Mr Bachchan Review in Telugu: మిస్టర్ బచ్చన్ సినిమా రివ్యూ & రేటింగ్!

  • August 15, 2024 / 12:25 AM IST

Cast & Crew

  • రవితేజ (Hero)
  • భాగ్యశ్రీ బోర్సే (Heroine)
  • జగపతి బాబు, సచిన్ ఖేడేకర్, సత్య, నెల్లూరు సుదర్శన్, తదితరులు (Cast)
  • హరీష్ శంకర్ (Director)
  • టీజీ విశ్వ ప్రసాద్ (Producer)
  • మిక్కీ జె మేయర్ (Music)
  • అయనంక బోస్ (Cinematography)

మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) తనకిష్టుడైన దర్శకుల్లో ఒకరైన హరీష్ శంకర్ (Harish Shankar) దర్శకత్వంలో నటించిన మూడో చిత్రం “మిస్టర్ బచ్చన్ (Mr Bachchan)”. హిందీలో 2018లో విడుదలైన “రెయిడ్” అనే చిత్రానికి రీమేక్ గా హరీష్ శంకర్ మార్క్ “మార్పులు” ప్రత్యేక ఆకర్షణగా రూపొందిన “మిస్టర్ బచ్చన్” పాటలు, ట్రైలర్ & ప్రమోషన్స్ సినిమాను ప్రేక్షకులకు బాగా చేరువయ్యేలా చేశాయి. మరి సినిమా ప్రేక్షకుల్ని ఏమేరకు అలరించిందో చూద్దాం..!!

Mr Bachchan Review

కథ: ఆనంద్ అలియాస్ మిస్టర్ బచ్చన్ (రవితేజ) ఆదాయపన్ను శాఖలో కీలకమైన ఉద్యోగి, దొంగ సొమ్మును వెతికి పట్టుకోవడంలో సిద్ధహస్తుడు. ఎదుట నిలబడింది ఎంతటి పరపతి ఉన్న వ్యక్తైనా తలొగ్గని ధీశాలి. అటువంటి సిన్సియర్ ఆఫీసర్ కి విపరీతమైన రాజకీయ పలుకుబడి, అంతకుమించిన బలుపు ఉన్న ముత్యం జగ్గయ్య (జగపతిబాబు) ఇంత రెయిడ్ చేయాల్సిన బాధ్యతను నిర్వర్తించడానికి పూనుకుంటాడు.

దొంగ సొమ్మును బయటకు తీయాలన్న ధ్యేయంతో దృఢంగా నిల్చున్న బచ్చన్, పాపపు సొమ్మును కాపాడుకోవాలన్న ఆశతో ఆవేశపడే ముత్యం జగ్గయ్యల నడుమ జరిగిన ప్రచ్ఛన్న యుద్ధమే “మిస్టర్ బచ్చన్” చిత్రం.

నటీనటుల పనితీరు: రవితేజ స్టైలింగ్ విషయంలో చాన్నాళ్ల తర్వాత జాగ్రత్త తీసుకొని, 90’s లుక్ లో సూపర్ స్టైలిష్ & నీట్ గా కనిపించాడు. ఇక తెరపై రవితేజ ఎనర్జీ గురించి కొత్తగా చెప్పేది ఏముంటుంది. పంచ్ డైలాగులు, మాస్ ఫైట్స్ & టైమింగ్ తో ఇరగ్గొట్టేశాడు. డిస్కో రాజా తర్వాత రవితేజ స్టైలింగ్ ను కాస్త సీరియస్ గా తీసుకున్నది ఈ చిత్రంలోనే.

భాగ్యశ్రీ బోర్సేకు(Bhagyashree Borse) ఆల్రెడీ తెలుగు రాష్ట్రాల్లో ఫ్యాన్ క్లబ్స్ మొదలైపోయాయి. చాన్నాళ్ల తర్వాత ప్రేక్షకులు పాటల కోసం వెయిట్ చేసేలా చేసిందీ సుందరి. రవితేజ ఎనర్జీకి తగ్గట్లుగా డ్యాన్సులు చేస్తూ, అసభ్యంగా కనిపించకుండానే అందాలు ఆరబోస్తూ.. చక్కని స్క్రీన్ ప్రెజన్స్ తో అలరించింది. సరిగ్గా ప్లాన్ చేసుకుంటే నెక్స్ట్ స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

అహంకారానికి నిలువెత్తు రూపం లాంటి ముత్యం జగ్గయ్య పాత్రలో జగపతిబాబు ఒదిగిపోయడానికి ప్రయత్నించిన తీరు ప్రశంసనీయం. సత్య తనదైన శైలి కామెడీ టైమింగ్ తో మరో ఎక్కువ మార్కులు కొట్టేశాడు. ముఖ్యంగా మందు సిట్టింగులో హిందీ పాటలకు సత్య ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్.. హిందీ పాటలు వినని, అర్థం కాని ప్రేక్షకుల మైండ్ వాయిస్ ను తెరపై చూసినట్లుగా ఉంటుంది. చమ్మక్ చంద్ర, అన్నపూర్ణమ్మ సీరియస్ సందర్భాలలో కూడా నవ్వించేందుకు ప్రయత్నించి ఓ మేరకు ఆకట్టుకొన్నారు.

సాంకేతికవర్గం పనితీరు: మిక్కీ జె.మేయర్ ఈ సినిమా విషయంలో సర్ప్రైజ్ ప్యాకేజ్. మొన్న ఒక రియాలిటీ షోలో తమన్ అన్నట్లుగా భవిష్యత్ లో ఎవరైనా ఈ పాటలు విని “ఏంటి మిక్కీ ఈ సాంగ్స్ కొట్టాడా?” అని షాక్ అవ్వడం ఖాయం. ప్రతి పాటకి మాస్ ఆడియన్స్ నుండి క్లాస్ ఆడియన్స్ వరకు అందరూ కనెక్ట్ అయ్యారు. అలాగే నేపధ్య సంగీతం విషయంలోనూ ఏమాత్రం తగ్గలేదు మిక్కీ.

అయనాంక బోస్ సినిమాటోగ్రఫీ వర్క్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్ డిజైన్ బాగున్నాయి. నిజానికి ఈ సినిమా వర్కింగ్ డేస్ తక్కువే అయినప్పటికీ.. ప్రీప్రొడక్షన్ విషయంలో తీసుకున్న జాగ్రత్త & ప్లానింగ్ పుణ్యమా అని ఎక్కడా లోటుపాట్లు కనిపించలేదు.

దర్శకుడు హరీష్ శంకర్ “మార్పులు” కమర్షియల్ యాంగిల్ లో “మిస్టర్ బచ్చన్”కు ప్లస్ పాయింట్ గా నిలిచినా, ఒరిజినల్ సినిమా చూసినవారిని మాత్రం ఇబ్బందిపెడతాయి. ముఖ్యంగా ఆదాయపన్ను శాఖ ఉద్యోగులను తక్కువ చేస్తూ చూపించిన కొన్ని సన్నివేశాలు చిన్నపాటి మైనస్ గా చెప్పుకోవాలి. అయితే.. సీరియస్ గా సాగుతున్న సినిమాలో కరెక్ట్ టైమ్ కి పాటలను ప్లేస్ చేసిన తీరు, యాక్షన్ బ్లాక్స్ ను కంపోజ్ చేసిన తీరు ఆకట్టుకుంటుంది. హిందీలో చాలా సీరియస్ నోట్ లో తెరకెక్కిన “రెయిడ్” చిత్రాన్ని తెలుగులో అలాగే తీస్తే పొరపాటున కూడా థియేటర్లలో ఆడదు. ఆ విషయం హరీష్ శంకర్ కు బాగా తెలుసు, అందుకే కుదిరినన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ను జోడింది.. సీరియస్ సినిమాను కాస్త ఎంటర్టైనింగ్ గా మార్చేశాడు. అయితే.. అక్కడక్కడా వచ్చే ద్వంద్వార్ధపు సింగిల్ లైన్స్ మినహా ఎక్కడా శృతి మించకపోవడం గమనార్హం.

ముఖ్యంగా అమ్మాయి తాను ఇబ్బందిపడుతున్నాను అని చెప్పినప్పుడు హీరో ఆమె అభీష్టానికి మర్యాద ఇస్తూ పక్కకు తప్పుకునే సన్నివేశం ఒక రచయితగా అతడ్ని ఒక మెట్టు ఎక్కించింది. ఇదేమీ కొత్తగా హరీష్ రాసిన సన్నివేశమో, సంభాషణో కాదు కానీ ఒక కమర్షియల్ సినిమాలో, అందులోనూ ఆకతాయితనం హీరోయిజంగా మారిపోయిన తరుణంలో ఈ తరహా సన్నివేశం కొంతమేరకైనా కొందరిని ఆలోచింపజేస్తుంది. అయితే.. అదే సందర్భంలో గాసిప్పులు రాసేవారిని ఉద్దేశిస్తూ “భవిష్యత్ లో డబ్బులు ఇచ్చి మరీ ఈ రూమర్లు రాయిస్తారేమో” అని వేసిన చురక కూడా బాగుంది. అయితే.. జాగ్రత్తగా గమనిస్తే కొందరు ఇండస్ట్రీ వ్యక్తులపై సెటైర్లు కూడా పుష్కలంగా ఉన్నాయి, అర్థమైనవాళ్లకి అర్థమైనంత అన్నట్లుగా. అయితే.. హరీష్ శంకర్ లోని దర్శకుడిని రచయిత డామినేట్ చేశాడు ఈ సినిమా విషయంలో.

విశ్లేషణ: హిందీలో “రెయిడ్”ను చూసిన మైండ్ సెట్ తో “మిస్టర్ బచ్చన్”ను చూడకూడదు. హిందీ మాతృకలోని మూలకథను మాత్రమే తీసుకొని తనదైన మార్క్ మార్పులతో హరీష్ శంకర్ వండి వడ్డించిన మాస్ మసాలా మీల్ “మిస్టర్ బచ్చన్”. రవితేజ ఎనర్జీ, పంచ్ డైలాగ్స్ & భాగ్యశ్రీ తెరపై పండించిన కెమిస్ట్రీ, సత్య కామెడీ టైమింగ్, మిక్కీ సంగీతం, సిద్ధు జొన్నలగడ్డ & దేవీశ్రీప్రసాద్ క్యామియోలు “మిస్టర్ బచ్చన్”ను థియేటర్లో చూసి ఆస్వాదించేలా చేశాయి. ఈ లాంగ్ వీకెండ్ లో మాస్ మసాలా సినిమాలు ఇష్టపడే ప్రేక్షకులకు మంచి హోల్ సమ్ ఎంటర్ టైనర్ “మిస్టర్ బచ్చన్”.

ఫోకస్ పాయింట్: బొమ్మ అదిరింది బచ్చన్ సాబ్!

రేటింగ్: 3/5

Rating

3
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus