భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఇండో అమెరికన్ మూవీ మోసగాళ్లు. ఈ మూవీ విశేషాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. కాగా నేడు విడుదలైన మూవీ టీజర్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచేస్తుంది. అమెరికాలో జరిగిన 450 మిలియన్ డాలర్ స్కామ్ గురించి మీడియాతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడడం విశేషం. ఈ భారీ స్కామ్ కి పాల్పడిన వారిని వదిలేది లేదని, పట్టుకొని అంతు చూస్తానని ట్రంప్ వార్నింగ్ ఇస్తున్నాడు. దీనితో మోసగాళ్లు సినిమా నేపథ్యం ప్రధాన భాగం అమెరికాలో సాగుతుందని చెప్పవచ్చు.
ఇక మోసగాళ్లు చేసిన ఐ టి స్కామ్ వలన అమెరికా దేశానికే నష్టం వాటిల్లినట్టు చూపిస్తున్నారు. సంచుల కొద్దీఉన్న కరెన్సీ నోట్లను ఉద్దేశిస్తూ కాజల్ ‘ఇవి సరిపోతాయా’ అని విష్ణుని అడుగగా ‘ఆట ఇప్పుడే మొదలైందని’ ఆయన చెప్పడం ఆసక్తి కలిగిస్తుంది. ప్రపంచంలోనే అతి పెద్ద ఐ టి స్కామ్ నేపథ్యంలో మోసగాళ్లు మూవీ తెరకెక్కుతున్నట్లు ఎప్పుడో ప్రకటించడం జరిగింది. టీజర్ తరువాత ఆ మోసగాళ్లు విష్ణు, కాజల్ అని స్పష్టం అవుతుంది. ఈ మూవీలో వీరిద్దరూ అన్నా చెల్లెళ్లుగా కనిపిస్తారని తెలుస్తుండగా, వీరికి అంత పెద్ద స్కామ్ చేయాల్సిన అవసరం ఏమిటనేది కీలకం కావచ్చు.
హాలీవుడ్ దర్శకుడు జెఫ్రీ గే చిన్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో అల్లు అర్జున్ క్యామియో రోల్ చేయడం విశేషం. మోసగాళ్ల పనిబట్టే పోలీస్ అధికారిగా అల్లు అర్జున్ కొద్దినిమిషాల పాత్రలో తళుక్కున మెరవనున్నారు. బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి మరో కీలక రోల్ చేస్తున్నారు. తెలుగు, హిందీతో పాటు కన్నడ, మలయాళ మరియు తమిళ భాషలలో ఈ చిత్రం విడుదల కానుంది.