ఈ ఏడాది విడుదలైన చిన్న సినిమాల్లో రికార్డు సృష్టించిన చిత్రం ‘సైరత్’. నాలుగు కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మరాఠీ చిత్రం వంద కోట్లు వసూలు చేసి వార్తల్లో నిలిచింది. పరువు హత్యల నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకుల, విమర్శకులను మెప్పించి దేశవ్యాప్తంగా అన్ని పరిశ్రమల వారినీ ఆకర్శించింది. పలువురు ఈ సినిమా రీమేక్ చేసేందుకు ఆసక్తి చూపగా తెలుగులో పరశురామ్ ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడట.
‘యువత’ సినిమాతో మెగాఫోన్ చేతబట్టిన పరశురామ్ కెరీర్లో జయాపజయాలు సమంగా ఉన్నాయి. మూడేళ్ళ తర్వాత చేసిన ‘శ్రీరస్తు శుభమస్తు’ సినిమా ఇటీవల విడుదలై విజయవంతంగా యాభై రోజులు పూర్తి చేసుకుంది. దీని తర్వాత అల్లు అర్జున్ తో సినిమా చేసే ప్రయత్నంలో ఉన్నాడు. అయితే బన్నీ ఇప్పట్లో ఖాళీ అయ్యేలా లేడు. అందుకని ‘సైరత్’ సినిమా రీమేక్ చేసేందుకు సిద్ధమయ్యాడట పరశురామ్. ‘సైరత్’ అన్ని భాషల రీమేక్ హక్కులను రాక్ లైన్ వెంకటేష్ గంపగుత్తగా సొంతం చేసుకున్నారు. పరశురామ్ కి ఈ ఆఫర్ ఇచ్చింది అతడేనట. అయితే పరువు హత్యల నేపథ్యంలో మన దగ్గర ఇప్పటికే చాలా చిత్రాలు వచ్చాయి. అయితే అంతగా మెప్పించలేకపోయాయి. మరి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో చూడాలి.