బోల్డ్ సినిమాల గురించి సంచలన కామెంట్స్ చేసిన నాగార్జున
September 24, 2018 / 07:01 AM IST
|Follow Us
ఆఫీసర్ మూవీ తర్వాత కింగ్ నాగార్జున చేసిన మూవీ దేవదాస్. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మల్టీస్టారర్ మూవీలో నాగ్, నాని తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ నిర్మిస్తున్న ఈ మూవీ సెప్టెంబర్ 27న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మీడియా ముందుకు వచ్చిన నాగార్జున అనేక అంశాలపై తన అభిప్రాయాన్ని చెప్పారు. ఈ మధ్య తెలుగు సినిమాలను కుటుంబంతో సహా కలిసి చూడలేకపోతున్నామనే విమర్శలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. “కుటుంబంతో కలసి చూడలేమని అనుకునే సినిమాలకు పిల్లలను తీసుకెళ్లకుంటేనే మంచిది. మంచి సినిమాలు వచ్చినప్పుడే థియేటర్ కు వెళ్లాలి” అని సూచించారు. “ప్రస్తుతం తల్లిదండ్రులు పిల్లలకు ఫోన్లు ఇచ్చేస్తున్నారు. దానిపై కనీసం నిఘా పెట్టడం లేదు.
అలాంటివారే సినిమాల దగ్గరకు వచ్చేసరికి ‘అయ్యో.. చెడిపోతున్నారు!’ అని హంగామా చేస్తున్నారు” అని ఘాటుగా విమర్శించారు. ఈ మధ్య విజయం సాధించిన సినిమాల గురించి మాట్లాడుతూ.. “అర్జున్ రెడ్డి, ఆర్ఎక్స్ 100, గూఢచారి, చి.ల.సౌ, మహానటి సినిమాలు నాకు బాగా నచ్చాయి. ఈ సినిమాలన్నీ విభిన్నమైన కథాంశాలతో తెరకెక్కి ప్రేక్షకుల ఆదరణ పొందాయి. సమ్మోహనం సినిమాలో పాటలు అద్భుతంగా ఉన్నాయి. ప్రస్తుతం పరిశ్రమలో నాణ్యమైన పనితీరు కనిపిస్తోంది. ఇండస్ట్రీకి ఇది చాలా అవసరం” అని నాగ్ చెప్పారు. మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న నాగ్ కి దేవదాస్ ఊరటనిస్తుందని ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరూ చెబుతున్నారు.