Operation Valentine Review in Telugu: ఆపరేషన్ వాలెంటైన్ సినిమా రివ్యూ & రేటింగ్!
March 1, 2024 / 08:55 AM IST
|Follow Us
Cast & Crew
వరుణ్ తేజ్ (Hero)
మానుషి చిల్లర్ (Heroine)
రుహాని శర్మ, నవదీప్,సంపత్ రాజ్, అభినవ్ గోమఠం, అలీ రెజా తదితరులు (Cast)
శక్తి ప్రతాప్ సింగ్ హడా (Director)
సిద్ధు ముద్ద, నందకుమార్ అబ్బినేని (Producer)
మిక్కీ జె మేయర్ (Music)
హరి కె వేదాంతం (Cinematography)
టాలీవుడ్లో ఉన్న పెద్ద ఫ్యామిలీస్ కి చెందిన హీరోల్లో ఎవరొకరు ప్రయోగాత్మక సినిమాలు చేస్తూనే ఉన్నారు. నందమూరి ఫ్యామిలీలో కళ్యాణ్ రామ్, దగ్గుబాటి ఫ్యామిలీలో రానా, ఘట్టమనేని ఫ్యామిలీలో సుధీర్ బాబు… అలా మెగా ఫ్యామిలీలో కూడా ప్రయోగాత్మక చిత్రాలు ఎక్కువగా చేసే హీరోగా వరుణ్ తేజ్ గురించి చెప్పుకోవచ్చు. తన కటౌట్ కి తగ్గట్టు కమర్షియల్ సినిమాలు చేసి మార్కెట్ పెంచుకుందాం అనే తపన ఇతనికి ఉండదు. అందుకే ‘కంచె’ ‘అంతరిక్షం’ వంటి గొప్ప సినిమాలు వచ్చాయి.
కమర్షియల్ గా అవి సక్సెస్ అయ్యాయా లేదా అనేది తర్వాతి సంగతి. కానీ టాలీవుడ్లో అడ్వాన్స్డ్ కాన్సెప్ట్ తో వచ్చిన సినిమాల్లో అవి కూడా స్థానం పొందాయి. ఇక వరుణ్ తేజ్ ఇప్పుడు మళ్ళీ అలాంటి ప్రయోగాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అదే ‘ఆపరేషన్ వాలెంటైన్’. టీజర్, ట్రైలర్స్ తో ‘ఆపరేషన్ వాలెంటైన్’ పై ఒక్కసారిగా ప్రేక్షకుల దృష్టి పడింది. మరి సినిమా వాటి స్థాయిలో ఉందో లేదో తెలుసుకుందాం రండి :
కథ : అర్జున్ దేవ్ ( వరుణ్ తేజ్) ఇండియన్ ఎయిర్ ఫోర్స్(ఐఏఎఫ్) లో వింగ్ కమాండర్ గా పనిచేస్తూ ఉంటాడు. ఎయర్ క్రాఫ్ట్స్ ని టెస్ట్ చేయడం అతని పని. అతను టెస్ట్ చేసిన ఎయిర్ క్రాఫ్ట్స్ ని దేశ రక్షణ కొరకై వాడుతుంటారు. ఒక రోజు అర్జున్ ని పాకిస్థాన్ జెట్స్ టార్గెట్ చేస్తాయి.2021 ఫిబ్రవరి 14న డి.ఆర్.డి.ఓ నుండి వచ్చిన ఒక కొత్త ఎయిర్ క్రాఫ్ట్ ను టెస్ట్ చేసి.. బేస్ క్యాంప్ కి వెళ్తుండగా అర్జున్ వారికి టార్గెట్ అవుతాడు. తర్వాత అది ట్రాప్ అని తెలుస్తుంది. విషయం ఏంటంటే.. అర్జున్ అండ్ టీం, అదే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ టీం మొత్తం..
