దేశంలో రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. రికార్డు స్థాయిలో నమోదవుతున్న కేసుల వల్ల ప్రేక్షకులు థియేటర్లలో సినిమా చూడాలంటే భయాందోళనకు గురి కావాల్సిన పరిస్థితి నెలకొంది. త్వరలో థియేటర్లలో 50 శాతం ఆక్యుపెన్సీ నిబంధనలు అమలులోకి వస్తాయని వార్తలు వస్తున్నాయి. కరోనా మహమ్మారిని కట్టడి చేయాలంటే మాస్కులు తప్పనిసరిగా వాడాలనే సంగతి తెలిసిందే. మాస్కులు ధరించి కరోనా బారిన పడకుండా కొంతమంది జాగ్రత్తలు తీసుకుంటుంటే మరి కొంతమంది మాత్రం మాస్కుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
అయితే థియేటర్ యజమానులు మాస్కులు ధరించని వాళ్లకు భారీ షాక్ ఇస్తున్నారు. “మాస్క్ లేనివాళ్లకు ప్రవేశం లేదు” అంటూ థియేటర్ల ముందు బోర్డులు పెడుతున్నారు. హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఉన్న సుదర్శన్ థియేటర్ లో ఇప్పటికే “నో మాస్క్ నో ఎంట్రీ” అంటూ బోర్డులు పెట్టారు. రాబోయే రోజుల్లో మాస్క్ లేనిదే థియేటర్లకు ప్రవేశం లేదంటూ రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త నిబంధనలను తెరపైకి తెచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
మాస్క్ ధరిస్తేనే థియేటర్లకు రావాలనే నిబంధనలను తెరపైకి తెస్తే ప్రేక్షకులు సినిమాలకు దూరమయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. మరోవైపు కొత్త సినిమాలు రిలీజ్ కాకపోవడంతో థియేటర్లు మూత పడుతున్నాయని తెలుస్తోంది. ఏపీలో టికెట్ రేట్లు తగ్గించడం వల్ల థియేటర్ల ఓనర్లు సైతం తమ సినిమాలను రిలీజ్ చేయడానికి ఆసక్తి చూపడం లేదు. కరోనా కేసులు తగ్గి పరిస్థితులు అదుపులోకి రావడానికి ఎన్ని రోజుల సమయం పడుతుందో చూడాల్సి ఉంది.