సైరాలోని అద్భుతమైన డైలాగ్ లీక్ చేసిన పరుచూరి గోపాల కృష్ణ
August 23, 2018 / 05:44 AM IST
|Follow Us
మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ విజయవంతమైన తర్వాత చేస్తున్న మూవీ సైరా నరసింహా రెడ్డి. తొలి భారతీయ స్వాతంత్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి జీవితం ఆధారంగా రూపుదిద్దుకుంటున్న ఈ మూవీలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కీలకరోల్ పోషిస్తున్నారు. డైరక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం స్టడీగా షూటింగ్ జరుపుకుంటోంది. హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ నేపథ్యంలో యాక్షన్ దృశ్యాలను తెరకెక్కిస్తున్నారు. వయసు మరిచి చిరు ఈ సినిమా కోసం కష్టపడుతున్నారు. ఆ విషయం మొన్న రిలీజ్ అయిన టీజర్ స్పష్టం చేసింది. “ఈ యుద్ధం ఎవరిది?” అంటూ చిరు చెప్పే డైలాగ్, గుర్రం పై నుంచి చేసే చిరు చేసే విన్యాసాలు సినిమాపై అంచనాలు పెంచేసాయి.
ఈ టీజర్ కి వస్తున్న రెస్పాన్స్ చూసి ఈ చిత్రానికి డైలాగులను అందించిన పరుచూరి బ్రదర్స్ ఆనందాన్ని ఆపుకోలేకపోయారు. అభిమానులకోసం సినిమాలోని ఓ డైలాగ్ ని లీక్ చేశారు. సైరా ని బ్రిటిష్ అధికారులు ఉరి తీయబోయే ముందు… “చేతులు విరిచేశాం.. ముఖం ముందు ఉరితాడు ఉంది.. ఏంట్రా ఆ ధైర్యం” అని వారు అంటే.. “చచ్చి పుట్టిన వాడిని.. చనిపోయిన తరువాత కూడా బ్రతికే వాడిని.. చావంటే నాకెందురా భయం” అని చిరంజీవి అంటారు… అని కీలక సన్నివేశంలో డైలాగ్ ని బయటికి చెప్పారు. ఈ డైలాగ్ చిరు నోటి వెంట వస్తే రోమాలు నిక్కబొడుచుకుంటాయని, చప్పట్లతో హాల్ దద్దరిల్లిపోతుందని అభిమానులు ఆనందపడుతున్నారు. పరుచూరి గోపాల కృష్ణ మాత్రం ఈ డైలాగ్ లీక్ చేయడం వల్ల చిరంజీవి కోపం వస్తుందేమోనని కాస్త భయపడుతున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్లో రామ్ చరణ్ తేజ్ 200 కోట్లతో నిర్మిస్తున్న మూవీ అనేక రికార్డులను బద్దలు కొట్టడానికి వచ్చేఏడాది థియేటర్లోకి రానుంది.