తమపై టార్గెట్ చేసిన జెట్స్ పై దృష్టి పెట్టిన టైంలో భూమి కింది భాగం నుండి పుల్వామా దాడి జరుగుతుంది. ఈ క్రమంలో 40 మందికి పైగా ఇండియన్ సోల్జర్స్ వీరమరణం పొందుతారు. తర్వాత అందుకు ప్రతీకారంగా ఐఏఎఫ్ ఏం చేసింది? వింగ్ కమాండర్ అర్జున్ ఆశయం ఏంటి? అతని భార్య, ఏవియేషన్ ఆఫీసర్ అయిన అహ్న గిల్( మానుషి చిల్లర్) పాత్ర ఏమిటి? చివరికి ఐఏఎఫ్ సక్సెస్ అయ్యిందా? అర్జున్ ఏమయ్యాడు? అనేది మిగిలిన కథ.
నటీనటుల పనితీరు : వరుణ్ తేజ్ చాలా నేచురల్ గా నటించాడు. నటుడిగా ఈ సినిమాతో అతను ఇంకో మెట్టు పైకి ఎక్కాడు అని చెప్పాలి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో పనిచేసే అర్జున్ దేవ్ పాత్రలో చాలా చక్కగా సెట్ అయ్యాడు కూడా. అతని హైట్ ని బట్టి.. ఇది అతనికి టైలర్ మేడ్ రోల్ అనే ఫీలింగ్ కలుగుతుంది. మానుషి చిల్లర్ బాగానే చేసింది కానీ ఆమె లుక్స్ సో సో గానే ఉన్నాయి.
రుహాని శర్మ బాగానే కనిపించింది కానీ పెద్దగా నటనకు స్కోప్ ఉన్న పాత్ర ఆమెది కాదు. మిగిలిన నటీనటుల్లో నవదీప్ పర్వాలేదు అనిపించగా, అలీ రెజా, అభినవ్ గోమఠం .. తమ పాత్రల పరిధి మేరకు నటించారు అని చెప్పాలి.
సాంకేతిక నిపుణుల పనితీరు : ఇండియన్ సోల్జర్స్ పై జరిగిన పుల్వామా ఉగ్రవాద దాడిని అంత ఈజీగా ఎవ్వరూ మర్చిపోలేరు. ఆ తర్వాత మన దేశ సైనిక దళం తీర్చుకున్న ప్రతీకార చర్య ఏదైతే ఉందో అదొక సంచలనం.ఇదే పాయింట్ తో ఆపరేషన్ వాలెంటైన్ ను రూపొందించాడు దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హడా. వాస్తవానికి అదే పాయింట్ తో ‘యురి ది సర్జికల్ స్ట్రైక్”ఫైటర్’ వంటి సినిమాలు రూపొందాయి. అవి రెండూ సూపర్ హిట్ అయ్యాయి. అదే పాయింట్ తో ‘ఆపరేషన్ వాలెంటైన్’ ను మరింత నేచురల్ గా, ముఖ్యంగా దేశభక్తి అందరికీ కలిగించేలా శక్తి ఈ చిత్రాన్ని ఆవిష్కరించాడు అని చెప్పొచ్చు.
అతని ఎమోషన్ కి బుర్రా సాయి మాధవ్ సంభాషణలు బాగా హెల్ప్ అయ్యాయి. హరి కె వేదాంతం సినిమాటోగ్రఫీ బాగుంది అని చెప్పేసి సరిపెడితే సరిపోదు. విజువల్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. వాటి కోసమైనా సినిమా కచ్చితంగా థియేటర్స్ లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. ప్రొడక్షన్ వాల్యూస్ కి పేరు పెట్టాల్సిన అవసరం లేదు. రన్ టైం కూడా కరెక్ట్ గా 2 గంటల 12 నిమిషాలే ఉండటం చాలా ప్లస్ అయ్యిందని చెప్పాలి.
విశ్లేషణ: ఆపరేషన్ వాలెంటైన్ (Operation Valentine) అందరిలోనూ దాగున్న దేశభక్తిని తట్టిలేపే సినిమా. వరుణ్ తేజ్ నటన,సెకండ్ హాఫ్, వీఎఫ్ఎక్స్ కోసం ఈ వీకెండ్ కి కచ్చితంగా థియేటర్లలో చూడొచ్చు.