ఇలా చేయడం వలన పవన్ కి ఎలాంటి నష్టం లేదు.. నిర్మాత కామెంట్స్!
February 25, 2022 / 04:13 PM IST
|Follow Us
తమను ప్రభుత్వం దొంగల్లా అవమానిస్తోందని.. ప్రముఖ నిర్మాత, ఫిల్మ్ ఛాంబర్ మాజీ అధ్యక్షుడు ఎన్వీ ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘భీమ్లానాయక్’ సినిమా విడుదల నేపథ్యంలో నిబంధనలు కఠినంగా అమలు చేయడానికి ప్రభుత్వం రెవిన్యూ డిపార్ట్మెంట్ ని అప్రమత్తం చేసింది. ఈ మేరకు రెవిన్యూ డిపార్ట్మెంట్ వాళ్లు సినిమా థియేటర్ల వద్ద మకాం వేసి.. అన్ని నిబంధనలు అమలు అయ్యేలా చూస్తున్నారు. ఈ నేపథ్యంలో నిర్మాత, ఫిల్మ్ ఛాంబర్ మాజీ అధ్యక్షుడు ఎన్వీ ప్రసాద్ తాజా పరిణామాలపై స్పందిస్తూ.. ఆవేదన వ్యక్తం చేశారు.
కోవిడ్ తో ఎగ్జిబిటర్లు కోలుకోలేని స్థితికి చేరుకున్నారని.. అన్ని టాక్స్ లు కట్టించుకొని రెన్యూవల్ చేయడం లేదని అన్నారు. ఉదయం పది గంటల్లోపు ఎవరూ సినిమా వేయలేదని స్పష్టం చేశారు. సినిమా వాళ్లను దొంగల్లా అవమానిస్తూ.. థియేటర్ వద్ద 15 మందిని కాపలా పెట్టి.. దాడులు చేయడం కరెక్ట్ కాదని ఫైర్ అయ్యారు. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి చనిపోయిన విషాదంలో ఉన్న సమయంలో.. థియేటర్ల వ్యవస్థపై ఈ దాడి అవసరమా..? అని ఎన్వీ ప్రసాద్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
కరోనా కంటే ఇది తీవ్రమైన దాడిగా ఆయన అభివర్ణించారు. ఇలాంటి చర్యల వలన పవన్ కళ్యాణ్ కి ఎలాంటి నష్టం లేదని అన్నారు. ముఖ్యమంత్రికి కూడా విజయవాడలో థియేటర్లు ఉన్నాయని.. అక్కడ పరిస్థితి ఏంటో తెలుసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో ఎన్నో ప్రజా సమస్యలు ఉంటే ఏపీ ముఖ్యమంత్రి మాత్రం అవి పట్టించుకోకుండా.. థియేటర్ల వద్దకు రెవిన్యూ, పోలీసులు అధికారులను పంపించి నిబంధనలు కచ్చితంగా అమలు చేయడాన్ని కక్ష సాధింపు చర్యగా ఇండస్ట్రీ భావిస్తోంది. ఎవరెన్ని చెప్పినా.. ఏపీలో ఈ పోకడ మారేలా లేదు. మరేం జరుగుతుందో చూడాలి!