నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్

  • December 16, 2016 / 01:21 PM IST

“కుమారి 21F” చిత్రంతో కుమారిగా కుర్రకారును ఉర్రూతలూగించిన హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో వినాయక్ శిష్యుడు భాస్కర్ బండి దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కించిన యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ “నాన్న నేను నా బోయ్ ఫ్రెండ్స్”. బెక్కెం వేణుగోపాల్ నిర్మించిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు విడుదల చేయడం విశేషం. ఒక అమ్మాయి ముగ్గురు అబ్బాయిలను ప్రేమించి వారిలో ఒకరిని పెళ్లాడాలని ఫిక్స్ అయ్యే నేపధ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏమేరకు అలరిస్తుందో చూడాలి..!!

కథ : పద్ధు (హెబ్బా పటేల్) మూడో నెలలో మూడో తారీఖున సరిగ్గా మూడు గంటలకు రాఘవరావు (రావు రమేష్)ను పుట్టిన ముద్దుల కుమార్తె. పెళ్ళైన మూడేళ్ళ తర్వాత పుట్టిన కుమార్తె కావడంతో ప్రాణంగా పెంచుకొంటుంటాడు. కూతురు మాటకు ఎన్నడూ ఎదురు చెప్పడు, ఆమె అడిగిన ఏ విషయాన్ని కాదనడు. అంత గారాబంగా పెరిగిన పద్దు ఇంజనీరింగ్ అనంతరం హైద్రాబాద్ లో ఉద్యోగం కోసం తన స్నేహితురాలు మేగీ (తేజస్వి మడివాడ) వద్దకు వస్తుంది. అప్పుడే హైద్రాబాద్ లైఫ్ ను ఎంజాయ్ చేయడం మొదలుపెట్టిన పద్దుకి పెళ్ళి సంబంధం తీసుకువస్తారు తల్లిదండ్రులు. వారి నుంచి తప్పించుకోవడం కోసం తనకు బోయ్ ఫ్రెండ్ ఉన్నాడని, ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నాడని, త్వరలోనే తిరిగొస్తాడని చెబుతుంది. ఆ తర్వాత నిజంగానే “పవన్ కళ్యాణ్” లాంటి బోయ్ ఫ్రెండ్ కోసం వెతకడం ప్రారంభించి.. నమో (పార్వతీశం), నాని (అశ్విన్ బాబు), గోకుల్ (నోయల్)ను బోయ్ ఫ్రెండ్స్ గా సెలక్ట్ చేసుకొంటుంది. వారిలో ఎవరో ఒకర్ని పెళ్లాడాలని మొదలైన ప్రేమాట చివరికి ఏ తీరానికి చేరింది అనేది “నాన్న నేను నా బోయ్ ఫ్రెండ్స్” చిత్ర కథాంశం.

నటీనటుల పనితీరు : మామూలుగానే యావరేజ్ గా ఉండే హెబ్బా పటేల్ ఈ సినిమాలో మరీ డీగ్లామరస్ గా కనిపించింది. ఎక్స్ పోజింగ్ విషయంలో ఎక్కడా మొహమాటపడనప్పటికీ.. అమ్మడి డీ గ్లామ్ బ్యూటీని చూసి యూత్ కూడా ఎంజాయ్ చేయలేరు.భలే బబ్లీగా ఉండే తేజస్వి మడివాడ కూడా ఈ సినిమాలో జీరో సైజ్ ఫిగర్ తో దర్శనం ఇవ్వడంతో జనాలు నీరుగారిపోయారు. అయితే.. పెర్ఫార్మెన్స్ పరంగా మాత్రం హాస్యంతోపాటు సెంటిమెంట్ ను కూడా సమపాళ్లలో పండించి అలరించింది.తండ్రి పాత్రలో రావు రమేష్ “బొమ్మరిల్లు, కొత్త బంగారులోకం” సినిమాల్లో ప్రకాష్ రాజ్ పాత్రను తలపిస్తాడు. అయితే.. కూతురు మీద విపరీతమైన ప్రేమను పెంచుకొన్న తండ్రిగా రావు రమేష్ పలికించిన ఎమోషన్స్ కి ఆడియన్స్ కనెక్ట్ అయిపోతారు.ముగ్గురు ప్రేమికులుగా అశ్విన్, నోయల్, పార్వతీశంలు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. అయితే.. ముగ్గురిలోనూ పార్వతీశం ఎక్కువ మార్కులు సంపాదించుకొన్నాడు.

సాంకేతికవర్గం పనితీరు : శేఖర్ చంద్ర సమకూర్చిన బాణీల్లో “ఒక పారు ముగ్గురు దేవదాసులు” పాత సాహిత్య పరంగానే కాక సిట్యుయేషన్ కి సింక్ అయ్యింది. నేపధ్య సంగీతం రెగ్యులర్ గా, ఎక్కడో విన్నట్లు ఉంది. ఛోటా కె.నాయుడు సినిమాటోగ్రఫీ బాగుంది. వర్షంలో డ్యాన్స్ సీక్వెన్స్ మరియు ఇంకొన్ని ఫ్రేమ్స్ బాగున్నాయి. ప్రసన్న సంభాషణలు సినిమాకి ఆయువుపట్టు. “తొమ్మిది నెలలు మోసేదాన్ని తల్లి అంటే.. జీవితాంతం మోసేవాడ్ని తండ్రి అంటారు” లాంటి డైలాగ్స్ బాగున్నాయి.సాయికృష్ణ రాసుకొన్న కథలో కొత్తదనం ఎక్కడా లేదు. ఒక అయిదారు తెలుగు సినిమాల కథల్ని కలగలిపి ఈ సినిమా కథను రాసుకొన్నట్లుగా ఉంది. రావు రమేష్ మినహా ఏ ఒక్క పాత్రకి సరైన క్యారెక్టరైజేషన్ లేకపోవడం గమనార్హం.

దర్శకుడు భాస్కర్ బండి కథను ఒన్ చేసుకోకుండా కేవలం పేపర్ పైన పెట్టిన సన్నివేశాల్ని తెరకెక్కించుకుంటూ వెళ్లిపోయాడే తప్ప కథలోని సోల్ ను సరిగా ప్రెజంట్ చేయలేకపోయాడు. అయితే.. నోయల్-హెబ్బాల నడుమ వచ్చే “నడుము” సీన్ ను డీల్ చేసిన విధానం బాగుంది. అయితే.. క్లైమాక్స్ లో మాత్రం ఎలా ఎండ్ చేయాలో తెలియక ముగించేసిన విధానం మాత్రం అస్సలు బాలేదు. సినిమాకి మైనస్ కూడా అదే.

విశ్లేషణ : అతి కానంతవరకూ ఏ ఎమోషన్ అయినా బాగానే ఉంటుంది. అయితే.. ఈ సినిమాలో ప్రతి ఎమోషన్ “అతి” అనిపిస్తుంది. కొన్ని సన్నివేశాల్లో అశ్లీలత కాస్త ఎక్కువయ్యింది, ఇంకొన్ని సన్నివేశాల్లో కన్ఫ్యూజన్ ఎక్కువైంది. మొత్తానికి సినిమాలో మేటర్ తక్కువ హడావుడి ఎక్కువ అన్న రీతిలోనే సాగింది. సో, సెన్స్ లేని సిల్లీ ఎంటర్ టైన్మెంట్ ను కోరుకొనే వారు మాత్రమే చూడదగ్గ చిత్రం “నాన్న నేను నా బోయ్ ఫ్రెండ్స్”.

రేటింగ్ : 1.5/5

Click Here For ENGLISH Review

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus