ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీలో భారతదేశం తరఫున ఆస్కార్ బరిలో ఓ తమిళ చిత్రం నిలిచిది. పీఎస్ వినోద్‌రాజ్ తెరకెక్కించిన ‘కూళాంగల్’ ఈ ఏడాది మన దేశం నుండి ఆస్కార్ రేసులో ఉంది. ప్రముఖ కథానాయిక నయనతార, దర్శకుడు, నిర్మాత విఘ్నేష్ శివన్ ఈ సినిమా నిర్మాతలు కావడం విశేషం. యువన్ శంకర్‌రాజా సంగీతమందించారు. వివిధ భాషల నుంచి వచ్చిన 14 చిత్రాలను పరిశీలించిన జ్యూరీ ఈ సినిమాను ఎంపిక చేసింది.
విక్కీ కౌశల్ ‘సర్ధార్ ఉద్దమ్’, విద్యాబాలన్ ‘షేర్నీ’ లాంటి బాలీవుడ్ సినిమాలను వెనక్కి నెట్టి ‘కూళాంగల్’ దేశం తరఫున ఆస్కార్ బరిలో నిలిచింది. ఇక కూళాంగల్ అంటే.. తమిళంలో గులకరాళ్లు అని అర్థం. సినిమా నేపథ్యం కొండలు, గులకరాళ్ల నిండిన ప్రాంతం. అందుకే ఆ పేరు పెట్టారట. తాగుబోతు తండ్రిని మార్చి, ఇంట్లోంచి వెళ్లిపోయిన తల్లిని తీసుకు రావడానికి ఓ చిన్న కుర్రాడు చేసే ప్రయత్నమే ‘కూళాంగల్’.
అయితే ఈ సినిమా ఆస్కార్ నామినేషన్స్‌లో ఉన్నట్లు కాదు. అన్ని దేశాల నుండి వచ్చిన సినిమాలను మరోసారి చూసి.. ఆస్కార్ బృందం నామినేషన్స్‌లోకి తీసుకుంటుంది. అలా ఇప్పటివరకు మన దేశం నుండి ‘మదర్ ఇండియా’, ‘సలామ్ బాంబే’, ‘లగాన్’ మాత్రమే నామినేట్ అయ్యాయి. అయితే వేటికీ పురస్కారం దక్కలేదు. బాలీవుడ్ సినిమాను కాదని తమిళ సినిమాను తీసుకెళ్తున్నారు. మరి గులకరాళ్లు మ్యాజిక్ చేస్తాయా?