టాలీవుడ్లో నటించడంపై స్టార్ యాక్టర్ కామెంట్స్ వైరల్.. ఇంకా ఏమన్నారంటే?
July 20, 2024 / 08:51 PM IST
|Follow Us
విలక్షణ నటులు.. ఈ ట్యాగ్ ఏ నటుడికైనా చాలా పెద్ద గుర్తింపు. అంతేకాదు అలాంటి పేరు కోసం వాళ్లు ఎంతైనా చేస్తారు. అలా అని అందరూ చేయలేరు, చేసినా రాదు కూడా. అయితే ఈ ట్యాగ్‌ను అందుకున్న ఓ బాలీవుడ్ నటుడు తెలుగు సినిమాల గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు అవి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. హీరో, విలన్, సహాయ నటుడు, అతిథి పాత్ర. ఇలా పాత్ర ఏదైనా తన నటనతో ఆ పాత్రకు జీవం పోస్తాడు నవాజుద్దీన్ సిద్ధిఖీ (Nawazuddin Siddiqui) .
బాలీవుడ్లో అందుకే ఆయనను విలక్షణ నటుడు అని అంటుంటారు. ఈ క్రమంలో ఆయ దక్షిణాది సినిమాల్లోనూ నటిస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ కెరీర్ గురించి, ఇండస్ట్రీల గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డబ్బులు సంపాదించడం కోసం సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టలేదు. నటనపై ఇష్టంతో ఇటువైపు వచ్చాను. ఆ మేరకు నాకు దక్కిన ప్రతి పాత్రకు న్యాయం చేస్తూ సినిమా ప్రేక్షకుల్ని అలరిస్తున్నాను. ‘రామన్ రాఘవ్’ లాంటి సినిమాల్లో నటించినప్పుడు ఆ పాత్రకు సంబంధించిన భావోద్వేగాలు, ఆలోచనలపై పట్టు సంపదించాను.
అయితే దక్షిణాది సినిమాల్లో నటించినప్పుడు ఈ మాటను కచ్చితంగా చెప్పలేను అని అన్నారు నవాజుద్దీన్. సౌత్ సినిమాలలో మంచి పారితోషికం ఇస్తున్నారే కారణంతోనే అక్కడ నటిస్తున్నాను అని క్లారిటీ ఇచ్చారు నవాజుద్దీన్. అక్కడ ఏం జరుగుతుందో తనకు అర్థం కావడం లేదని, పాత్రలపై పూర్తి నియంత్రణ ఉండటం లేదని తన పరిస్థితి గురించి మాట్లాడారు. ఏం చేయాలనే విషయం గురించి షూటింగ్‌కి ముందు మరో వ్యక్తి నాకు చెప్పాల్సి వస్తోంది. పారితోషికం తీసుకున్నప్పటికీ పాత్రకు సరైన న్యాయం చేయలేకపోతున్నాను అనిపిస్తోంది అని నవాజుద్దీన్ చెప్పారు.
రజనీకాంత్ (Rajinikanth) ‘పేట’ (Petta) , ‘సేక్రెడ్ గేమ్స్’ తదితర వెబ్ సిరీస్‌లతో సౌత్ ప్రేక్షకుల్ని అలరించారు నవాజుద్దీన్. ఈ ఏడాది సంక్రాంతికి వెంకటేశ్ (Venkatesh) ‘సైంధవ్’ (Saindhav) సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా ఆశించిన ఫలితం రాలేదు. అందులో నవాజుద్దీన్ పాత్ర అంతగా పేలలేదు అని అన్నారు ఆ సమయంలో విశ్లేషకులు. ఇప్పుడు ఆయన మాటలు వింటుంటే ఇక్కడి పరిస్థితులు ఆయన అర్థం చేసుకోలేకపోవడం / అర్థం కాకపోవడం వల్లే ఇలా జరుగుతోంది అని అర్థమవుతోంది.