‘7 డేస్ 6 నైట్స్’ అంటే అమ్మాయిలను తీసుకుని బీచ్‌కు వెళ్లడం కాదు
June 23, 2022 / 11:04 PM IST
|Follow Us
మెగా మేకర్ ఎం.ఎస్. రాజు దర్శకత్వం వహించిన తాజా సినిమా ‘7 డేస్ 6 నైట్స్’. మెగా బ్యానర్ సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో సుమంత్ అశ్విన్ .ఎం, రజనీకాంత్ .ఎస్ నిర్మించారు. వైల్డ్ హనీ ప్రోడక్షన్స్, వింటేజ్ పిక్చర్స్ మరియు ఏబిజి క్రియేషన్స్ వారు చిత్రనిర్మాణంలో భాగస్వాములు. ఇందులో సుమంత్ అశ్విన్, రోహన్ హీరోలు. మెహర్ చాహల్, కృతికా శెట్టి హీరోయిన్లు. ‘డర్టీ హరి’తో గతేడాది బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న ఎంఎస్ రాజు, ఆ తర్వాత దర్శకత్వం వహించిన చిత్రమిది. శుక్రవారం సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఎంఎస్ రాజుతో ఇంటర్వ్యూ…
ప్రశ్న: ‘7 డేస్ 6 నైట్స్’ కథకు మూలం ఏమిటి? మీ మనసులో ఎప్పుడు ఈ ఆలోచన వచ్చింది?
ఎంఎస్ రాజు: నేను మొదటి నుంచి న్యూ జనరేషన్ సినిమాలతో పాటు పాత చిత్రాలు చూస్తుంటాను. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మలయాళం… ఎపిక్ సినిమాలు చూస్తా. ఆ సినిమాల్లో స్ట్రాంగ్ క్యారెక్టర్స్ ఉంటాయి. అంటే… ఇప్పుడు లేవని కాదు. ‘బాహుబలి’ లాంటి సినిమాలు వస్తున్నాయి. మొదటి మూడు రోజుల్లో డబ్బులు చేసుకోవాలని కొన్ని సినిమాలు వస్తున్నాయి. నేను అలా కాకుండా స్ట్రాంగ్ క్యారెక్టర్లతో సినిమా తీయాలనుకున్నాను. కరోనా కాలంలో ‘డర్టీ హరి’ తర్వాత కొన్ని కథలు అనుకుంటున్నాను. అప్పుడు రాజ్ కపూర్ ‘బర్సాత్’ చూశా. అందులో రెండు పాత్రలు నాకు బాగా నచ్చాయి. ఒకడు అతి మంచోడు. వాడికి ఎప్పుడూ ఏదో ఒక ఇబ్బంది ఉంటుంది. హీరో ఎప్పుడూ ఏదో ఒక డేంజర్ లో ఉంటాడు. అప్పుడే సినిమా బావుంటుంది. ‘ఖుషి’లో విలన్ లేకపోయినా… అమ్మాయి ఓకే అనదు. అదొక కాన్ఫ్లిక్ట్ అన్నమాట. ‘బర్సాత్’ క్యారెక్టర్లు నచ్చడంతో వాటిని స్ఫూర్తిగా తీసుకుని కొత్త కథ రాశా.
ప్రశ్న: ఈ సినిమాలో మీ అబ్బాయి సుమంత్ అశ్విన్ పాత్ర ఎలా ఉంటుంది?
ఎంఎస్ రాజు: ‘బర్సాత్’లో రాజ్ కపూర్ క్యారెక్టర్ తరహాలో సుమంత్ పాత్ర ఉంటుంది. తనను గడ్డం పెంచమని, బరువు పెరగమని చెప్పాను. అదొక కేర్లెస్ రోల్. జీవితంలో అతడికి ఒక లక్ష్యం ఉంటుంది. దాన్ని ఇంకా చేరుకోలేదు. మరో వైపు ప్రేమించిన అమ్మాయి అమెరికా వెళుతుంది. ఆ డిప్రెషన్ కనిపించాలంటే గడ్డం పెంచి, బరువు పెరగాలని చెప్పాను. పెరిగాడు కూడా! డాక్టర్‌కు సైతం అందని డిప్రెషన్లో ఉంటారు. ‘బర్సాత్’లో రాజ్ కపూర్ ఫ్రెండ్ రోల్ ప్రేమనాథ్ చేశారు. మన సినిమాలో అటువంటి రోల్ రోహన్ నటించాడు. కథ, నేపథ్యాలు వేర్వేరు.
ప్రశ్న: కథ రాసేటప్పుడు మీ ఫీలింగ్ ఏంటి?
ఎంఎస్ రాజు: కథ, కాన్ఫ్లిక్ట్స్ బాగా కుదిరాయి. అయితే, యూత్‌ఫుల్ సినిమా కదా! డైలాగ్స్, సీన్స్ ఎలా రాయాలి? అనుకున్నా. అప్పుడు ఒక్కడినే గోవా వెళ్ళాను. మా ఇంట్లో కూడా చెప్పలేదు. రాజమండ్రిలో అమ్మానాన్న దగ్గరకు వెళుతున్నానని చెప్పా. డ్రైవర్ కూడా లేడు. నేనే నడుపుతూ వెళ్ళాను. గోవా వెళ్ళాక ఫోన్ స్విచ్ఛాఫ్ చేశా. ఐదారు రోజులు అంతా తిరిగా. నిర్మాతగా నేను విజయాలు సాధించా. అయితే, దర్శకుడిగా ఆశించిన విజయాలు అందుకోలేదు. అందుకని, పట్టుదలతో ‘7 డేస్ 6 నైట్స్’ కథ రాశా. గోవాలో యువత తిరిగే ప్రదేశాలు తిరిగా. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో గమనించాను. కొంత మందికి ‘వీడు మనల్ని కిడ్నాప్ చేస్తాడా?’ అనే ఫీలింగ్ కూడా వచ్చింది. అయినా చాలా రీసెర్చ్ చేశా. బయోపిక్ కోసమే కాదు, ఇటువంటి యూత్ ఫిలిమ్స్ చేయాలనుకున్నప్పుడు కూడా రీసెర్చ్ అవసరమే. ప్రతి సినిమాకు నేను ఈ విధంగా కష్టపడతా.
ప్రశ్న: సుమంత్ అశ్విన్ ఈ జనరేషన్ కుర్రాడు కాబట్టి అతడి నుంచి కొంత ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు కదా!
ఎంఎస్ రాజు: సుమంత్ నుంచి కొంత ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను. అయితే, ఎంత లేదన్నా తన సర్కిల్ పూర్తిగా వేరు. తనది మెట్రో సిటీస్ కల్చర్. సుమంత్ స్నేహితులతో నేను సరదాగా కూర్చుంటాను. వాళ్ళు మాట్లాడుకునే మాటలు వింటాను. అయితే, నేను ఉన్నప్పుడు వాళ్ళు కొంత ఆలోచించి మాట్లాడతారు.
ప్రశ్న: ఇండస్ట్రీలో ఎవరూ అట్టెంప్ట్ చేయని సినిమాలు చేయాలనుకుంటున్నారా?
ఎంఎస్ రాజు: రిటైర్మెంట్ వయసు వచ్చిన తర్వాత ఎవరైనా అలసిపోయామని, ఇక విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటారు. నాలో రోజు రోజుకూ తపన పెరుగుతోంది. నేను మధ్యలో వదిలేసిన గ్యాప్ ఉంది కదా! దాన్ని భర్తీ చేసుకునే సినిమాలు తీస్తున్నాను. ఇండస్ట్రీలో ఎవరూ అట్టెంప్ట్ చేయని జానర్ సినిమాలు అని కాదు, ఒక్కసారి సినిమా స్టార్ట్ అయితే అలా వెళ్లిపోయే సినిమాలు చేయాలనుకుంటున్నా. ఒక్కోసారి చిన్న ట్విస్ట్ సినిమాను తిప్పేస్తున్నాయి. అటువంటి సినిమాలు తీయాలనుంది. ‘7 డేస్ 6 నైట్స్’ ఎలా ఉందో ప్రేక్షకులు చెప్పాలి.
ప్రశ్న: ఎన్ని థియేటర్లలో సినిమాను విడుదల చేస్తున్నారు?
ఎంఎస్ రాజు: ముందు తక్కువ థియేటర్లలో విడుదల చేయాలనుకున్నాం. అయితే, మొన్న విడుదల ట్రైలర్ విడుదల చేశాక… చాలా మంది అడుగుతున్నారు. థియేటర్ల సంఖ్య పెరుగుతోంది.
ప్రశ్న: ‘7 డేస్ 6 నైట్స్’లో ఇద్దరు కొత్త హీరోయిన్లు ఉన్నారు. వాళ్ళు ఎలా చేశారు?
ఎంఎస్ రాజు: కొత్త హీరోయిన్లు అని అలుసుగా చూడలేదు. మహేష్ బాబు – భూమిక, ప్రభాస్ – త్రిష, సిద్ధార్థ్ – ఇలియానా నుంచి కొత్త హీరో హీరోయిన్ల వరకూ ఎవరికైనా నేను ఇచ్చే గౌరవం ఒక్కటే. పాత్రలకు తగ్గట్టు వాళ్ళిద్దరూ బాగా చేశారు.
ప్రశ్న: ఇది దర్శకుడిగా మీరు నిలబడే ప్రయత్నమా? మీ అబ్బాయిని హీరోగా నిలబెట్టే ప్రయత్నమా?
ఎంఎస్ రాజు: మా అబ్బాయిని హీరోగా నిలబెట్టాలంటే ‘డర్టీ హరి’ చేసేవాడిని. అది నాకు కరెక్ట్ కాదనిపించింది. తను ఏ పాత్రకు సూట్ అవుతాడో… ఆ పాత్రకు తీసుకోవాలి. ‘7 డేస్ 6 నైట్స్’లో ఇద్దరు హీరోలు ఉన్నారు. రోహన్ చేసే కామెడీకి జనాలు నవ్వుతారు. పక్కన మరో ఎమోషనల్ రోల్ ఉంది. దానికి సుమంత్ సూట్ అవుతాడని అతడిని తీసుకున్నా. ‘7 డేస్ 6 నైట్స్’ అంటే ఏదో అమ్మాయిలను తీసుకుని బీచ్‌కు వెళ్లడం కాదు… ఇందులో ఎమోషనల్ కంటెంట్ చాలా ఉంది. ఇంటర్వెల్ నుంచి ప్రేక్షకులు ఒక ట్రాన్స్‌లోకి వెళతారు.
ప్రశ్న: మీ అబ్బాయికి రొమాంటిక్ సీన్స్ వివరించేటప్పుడు ఇబ్బంది ఏమైనా పడ్డారా?
ఎంఎస్ రాజు: సెట్లో మా ఇద్దరి మధ్య ప్రొఫెషనల్ రిలేషన్షిప్ ఉండేది. సుమంత్ అశ్విన్ జన్మించే సమయానికి నేను సినిమాల్లో ఉన్నాను. షూటింగ్ వాతావరణంలో పెరిగాడు. సన్నివేశాల గురించి ఇంట్లో నా భార్యకు వివరించేటప్పుడు వినేవాడు. అందుకని, ఇబ్బంది ఏమీ లేదు. ప్రొఫెషనల్స్ గా ఉన్నాం. సెట్లో నా దగ్గరకు వచ్చి నెమ్మదిగా ఎలా చేయాలని అడిగేవాడు. చెప్పినట్టు చేశాడు.
ప్రశ్న: ‘7 డేస్ 6 నైట్స్’ యూత్ కోసమేనా? ఫ్యామిలీస్ కూడా చూడొచ్చా?
ఎంఎస్ రాజు: థియేటర్లకు ముందు వచ్చేది యువతరమే. అందుకని, యూత్ సినిమా అంటున్నాను. అలాగే, ఇది ఫ్యామిలీ సినిమా కూడా! శుక్రవారం సాయంత్రానికి కుటుంబ ప్రేక్షకులు అందరూ థియేటర్లకు వస్తారు. ఇది అడల్ట్ కంటెంట్ సినిమా కాదు. సెన్సార్ దీనికి ‘యు/ఎ’ సర్టిఫికెట్ ఇచ్చింది.
ప్రశ్న: ‘సతి’ సినిమా కంప్లీట్ చేసినట్టున్నారు!
ఎంఎస్ రాజు: అవును. రాజమండ్రి లాంటి ప్రాంతంలో భార్యాభర్తల మధ్య జరిగే కథతో తీసిన సినిమా ‘సతి’. మిస్టరీ జానర్ సినిమా అని చెప్పవచ్చు.
ప్రశ్న: మీరు గతంలో తీసిన సినిమాలకు సీక్వెల్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా?
ఎంఎస్ రాజు: ఒక సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాను. దాన్ని 14 భాషల్లో తీస్తాం. అక్టోబర్ లో స్టార్ట్ కావచ్చు. చాలా పెద్ద స్కేల్ లో ఉంటుంది.