాల విషయంలో ఈ తబబాటు పక్కనపెట్టగలిగితే మంచి భవిష్యత్ ఉంది.

విశ్లేషణ: ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్ కి వెళ్తే హాయిగా ఆస్వాదించగలిగే చిత్రం “మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి”. నవీన్ పోలిశెట్టి అద్భుతమైన కామెడీ టైమింగ్, నీట్ ప్రొడక్షన్ డిజైన్ & సెకండాఫ్ లోని ఎమోషన్స్ సినిమాకి ప్లస్ పాయింట్స్ గా నిలవగా.. అనుష్కకు చేసిన సీజీ, సాగిన స్క్రీన్ మైనస్ లుగా చెప్పుకోవాలి. ఈ రెండు విషయాల్లో ఇంకాస్త జాగ్రత్త తీసుకొని ఉంటే సినిమా సూపర్ హిట్ అయ్యేది.

రేటింగ్: 3/5

Click Here To Read in ENGLISH

Rating

3
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus