జర్మనీకి చెందిన ప్రముఖ మోడల్ పై రెండు చిరుత పులులు దాడి చేసినట్లు తెలుస్తోంది. తూర్పు జర్మనీలోని అటవీ ప్రాంతం సమీపంలో ఫోటోషూట్ నిర్వహిస్తుండగా.. ఈ ఘటన జరిగినట్లు సమాచారం. సదరు మోడల్ పేరు జెస్సికా లీడోల్ఫ్(36). అందుతున్న సమాచారం ప్రకారం.. తూర్పు జర్మనీ సాక్సోనీ-అన్హాల్ట్ రాష్ట్రంలో నెబ్రా అనే ప్రైవేటు స్థలంలో ఓ వ్యక్తి జంతువుల ప్రదర్శన కోసం రిటైర్మెంట్ హోమ్ ను నడిపిస్తున్నాడు.చిరుతలు ఉన్న బోనుకి సమీపంలో జెస్సికా ఫోటోషూట్ లో పాల్గొనగా..
రెండు చిరుతలు ఒక్కసారిగా ఆమెపై దాడి చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఆమెని హెలికాఫ్టర్ ద్వారా హాస్పిటల్ కి తరలించగా.. డాక్టర్లు ట్రీట్మెంట్ అందించినట్లు స్థానిక పోలీసులు మీడియాతో చెప్పారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని సమాచారం. ఆమె తలకు తీవ్ర గాయాలు కావడంతో వైద్యులు సర్జరీ చేశారని పోలీసులు చెప్పినట్లు మీడియా వెల్లడించింది. అయితే తన తల, చెవులు, చెంపలపై చిరుతలు పదే పదే దాడి చేశాయని జెస్సికా స్థానిక మీడియాతో పేర్కొన్నట్లు సమాచారం.
ప్రస్తుతం ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనపై వివరణ ఇవ్వమని రిటైర్మెంట్ హోమ్ యజమానిని అడగగా.. ఆయన నిరాకరించినట్లు తెలుస్తోంది. దీంతో ఆయనపై కేసు నందుకు చేసి విచారణ చేపట్టారు.