నందమూరి తారకరామారావు బయోపిక్ మూవీ క్రిష్ చేతికిరాగానే భారీ మార్పులు జరుగుతున్నాయి. చక చక సినిమాని కంప్లీట్ చేసి ముగించాము.. అనిపించుకోవడం కన్నా.. కాస్త ఆలస్యమైనా అద్భుతంగా తెరకెక్కించాలని భావిస్తున్నారు. అందుకే ఎన్టీఆర్ పాత్ర పోషించే బాలయ్య దగ్గర నుంచి ప్రతి ఒక్కరికీ ప్రత్యేక ట్రైనింగ్ ఇస్తున్నారు. కొన్ని పాత్రలకు కొత్తవారికి కూడా అవకాశం ఇస్తున్నారు. అయితే రాముడు.. కృష్ణుడు.. భీముడు.. ఏ పాత్రనైనా అవలీలగా పోషించిన ఎన్టీఆర్ గురించి మూడు గంటల్లో చెప్పడం అసాధ్యమని డైరక్టర్ ఫిక్స్ అయ్యారు. బాహుబలి రూట్లోనే వెళాళ్లని డిసైడ్ అయ్యారు. రెండు భాగాలుగా తెరకెక్కించాలని నిర్ణయించుకున్నారు. నటుడిగా ఎన్టీఆర్ విజయాలు గురించి ఒక భాగంలో చూపించనున్నారు.
ఆ మూవీని సంక్రాంతికి తీసుకురావాలని ప్లాన్ వేశారు. ఇక రెండో భాగంలో రాజకీయ ప్రవేశం.. కుట్రలు కుతంత్రాలు.. ఎత్తుగడలు.. పోరాటాలను చూపించనున్నారు. రెండు రూపాయలకు కిలో బియ్యం.. మద్యనిషేధం వంటి పథకాలు, కార్యక్రమాల గురించి కూడా ప్రస్తావించనున్నారు. ఈ సినిమా కొన్ని నెలల తర్వాత విడుదల చేయనున్నారు. ఎన్బీకే ఫిలింస్ బ్యానర్‌పై బాలకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాకు సాయి కొర్రపాటి, విష్ణువర్థన్ ఇందూరిలు సహనిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. బాలీవుడ్ ఛాయగ్రాహకుడు సంతోష్ తుండియిల్ సినిమాటోగ్రఫి అందిస్తున్నారు. కీరవాణి సంగీతమందిస్తున్న ఈ సినిమాలో బసవతారకం పాత్రకు విద్యాబాలన్ ఓకే చెప్పింది. ఈ చిత్రం గురించి మరిన్ని వివరాలు త్వరలోనే బయటికి రానున్నాయి.