ఆపరేషన్ 2019

  • December 1, 2018 / 11:27 AM IST

ఫ్యామిలీ హీరో కమ్ పీపుల్ స్టార్ శ్రీకాంత్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం “ఆపరేషన్ 2019”. కారణం బాబ్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. శ్రీకాంత్ పొలిటీషియన్ గా నటించిన ఈ చిత్రం తెలంగాణ ఎన్నికలు వచ్చే వారం జరగనున్న నేపధ్యంలో ఇవాళ విడుదల చేశారు. మరి గత కొన్నాళ్లుగా సరైన విజయం లేక ఢీలాపడ్డ శ్రీకాంత్ కి ఈ “ఆపరేషన్ 2019” ఏమైనా పనికొచ్చిందో లేదో చూద్దాం..!!

కథ : కంకిపాడు అనే కుగ్రామంలో పుట్టి పెరిగి ఆ ఊరూవాళ్ళందరూ కలిసి చదివించగా అమెరికాలో మంచి ఉద్యోగంలో స్థిరపడతాడు ఉమా శంకర్ (శ్రీకాంత్). ఒకానొక సందర్భంలో తన ఊరి రైతులు కష్టంలో ఉన్నారని తెలిసి తమ ఏరియా ఎమ్మెల్యే ద్వారా వారికి సహాయం చేయమని కోటి రూపాయల చెక్ ను అమెరికా నుంచి పంపిస్తాడు. కానీ రాజకీయనాయకులు ఆ డబ్బును మింగేయడంతో.. దిక్కు తోచని స్థితిలో పురుగుల మందు తాగి పదుల సంఖ్యలో రైతులు మరణిస్తారు. ప్రజలకు న్యాయం చేయాలంటే రాజకీయాల్లోకి దిగడమే సరి అని భావించి ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొంటాడు. కానీ.. మార్పు రావాల్సింది రాజకీయాల్లో కాదని, ప్రజల్లో అని తెలిసోచ్చేసరికి తన విధానాలు మార్చుకొని కొత్త తరహాలో రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇస్తాడు?

ఇంతకీ ఏమిటా కొత్త తరహా? ఉమా శంకర్ కోరుకున్న మార్పు ప్రజల్లో వచ్చిందా లేదా? అనేది “ఆపరేషన్ 2019” కథాంశం.

నటీనటుల పనితీరు : నటుడిగా శ్రీకాంత్ కు వంక పెట్టాల్సిన పనిలేదు.. సన్నివేశంలో పస లేకపోయినా తనదైన బాడీ లాంగ్వేజ్ తో, మ్యానరిజమ్స్ తో ఉమా శంకర్ పాత్రకు ప్రాణం పోసాడు. డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్న పాత్రను చాలా సమర్ధవంతంగా పోషించాడు శ్రీకాంత్.

సీనియర్ మోస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిన కోట శ్రీనివాసరావు గారికి సినిమా మొత్తంలో ఒక్కటంటే ఒక్క డైలాగ్ కూడా లేకపోవడం ఆయన్ని అవమానించినట్లే. అలాగే.. పోసాని కృష్ణమురళి, నాగినీడు, జీవా లాంటి ఆర్టిస్టులను కూడా సరిగా వినియోగించుకోలేదు.

ఇక దీక్షా పంత్ కోరికతో చూస్తుందో.. ఆకలిగా అన్నం కోసం ఎదురుచూస్తుందో అర్ధం కాకుండా ఉంటుంది. ఇక ఆమె శ్రీకాంత్ ను లోబరుచుకోవడం చేసే ప్రయత్నాలు ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తాయి.

కమెడియన్ సునీల్ ను తీసుకొచ్చి కథతో ఏమాత్రం సంబంధం లేకుండా ఒక ఐటెమ్ సాంగ్ ఎందుకు చేయించారో అర్ధం కాదు, “బిగ్ బాస్”తో మంచి గుర్తింపు తెచ్చుకున్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ హరితేజతో ఎందుకని ఐటెమ్ సాంగ్ చేయించారో తెలియదు.. ఇక మంచు మనోజ్ చేత స్పెషల్ ఎంట్రీ ఇప్పించి మరీ స్లో మోషన్ ఫైట్ ఎందుకు చేయించారో దర్శకుడి విజ్ణతకే వదిలేస్తున్నాం.

సాంకేతికవర్గం పనితీరు : అప్పుడెప్పుడో 2007లో వచ్చిన “ఆపరేషన్ దుర్యోధన”లోనే ఆల్రెడీ డిస్కస్ చేయడమే కాక పరిష్కారం కూడా చూపబడ్డ అంశాన్ని మళ్ళీ లేవనెత్తి “ఆపరేషన్ 2019” అంటూ దర్శకుడు కొత్తగా ఏం చెప్పాలి అనుకున్నాడో అర్ధం కాలేదు. పైగా.. కమర్షియల్ అంశాల పేరిట యాడ్ చేసిన సాంగ్స్ & ఫైట్స్ చూడ్డానికి ఇబ్బందికరంగానే కాక ఏదో కాస్తంత ఆసక్తికరంగా సాగుతున్న కథనానికి స్పీడ్ బ్రేకర్స్ లా మారాయి. శ్రీకాంత్ నుంచి అద్భుతమైన నటన రాబట్టుకున్న దర్శకుడు కథనాన్ని ఎందుకు గాలికొదిలేశాడు. ఏదో రాజకీయ వేడి ప్రస్తుతం హెవీగా ఉంది కాబట్టి ఈ సినిమాను రిలీజ్ చేశారు కానీ.. సినిమాలో కంటెంట్ ఏమిటనేది ఎవరికీ పెద్ద క్లారిటీ ఉండదు.

వెంకట్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ బాగుంది. ర్యాప్ రాక్ షకీల్ పాటలు ఆయనకు తప్ప ఎవరికీ అర్ధం కావేమో. ఆ ట్యూన్స్ కొత్తగా ఉన్నాయి అని ఆయనకి అనిపించినంతగా ప్రేక్షకులకు కూడా అనిపించాలని ఆయన ఇప్పటికైనా గ్రహిస్తే బాగుంటుంది.

నిర్మాణ విలువలు బాగున్నాయి కానీ.. ఆ నిర్మాణ విలువలను దర్శకుడు సరిన రీతిలో వినియోగించుకోలేకపోయాడు.

విశ్లేషణ : సాధారణంగా ఆపరేషన్ సక్సెస్.. పేషెంట్ డెడ్ అంటుంటారు కదా, ఆ తరహాలో “ఆపరేషన్ 2019” ఫెయిల్.. ఆడియన్స్ డెడ్ అన్నట్లుగా ఉంది థియేటర్లలో పరిస్థితి. సొ, సినిమాకి వెళ్లాలా లేదా అనేది మీ ఇష్టమిక.

రేటింగ్: 1/5

Click Here To Read In ENGLISH

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus