కొరియోగ్రాఫర్ గా, హీరోగా, డైరెక్టర్ గా.. ఇలా అన్ని విధాలుగా సక్సెస్ అయ్యాడు ప్రభుదేవా. ఇప్పటికీ అతను బాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు. అతను కనుక సినిమా తీయాలి అనుకుంటే అక్కడి స్టార్లు కచ్చితంగా డేట్లు ఇచ్చేస్తారు. అంత ఇన్ఫ్లుయెన్స్ చేయగల ప్రభుదేవా మాత్రం ఇప్పటికీ హీరోగా సినిమాలు చేస్తూ వచ్చాడు.అవి కనీసం ఆడడం లేదు.
సీనియర్ హీరోలు అందరూ రూటు మార్చి క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగా, విలన్ గా నటిస్తూ బిజీ అయిపోతుంటే.. ప్రభుదేవా రకరకాల ప్రయత్నాలు చేస్తూ..అవి బెడిసి కొట్టడంతో తెలుగు ప్రేక్షకులకు దూరమయ్యాడు. అయితే మొత్తానికి రూటు మార్చి అతను ‘మై డియర్ భూతం’ చిత్రంలో విభిన్నమైన పాత్రని పోషించాడు. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ చిత్రం ఎలా ఉందో తెలుసుకుందాం రండి :
కథ : భూతలోకానికి రాజైన కర్ణ ముఖి (ప్రభుదేవా) ఓ ముని వల్ల శపింపబడతాడు.అందువల్ల భూలోకంలో అతను ఓ రాయిలా మారిపోతాడు.అయితే ఇతను తిరిగి ఎవరి వల్ల బయటపడతాడో, ఆ వ్యక్తి ఓ మంత్రాన్ని చదివితేనే కర్ణ ముఖి తిరిగి అతని లోకానికి చేరుకుంటాడు. కానీ అలా బయట పడేసిన వ్యక్తి ని ఆ మంత్రం చెప్పమని భూతమైన కర్ణ ముఖి కోరకూడదు. ఈ క్రమంలో శ్రీనివాస్ (అశ్వంత్) వల్ల రాయిగా ఉన్న కర్ణ ముఖి బయటకు వస్తాడు.
కానీ శ్రీనివాస్ ను ఆ మంత్రం చెప్పమని కర్ణ ముఖి అడక్కూడదు.ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటి అంటే శ్రీనివాస్ కు నత్తి. అతను సరిగ్గా మాట్లాడటమే కష్టం. అలాంటి వ్యక్తి మంత్రం ఎలా చెబుతాడు? కర్ణ ముఖి కి ఎలా సహాయం చేయగలడు? అసలు కర్ణ ముఖి ఎందుకు శపించబడ్డాడు.. చివరికి అతని లోకానికి వెళ్ళాడా? వంటిది మిగిలిన కథ.
నటీనటుల పనితీరు : మునుపెన్నడూ లేని విధంగా ఈ మూవీలో ప్రభుదేవా కొత్తగా కనిపించాడు. ఆ లుక్ లో అతను నటించడానికి ఒప్పుకోవడం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. భూతం కర్ణ ముఖిగా ప్రభుదేవా బాగా నటించాడు.చిన్న పిల్లలకు ఈ పాత్ర బాగా కనెక్ట్ అవుతుంది. ఈ పాత్ర నవ్విస్తుంది చివర్లో ఏడిపిస్తుంది కూడా.! ఇక ఈ సినిమాలో మరో ప్రధాన పాత్ర గురించి చెప్పుకోవాలి అంటే శ్రీనివాస్గా చేసిన చైల్డ్ ఆర్టిస్ట్ అశ్వంత్ గురించి చెప్పుకోవాలి.
నత్తితో బాధపడే పిల్లాడిగా అశ్వంత్ చాలా బాగా నటించాడు. ఇక శ్రీనివాస్ తల్లి పాత్రలో రమ్యా నంబీశన్ కూడా బాగా చేసింది. మిగతా నటీనటులు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు కానీ చివరి వరకు ట్రావెల్ అయ్యేవి కర్ణ ముఖి,అశ్వంత్ పాత్రలే కాబట్టి జనాల ఫోకస్ కూడా వాళ్ల పైనే ఎక్కువ ఉంటుంది.
సాంకేతిక నిపుణుల పనితీరు : చిన్న పిల్లల సినిమా అంటే ఎక్కువగా గ్రాఫిక్స్, విన్యాసాలు ఉంటే సరిపోతుంది అనే మార్క్ ఎప్పుడో పడిపోయింది. కానీ ‘మై డియర్ భూతం’ లో వాటితో పాటు కామెడీ, ఎమోషనల్ పాయింట్ ను కూడా టచ్ చేశాడు దర్శకుడు ఎన్. రాఘవన్. దానిని అతను తెరపై ఆవిష్కరించిన తీరు కూడా బాగుంది.పిల్లలు మనసు చాలా సెన్సిటివ్ గా ఉంటుంది. వారిలోని లోపాలు ఎత్తి చూపి విమర్శిస్తే ఎలా ఉంటుంది.. తల్లిదండ్రులు వారికి అలాంటి పరిస్థితుల్లో అండగా నిలబడి ధైర్యం చెప్పకుండా ఉండే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది ఈ సినిమాలో చక్కగా చూపించాడు దర్శకుడు.
యూకే సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ బాగుంది. గ్రాఫిక్స్ విషయంలో ఇంకాస్త కేర్ తీసుకుని ఉండాల్సింది.ఇప్పటికే నెక్స్ట్ లెవెల్ విజువల్ ఎఫెక్ట్స్ ను జనాలు ఆస్వాదించి ఉన్నారు కాబట్టి.. ఈ సినిమాలో అవి కాస్త చిన్నగా కనిపిస్తాయి. అయినప్పటికీ ఇలాంటి మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమాని ఎంకరేజ్ చేసినందుకు నిర్మాత రమేష్ పి పిళ్ళై ని, తెలుగులో రిలీజ్ చేసిన ఏఎన్ బాలాజీ అభినందించవచ్చు.
విశ్లేషణ : ‘మై డియర్ భూతం’… ఫ్యామిలీ ఆడియన్స్ ని, చిన్న పిల్లలని మెప్పించే చిత్రం అని చెప్పొచ్చు. ఈ మూవీ విసిగించదు.. నవ్విస్తుంది, ఏడిపిస్తుంది. రన్ టైం కూడా 2 గంటల 1 నిమిషం మాత్రమే కాబట్టి.. ఒకసారి ట్రై చేయొచ్చు.
రేటింగ్ : 2/5