డైలాగ్ కింగ్ మోహన్ బాబు (Mohan Babu) మనసులో ఉన్నదీ ఉన్నట్టు మాట్లాడుతారు. వెండితెరపై డైలాగులు చెప్పినట్టే.. నిజజీవితంలోను తప్పుచేసిన వాళ్లపై విరుచుకుపడుతుంటారు. మన దేశంలోని రాజకీయనాయకుల తీరుని ఆయన అనేక సార్లు విమర్శించారు. రాష్ట్రంలో, దేశంలో పెరిగిపోతున్న అవినీతి, కుంభకోణాలు చూసి ఆవేశం, ఆగ్రహంతో ట్వీట్ చేశారు. ‘‘మనిషికి ఉన్నది ఒకే ఒక పొట్ట.. దానికి కావాల్సింది రెండు పూటలా తిండి.. కానీ మీరు మీ బిడ్డలకు.. బిడ్డల బిడ్డలకు కావాల్సినంత దోచుకుని.. దేశంలో బ్యాంకులు చాలక స్విస్ బ్యాంకుల్లో దేశ సంపదని దాచి పెట్టుకుంటున్నారు. రేయ్.. ఎంత సంపాదించినా చివరకు మిగిలేది ఆరడుగుల నేల..
గుప్పెడు బూడిద’’ అని తెలుగులో ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ రాజకీయ నాయకుల్ని మాత్రమే కాకుండా బ్యాంకులకు టోకరా వేసిన వ్యాపారవేత్తల్ని కలిపి విమర్శిస్తున్నట్లుగా ఉంది. విజయ్ మాల్యా.. నీరవ్ మోడీ లాంటి వాళ్లు వేల కోట్లకు బ్యాంకుల్ని ముంచి విదేశాలకు పారిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా కనిష్క్ జువెలరీ యాజమాన్యం కూడా ఇలాగే చేసి విదేశాలకు వెళ్లిపోయింది. ఈ కుంభకోణం బయటపడ్డ నేపథ్యంలోనే మోహన్ బాబు స్పందించారు. మోహన్ బాబు ట్వీట్ ఇప్పుడు సినీ వర్గాల్లోనే కాకుండా, రాజకీయ నాయకుల్లోను చర్చనీయాంశమైంది.