Taraka Ratna: తారకరత్న సినిమాకి సాయమందించిన నందమూరి కుటుంబ సభ్యులు ఎవరంటే.!
February 1, 2023 / 10:57 AM IST
|Follow Us
స్వర్గీయ నందమూరి తారక రామారావు నట వారసులు బాలకృష్ణ, హరికృష్ణల తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఇద్దరూ బాలనటులుగా పరిచయమై తర్వాత హీరోలుగా మారారు. నందమూరి వంశం నుండి మూడోతరం నటవారసుడిగా ‘ఒకటో నెంబర్ కుర్రాడు’ మూవీతో ఎంట్రీ ఇచ్చాడు నందమూరి తారకరత్న.. ఒకేరోజు ఏకంగా 9 సినిమాలు ప్రారంభించి అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేశాడు.. తర్వాత ప్రతినాయకుడిగా మారి ‘అమరావతి’ సినిమాకు గానూ నంది అవార్డునందుకుని.. నారా రోహిత్ ‘రాజా చెయ్యివేస్తే’ లోనూ విలన్‌గా ఆకట్టుకున్నాడు.
వరుస పరాజయాల కారణంగా కెరీర్ అనుకున్నంత పాజిటివ్‌గా అయితూ సాగలేదు. తారకరత్న హీరోగా లాంఛ్ అవుతున్న ఈవెంట్‌కి చంద్రబాబు నాయుడుతో సహా నందమూరి కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు విచ్చేయడం కూడా ఆరోజుల్లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. తనను హీరోగా నిలబెట్టడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు కానీ కాలం కలిసి రాలేదు. అదృష్టం కూడా తోడవలేదు. ఫస్ట్ ఫిలింకి ఎ.కోదండరామి రెడ్డి దర్శకత్వం వహించగా.. అశ్విని దత్, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు నిర్మించారు. కీరవాణి సంగీతమందించిన ఈ చిత్రం మ్యూజికల్ హిట్‌గా నిలిచింది.
ఇక రెండో సినిమా ‘యువరత్న’ ను రామకృష్ణ హార్టీ కల్చర్ స్టూడియోస్ బ్యానర్ మీద బాబాయ్ నందమూరి రామకృష్ణ నిర్మించారు. సీనియర్ డైరెక్టర్ ఉప్పలపాటి నారాయణ రావు దర్శకత్వం వహించగా.. కీరవాణి కంపోజ్ చేసిన సాంగ్స్ ఆకట్టుకున్నాయి. అయితే ఈ సినిమా ప్రారంభోత్సవంలో ఎన్టీఆర్, బసవతారకమ్మల చిత్రపటాలపై హరికృష్ణ వాయిస్ ఓవర్ వస్తుంది. అలాగే కృష్ణుడి గెటప్‌లో ఉన్న ఎన్టీఆర్, బాలయ్య, హరికృష్ణల తర్వాత ‘నవరత్న’ నందమూరి తారకరత్న అని టైటిల్ పడుతుంది.
సినిమా చివర్లో యువతకు సందేశమిస్తూ బాలయ్య లెంగ్తీ వాయిస్ ఓవర్ చెప్పడం విశేషం.. యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా అనుకున్నంత విజయం సాధించకపోయినా పాటలు మాత్రం ప్రేక్షకులను థియేటర్లకు రప్పించాయి. ఈ విధంగా చిన్న బాబాయ్ నిర్మాణంలో, పెదనాన్న హరికృష్ణ, పెద్ద బాబాయ్ బాలకృష్ణ వాయిస్ ఓవర్ ఇవ్వడం విశేషం..