Chiranjeevi: చిరంజీవి ఆశించిన స్థాయిలో టికెట్ రేట్లు రాలేదా?
March 9, 2022 / 04:08 PM IST
|Follow Us
ఏపీలో కొత్త టికెట్ల జీవో అమలులోకి రావడంలో మెగాస్టార్ చిరంజీవి కృషి ఎంతగానో ఉందనే సంగతి తెలిసిందే. సీఎం జగన్ తో ఇండస్ట్రీ సమస్యల గురించి చర్చించడంతో పాటు పెద్ద సినిమాలకు టికెట్ రేట్ల విషయంలో ప్రయోజనం చేకూరేలా చేయడం కోసం మెగాస్టార్ చిరంజీవి ఎంతో కష్టపడ్డారు. తనతో పాటు మరి కొందరు సినీ ప్రముఖులతో కలిసి జగన్ ను కలవడంతో పాటు సినిమా ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యలను చిరంజీవి జగన్ కు వివరించారు.
తాజాగా కొత్త టికెట్ల జీవో అమలులోకి రావడంతో చిరంజీవి సంతోషం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే చిరంజీవి టికెట్ల విషయంలో సంతృప్తితో లేరని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. చిరంజీవి ముఖంలో సాధారణంగా కనిపించే చిరునవ్వు కనిపించలేదని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. చిరంజీవి ఆశించిన స్థాయిలో ఏపీలో టికెట్ రేట్ల పెంపు జరగలేదని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తుండటం గమనార్హం. ఏపీలో టికెట్ రేట్లు పెరిగినా భారీగా అయితే పెరగలేదు. ఏపీ ప్రభుత్వం అమలులోకి తెచ్చిన కొన్ని నిబంధనల వల్ల పెద్ద సినిమాలకు ఇబ్బందులు తప్పవు.
ఏపీలో కనీసం 20 శాతం షూటింగ్ చేయాలనే నిబంధనను పాటించడం తేలిక కాదు. సినిమా స్క్రిప్ట్ కు తగిన విధంగా ఏపీలో లొకేషన్లు ఉంటాయా అనే ప్రశ్నకు కొన్నిసార్లు కాదనే సమాధానం వినిపిస్తుంది. ఏపీలో స్టూడియోలు, ఫిల్మ్ సిటీలు అభివృద్ధి చెందిన తర్వాత ప్రభుత్వం ఈ షూటింగ్ నిబంధనలు అమలులోకి తెస్తే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఏపీలో ఈ మధ్య కాలంలో పెద్ద సినిమాలేవీ బ్రేక్ ఈవెన్ కాలేదు.
టికెట్ రేట్లు కొంతమేర పెరిగిన నేపథ్యంలో పెద్ద సినిమాలు ఏపీలో బ్రేక్ ఈవెన్ అవుతాయేమో చూడాల్సి ఉంది. రాధేశ్యామ్ , ఆర్ఆర్ఆర్ సినిమాల కలెక్షన్లను బట్టి పెరిగిన టికెట్ రేట్లు పెద్ద సినిమాలకు అనుకూలంగా ఉన్నాయో ప్రతికూలంగా ఉన్నాయో తేలిపోనుంది.