ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమా సెట్స్ పైకి వెళ్తున్నప్పుడే.. విడుదల తేదీ కూడా ఫిక్స్ చేసుకుని ఉంచుకోవడం మంచిది. లేక పోతే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందే అని ఈ బాబాయ్, అబ్బాయి లను చూస్తే అర్థం చేసుకోవచ్చు. నందమూరి బాలకృష్ణ హీరోగా కె.ఎస్.రవికుమార్ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ‘రూలర్’ చిత్రాన్ని మొదట 2020 సంక్రాంతి కానుకగా విడుదల చేయాలనుకున్నారు. అయితే అప్పటీకే మహేష్ బాబు, బన్నీ సినిమాల రిలీజ్ డేట్ లు ఫిక్స్ చేసుకోవడంతో.. డిసెంబర్ 20 కి ప్రీ పోన్ చేశారు. అయితే ‘రూలర్’ కి ఓ వారం ముందు ‘వెంకీమామ’ వంటి క్రేజీ సినిమా రావడం.. ఇక ‘రూలర్’ విడుదలవుతున్న రోజునే సాయి తేజ్ ‘ప్రతీ రోజు పండగే’ సినిమా విడుదల కాబోతుండడంతో పెద్ద ప్రాబ్లెమ్ వచ్చింది. దీంతో ‘రూలర్’ సినిమాకి ఎక్కువ థియేటర్స్ దొరకలేదనేది ఇన్సైడ్ టాక్. ఇక ‘రూలర్’ టీజర్, ట్రైలర్ లకు మంచి టాక్ కూడా రాకపోవడంతో అదే పెద్ద సమస్య వచ్చి పడింది.
ఇప్పుడు అబ్బాయి సంగతికి వద్దాం.. 2020 సంక్రాంతికి సతీష్ వేగేశ్న డైరెక్షన్లో ‘ఎంత మంచి వాడవురా’ చిత్రంతో ప్రేక్షకులు ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు కళ్యాణ్ రామ్. మహేష్, బన్నీ సినిమాల మధ్యలో రావడం వలన ఈ చిత్రాన్ని ఎవ్వరూ పెద్దగా పట్టించుకోవట్లేదు. ఈ చిత్రానికి గట్టిగా 300 థియేటర్లు మాత్రమే దొరికే అవకాశం ఉందనేది ఇన్సైడ్ టాక్. కనీసం ఈ చిత్రానికి ప్రమోషన్లు కూడా జోరుగా జరగడం లేదు. ఫస్ట్ సింగిల్ విడుదలైన విషయం కూడా చాలా మందికి తెలీదంటే.. ప్రమోషన్లు ఎంత నీరసంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఏమైనా బాబాయ్, అబ్బాయిలు ఇద్దరి సినిమాలకి ఒకే రకమైన పరిస్థితి ఏర్పడడం.. గమనించ దగ్గ విషయం.