Nikhil: ప్రతిష్ఠాత్మక అకాడెమీ అవార్డ్స్‌పై నిఖిల్ స్పందన వైరల్!
September 23, 2022 / 11:48 AM IST
|Follow Us
ఆస్కార్ అవార్డ్స్ బరిలో ఈ ఏడాది మన దేశం నుండి ‘ఆర్ఆర్ఆర్’ బరిలో నిలుస్తుందని చాలామంది అనుకున్నారు. అయితే ఈ సినిమాను కాదని ‘ఛల్లో షో’ అనే గుజరాతీ సినిమాను ఎంపిక చేశారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను ఎందుకు ఎంపిక చేయలేదనే విషయంలో చాలా రకాల వాదనలు వినిపిస్తున్నాయి. అయితే వీటి మధ్యలో మరో వాదన వినిపిస్తోంది. ఆస్కార్‌కి వెళ్తేనే మన సినిమా గొప్పనా, ఆ సర్టిఫికెట్ అవసరమా? అని. ఇప్పుడు యువ కథానాయకుడు నిఖిల్ కూడా అదే మాట అన్నాడు. దీంతో ఆయన మాటలు వైరల్‌గా మారాయి.
‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఆస్కార్‌కు నామినేట్ కాకపోవడంపై నిఖిల్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఒక సినిమాపై ప్రజలు చూపించే ప్రేమాభిమానాలు ఆస్కార్ కంటే చాలా గొప్పవన్న నిఖిల్.. తనకు ఆస్కార్ పై వేరే అభిప్రాయం ఉందని చెప్పాడు. ఆస్కార్‌ను అందరూ ఇష్టపడతారు కానీ ఓ సినిమాకు అతి పెద్ద విజయం ప్రజల ప్రేమ, ప్రశంసలే. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు అవి దక్కాయి. అంతకుమించి ఏం కావాలి అని ప్రశ్నించాడు నిఖిల్. ప్రపంచవ్యాప్తంగా ‘ఆర్ఆర్ఆర్’కు మంచి ఆదరణ దక్కింది. అదే ఆ సినిమాకు పెద్ద విజయం.
ఇక ఆస్కార్‌కి వెళ్తే ఎంత, వెళ్లకపోతే ఎంత? మనకు ఫిల్మ్ ఫేర్, నేషనల్ అవార్డులు అంటూ అవార్డులు ఉన్నాయి. అలాంటప్పుడు ఆస్కార్ గురించి ఎందుకు అని ఆయన తన అభిప్రాయం చెప్పాడు. అస్కార్కు నేను అంత ప్రాముఖ్యత ఇవ్వను అన్న నిఖిల్.. అసలు మనకు అస్కార్ నుంచి సర్టిఫికేట్ ఎందుకు అని అన్నాడు. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన అన్నిచోట్లా భారతీయ సినిమాలు దూసుకుపోతున్నాయి. మొన్నీమధ్యే నేను స్పెయిన్‌లో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చూశాను. థియేటర్లు హౌస్‌ఫుల్ అయ్యాయి.
స్పానిష్ ప్రజలు ఆ సినిమాను చూడడానికి మళ్లీ మళ్లీ సినిమా హాలుకు జనాలు వస్తున్నారు అని చెప్పారు. అయితే.. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా అమెరికా డిస్ట్రిబ్యూటర్ మాత్రం సినిమాను కొన్ని విభాగాల్లో నామినేట్ చేయాలని ఆస్కార్ అకాడమీలో పదివేల మంది సభ్యులకు పిలుపు ఇచ్చారు. దీని కోసం క్యాంపెయిన్ స్టార్ట్ చేయనున్నట్లు కూడా తెలిపారు. మరి ఏమవుతుందో చూడాలి.