టికెట్‌ రేట్లపై ప్రభుత్వ వాదన నెగ్గుతుందా…

  • December 20, 2021 / 10:06 PM IST

ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల ధరల విషయం లెక్క ఇంకా తేలడం లేదు. ఈ విషయంలో కోర్టు మెట్లు ఎక్కడంతో… తీర్పు కోసం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా ఈ విషయంలో ప్రభుత్వం చిన్నపాటి క్లారిటీ ఇచ్చింది. అయితే ఉండాల్సిన కన్‌ఫ్యూజ్‌ అలానే ఉండిపోయింది. ఏపీలో సినిమా టికెట్ల ధరల నియంత్రణను ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకుంటూ… జీవో నె0 35ను విడుదల చేసిన విషయం తెలిసిందే. దానిని సవాలు చేస్తూ… కొంతమంది థియేటర్ల యజమానులు, ప్రదర్శనకారులు హైకోర్టుకి వెళ్లారు. ‘పుష్ప’ సినిమాకు ముందు ఇది జరిగింది.

దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం సింగిల్‌ బెంచ్‌ ప్రభుత్వం జీవోను కొట్టిపారేసింది. దీంతో ప్రభుత్వం డివిజన్‌ బెంచ్‌కి వెళ్లింది. తాజాగా డివిజన్‌ బెంచ్‌ ఎదుట మరోసారి వాదనలు జరిగాయి. ఈ క్రమంలో జీవో నెం.35 రద్దు రాష్ట్రంలోని అన్ని థియేటర్‌లకు వర్తిస్తుందని ప్రభుత్వం తరపున ఏజీ శ్రీరామ్‌ కోర్టుకు తెలిపారు. గత విచారణ సందర్భంగా పిటిషనర్లకు మాత్రమే ఈ జీవో రద్దు అంశం వర్తిస్తుందని, రేట్లు నిర్ణయించుకునే అధికారం వారికి మాత్రమే ఉంటుందని హోం శాఖ తెలిపింది.

దీంతో రాష్ట్రంలో గందరగోళం నెలకొంది. సోమవారం విచారణలో ఈ విషయంలో పూర్తి స్పష్టత వచ్చింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా థియేటర్ల యజమానులు టికెట్‌ల ధరలు పెంచుకోవచ్చు. అయితే జీవో నె0.35 కొట్టివేత విషయం మాత్రం సోమవారం వాదనల్లో తేలలేదు. విచారణను తిరిగి గురువారానికి వాయిదా వేశారు. సోమవారం జరిగిన వాదనల్లో… ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరామ్‌ మాట్లాడారు. అన్ని వర్గాలకూ తక్కువ ధరకే వినోదాన్ని అందించాలనేదే ప్రభుత్వ ఉద్దేశమని ఏజీ… న్యాయస్థానానికి తెలిపారు.

సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల వల్ల చాలా చోట్ల టికెట్‌ రేట్లు ఇష్టానుసారంగా పెంచుకునే అవకాశం ఉంటుందని ఏజీ హైకోర్టులో వివరించారు. ఇక అంశంపై గత వాదనల సందర్భంగా డివిజన్‌ బెంచ్‌ చెప్పినట్లు కమిటీ ఏర్పాటు చేశామని, దానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు. దీనికి ఏజీ కొంత సమయం కోరారు. ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు డివిజన్‌ బెంచ్‌… ప్రభుత్వ వాదనలతో కోర్టు ఏకీభవిస్తుందా? లేదా సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును యథాతథంగా కొనసాగిస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది.

పుష్ప: ది రైజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘పుష్ప’ చిత్రంలో ఆకర్షించే అంశాలు..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus