Kalyanram: శేఖర్ కమ్ముల ముందే ఆ పేరు పెట్టేశారు.. ఇప్పుడు మేం: కల్యాణ్ రామ్
February 9, 2023 / 06:16 PM IST
|Follow Us
‘అమిగోస్’ అంటే ఏంటండి.. అసలు అర్థమేంటి? మొన్నీమధ్య ఓ టీవీ షోలో కల్యాణ్ రామ్‌ను యాంకర్ సుమ ఓ ప్రశ్న అడిగారు. దానికి కల్యాణ్ రామ్ ‘ఫ్రెండ్స్’ అని చెబుతారు. మరి అలాంటప్పుడు అదే పేరు పెట్టొచ్చు కదా.. అమిగోస్ అని ఎందుకు పెట్టారు అనే ప్రశ్న మళ్లీ వస్తుంది. దానికి నవ్వే సమాధానమవుతుంది. నిజానికి ఈ ప్రశ్న సుమ ఒక్కరిదే కాదు.. సగటు సినిమా ప్రేక్షకుడికి కూడా. తెలిసిన ఫ్రెండ్స్ అని కాకుండా.. పెద్దగా తెలియని అమిగోస్ అని ఎందుకు పెట్టారు అని అనుకుంటున్నారు.
సోషల్ మీడియా వేదికగా ఈ ప్రశ్న ఇప్పటికే వినిపిస్తోంది, కనిపిస్తోంది కూడా. తాజాగా ఈ ప్రశ్నకు కల్యాణ్ రామ్ సమాధానమిచ్చారు. ‘‘మనుషుల్ని పోలిన మనుషులు ప్రపంచంలో ఏడుగురు ఉంటారని పెద్దవాళ్లు చెబుతుంటారు. అదే పాయింట్‌తో అల్లుకున్న కథ అనగానే కొత్తగా అనిపించింది’’ అని చెప్పారు కల్యాణ్‌రామ్. ఇక టైటిల్ సంగతేంటి అని అడిగితే.. సినిమాలో మూడు పాత్రలూ ముఖ్యమైనవే. వాటిలో ఓ పాత్ర పేరును టైటిల్‌గా పెట్టలేం. అందుకే డిఫరెంట్ పేరు కోసం చూశాం.
ఫ్రెండ్షిప్ మీద సినిమా కాబట్టి.. ‘ముగ్గురు మిత్రులు’, ‘స్నేహం’ అనే రొటీన్ పేర్లు పెట్టలేం అనిపించింది. అందుకే స్నేహితులు అనే అర్థం వచ్చేలా ఇతర భాషల్లో పేర్లు వెతికాం. అప్పుడే క్యాచీగా ‘అమిగోస్’ అనే పేరు కనిపించింది. నిజానికి ఈ పేరు ఇప్పటికే టాలీవుడ్‌కు పరిచయమే. శేఖర్ కమ్ముల తన బ్యానర్‌కు ఆ పేరే పెట్టారు. ఈ పేరు అర్థమవుతుందా అని తొలుత అనుకున్నా.. అర్థం తెలుసుకున్నాక హ్యాపీగా ఫీల్ అవుతారులే అని పెట్టేశాం అని చెప్పాడు కల్యాణ్ రామ్.
సాధారణంగా హీరోని పూర్తిస్థాయి విలన్‌గా చూపించడం చాలా అరుదు. ఒకవేళ చూపించినా ఆ పాత్రను గ్రే షేడ్‌లో చూపించి.. తర్వాత మంచిగా మారినట్లు చూపిస్తారు. కానీ ‘అమిగోస్’లో అలా జరగదు. విలన్ సినిమా మొత్తం విలన్‌గానే ఉంటాడు అని చెప్పారు కల్యాణ్ రామ్.