కరోనాను జయించిన ప్లాస్మా దానం చేస్తానంటున్న నాగబాబు!
September 16, 2020 / 12:42 PM IST
|Follow Us
ప్రముఖ నటుడు-నిర్మాత, మెగా బ్రదర్ నాగబాబు కరోనా బారిన పడ్డారు. ఈ వైరస్ సోకిన సెలబ్రిటీల జాబితాలో ఆయన కూడా చేరారు. కొవిడ్-19 టెస్ట్ చేయించుకో గా పాజిటివ్ రిజల్ట్ వచ్చిందని నాగబాబు తెలియజేశారు. వైరస్ సోకిందని ఆయన దిగాలు పడలేదు. ఆందోళన చెందుతున్న మెగాభిమానులకు ధైర్యం చెప్పారు. బాధగా ఉండకూడదని సోషల్ మీడియాలో పేర్కొన్నారు.
“ఒక వ్యాధి వచ్చిందని బాధపడుతూ వుండకూడదు. దాని బారిన పడే వాళ్లకు సహాయం చెయ్యడానికి ఒక అవకాశంగా మార్చుకునే ప్రయత్నం ఎప్పుడు చెయ్యాలి. నేను కొవిడ్-19 పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. దీన్ని జయించి ప్లాస్మా దాతగా మారుతాను. కొవిడ్ పాజిటివ్ ఫైట్ చెయ్యడానికి నేను పాజిటివ్ గా వున్నాను” అని నాగబాబు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆయన త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ ఆ పోస్ట్ పై కామెంట్ చేశారు. అతనికి నాగబాబు థాంక్స్ చెప్పారు.
నాగబాబు కరోనా బారిన పడటంతో కొన్ని యూట్యూబ్ ఛానల్స్ లో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించిందనీ, భయాందోళనలలో మెగా కుటుంబం, అభిమానులు వున్నారని హెడ్డింగులు పెట్టి వీడియోలు చేశాయి. వాటిపై నాగబాబు సరదాగా స్పందించారు. ఇంతకు ముందు కంటే చాలా హుషారుగా వున్నానని చెప్పుకొచ్చారు. యూట్యూబ్ ఛానల్ ను మరీ అతి చేస్తున్నాయి అన్నట్లు ఒక స్టోరీ పెట్టారు. త్వరలో యూట్యూబ్ ఛానల్ హెడ్డింగులు పై ఒక వీడియో చేయనున్నట్లు తెలిపారు.