Sudhakar Reddy: తెలుగు ప్రొడ్యూసర్లపై సుధాకర్ రెడ్డి కామెంట్స్!
June 10, 2022 / 12:36 PM IST
|Follow Us
నిర్మాతలంతా ఒక్కటిగా ఉండి… తమ సినిమాల విషయంలో నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది. లేదంటే ఒక్కో నిర్మాత ఒక్కోలా ఆలోచిస్తారు, దాని వల్ల ప్రేక్షకుడు ఇబ్బంది పడతాడు, థియేటర్లు ఇబ్బంది పడతాయి ఫైనల్‌గా సినిమా సఫర్ అవుతుంది. ఇదంతా ఎర్లీ ఓటీటీ రిలీజ్‌ల గురించే. అందులోనూ డబ్బులు పెట్టి ఓటీటీలో సినిమా చూసే విధానం గురించే అని మీకు అర్థమైపోయుంటుంది. తాజాగా ఈ వ్యవహారంపై ప్రముఖ నిర్మాత సుధాకర్ రెడ్డి మాట్లాడారు.
ఈ క్రమంలో నిర్మాతల మధ్య సమన్వయం గురించి ఆయన కొన్ని కామెంట్స్ చేశారు. కమల్ హాసన్ ‘విక్రమ్’ సినిమాను సుధాకర్ రెడ్డి తెలుగులో విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలుగు సినిమా పరిస్థితి గురించి ఆయన మాట్లాడారు. ప్రేక్షకులు మునుపటిలా థియేటర్లకు రావడం లేదు.. ఈ సమయంలో డబ్బింగ్ చిత్రం రావడం రిస్క్ అనిపించలేదా అని అడిగితే… ‘‘20 శాతం రిస్క్ ఉంటుందని అయితే భావించాం. అయితే మంచి చిత్రాల్ని ఆదరిస్తారనే నమ్మకంతో ముందుకెళ్లాం.
కమల్ సినిమా… ‘ఖైదీ’, ‘మాస్టర్’ లాంటి హిట్స్ ఇచ్చిన లోకేశ్ కనగరాజ్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్, సూర్య లాంటి పెద్ద స్టార్స్తోడు ఉండటంతో ముందుకెళ్లాం. విజయం సాధించాం అని చెప్పారు. ఈ సందర్భంగా సుధాకర్ రెడ్డి టికెట్ ధరలపై కూడా మాట్లాడారు. టికెట్ రేట్స్ విషయంలో మేము ప్రభుత్వాల్ని అడిగితే… రూ.200 నుండి రూ.350 వరకు పెంచుకోవచ్చని చెప్పారు. అయితే కొంతమంది నిర్మాతలు నేరుగా రూ.350 రేటు పెట్టేస్తున్నారు. కానీ నేను మాత్రం రూ.200 ఉంచా.
ఎందుకు అంతలా పెంచుతున్నారో అర్థం కావడం లేదు. బడ్జెట్లు పెరిగాయని టికెట్ రేట్స్ పెంచడం వల్ల రెండు, మూడు సార్లు చూసేవారు, కుటుంబాలు థియేటర్లకు రావడం లేదు అని సుధాకర్ రెడ్డి చెప్పారు. అంతేకాదు ఎలాగూ ఆ సినిమా రెండు, మూడు వారాల్లో ఓటీటీలోకి వచ్చేస్తుంది.. అప్పుడు చూసేద్దాంలే అనుకుంటున్నారు. అనుకున్నట్లుగా కొంతమంది నిర్మాతలు నిబంధనలను పక్కనపెట్టి ముందుగానే సినిమా ఓటీటీకి ఇచ్చేస్తున్నారు.
నిజానికి చిన్న చిత్రాల్ని ఐదు వారాలకు, పెద్ద సినిమాల్ని 50 రోజులకు ఓటీటీకి ఇవ్వాలని నిబంధన పెట్టుకున్నాం. అయితే సినిమా ఆడకపోతే వెంటనే మంచి ఆఫర్‌కు ఓటీటీకి ఇచ్చేసుకుంటున్నారు. దీని వల్ల థియేటర్ వ్యవస్థ తీవ్రంగా నష్టపోతోంది. నిర్మాతల మధ్య సమన్వయం లేకపోవడం వల్లే ఇలా జరుగుతోంది. పెద్ద చిత్రాలు విడుదల తర్వాత 50 రోజుల వరకు ఓటీటీకి ఇవ్వకూడదని నిబంధన పెట్టుకుంటే పరిశ్రమకు చాలా మంచిది అని సుధాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు.