Uma Maheswari: మహాప్రస్థానంలో ముగిసిన ఉమా మహేశ్వరి అంత్యక్రియలు!
August 3, 2022 / 04:10 PM IST
|Follow Us
మాజీ ముఖ్యమంత్రి సీనియర్ ఎన్టీఆర్ కూతురు ఉమా మహేశ్వరి సోమవారం రోజున మృతి చెందిన సంగతి తెలిసిందే. అనారోగ్య సమస్యలు, మానసిక ఒత్తిడి వల్ల ఆమ ఆత్మహత్య చేసుకున్నారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఉమా మహేశ్వరి పాడెను ఆమె సోదరులైన బాలకృష్ణ, తదితరులు మోశారు. ఆమెను కడసారి చూసేందుకు బంధువులు, ఫ్యాన్స్ పెద్దఎత్తున తరలివచ్చారు. ఉమా మహేశ్వరి భర్త శ్రీనివాస ప్రసాద్ చితికి నిప్పంటించారు. ఉమా మహేశ్వరి అంతిక సంస్కారాలకు చంద్రబాబు నాయుడు, లోకేశ్, పలువురు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.
సోదరి మరణంతో బాధలో ఉన్న బాలకృష్ణ పాడె మోస్తుండటంతో పలువురు బాలయ్య అభిమానులు కంటతడి పెట్టుకున్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, పలువురు ప్రముఖులు అంత్యక్రియలకు హాజరై నివాళులు అర్పించారు. ఉమా మహేశ్వరి మరణానికి సంబంధించి పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఉమా మహేశ్వరి చాలా మంచివారని ఇతరులకు సహాయం చేసే గొప్ప గుణం ఆమెకు ఉందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. మహా ప్రస్థానంలో హిందూ సంప్రదాయాల ప్రకారం ఆమె అంత్యక్రియలు పూర్తయ్యాయి.
ఉమా మహేశ్వరి మరణం ఆమె ఫ్యామిలీ మెంబర్స్ కు తీరని దుఃఖాన్ని మిగిల్చింది. ఉమా మహేశ్వరికి ఇద్దరు కూతుళ్లు కాగా ఆమె పెద్ద కూతురు విశాల అమెరికాలో ఉంటున్నారు. సీనియర్ ఎన్టీఆర్ చిన్న కూతురు ఆత్మహత్య చేసుకోవడం నందమూరి ఫ్యాన్స్ ను సైతం ఎంతగానో బాధ పెడుతోంది. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం విదేశాల్లో ఉండటంతో ఉమా మహేశ్వరి అంత్యక్రియలకు హాజరు కాలేదని తెలుస్తోంది.
నందమూరి కుటుంబంలో ఆగష్టు నెలలో విషాదాలు చోటు చేసుకుంటూ ఉండటం అభిమానులను మరింత బాధపెడుతోంది. ఉమా మహేశ్వరి ఆత్మహత్యకు సంబంధించి పోస్టుమార్టం నివేదిక ఈరోజు వెల్లడి కానుంది. జూబ్లీహిల్స్ పోలీసులు సెక్షన్ 174 కింద ఉమా మహేశ్వరి మృతిని అనుమానాస్పద కేసుగా నమోదు చేసుకున్నారు.