పటేల్ సార్

  • July 15, 2017 / 12:59 PM IST

జగపతిబాబు కొన్నాళ్ళ విరామం అనంతరం కథానాయకుడిగా నటించిన చిత్రం “పటేల్ సర్”. జగపతిబాబు ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రం ద్వారా వాసు పరిమి దర్శకుడిగా పరిచయమయ్యాడు. వారాహి చలనచిత్రం సంస్థ నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్ మంచి అంచనాలను రేపింది. మరి అంచనాల స్థాయిలో సినిమా ఉందో లేదో చూద్దాం..!!

కథ : పటేల్ సార్ (జగపతి బాబు) ఓ చిన్ని పాప యామిని (బేబీ డాలీ)ని వెంటేసుకొని.. సిటీలో పేరు మోసిన గూండాలను ఒకొక్కరిగా ప్రత్యేకమైన పద్ధతుల్లో చంపుతుంటాడు. ఆఖరి వ్యక్తిని చంపేలోపు మాత్రం గుండెనొప్పి కారణంగా పోలీసులకి దొరికిపోతాడు. అసలు పటేల్ సార్ ఎవరు, గూండాలని చంపడానికి ఎందుకు పూనుకొంటాడు? ఆ చిన్నపిల్లను ఎందుకు వెంటేసుకొని తిరుగుతుంటాడు? వంటి ప్రశ్నలకు సమాధానమే “పటేల్ సార్” సినిమా.

నటీనటుల పనితీరు : జగపతిబాబు మంచి ఆర్టిస్టే కానీ.. ఎమోషన్స్ ను పండించడంలో ముందు నుంచీ కాస్త వీక్. ఈ సినిమాలోనూ అంతే.. యాక్షన్ సీక్వెన్స్ ల వరకూ పర్లేదు కానీ.. ఎమోషనల్ సీన్స్ లో మాత్రం తేలిపోయాడు. లుక్ పరంగా మాత్రం జగపతిబాబు కెరీర్ లో బెస్ట్ అని చెప్పుకోవాలి. తాన్య హోప్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో అందంగా కనిపించిందే కానీ.. పోలీస్ ఆఫీసర్ బాడీ లాంగ్వేజ్ ను ఎక్కడా మెయింటైన్ చేయలేదు. బికినీ సీన్ లో మాత్రం కాస్త ఉదారత చూపి శృంగార రసాన్ని రసవత్తరంగా పండించింది. జగపతిబాబు భార్య పాత్రలో “మృగం, అందరి బంధువయా” ఫేమ్ పద్మప్రియ సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో అలరించింది. సుబ్బరాజు, కబీర్ సింగ్, పృధ్వీ వంటి నటులు విలనిజాన్ని ఎప్పట్లానే పండించారు.

సాంకేతికవర్గం పనితీరు : వసంత్ బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. థీమ్ మ్యూజిక్ కాపీయే అయినా సన్నివేశానికి బాగా సింక్ అయ్యింది. “అల్లిబిల్లి..” పాట వినసోంపుగానే కాక అర్ధవంతంగానూ ఉంది. శ్యామ్ కె.నాయుడు సినిమాటోగ్రఫీ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ. టింట్, కలరింగ్, వి,ఎఫ్.ఎక్స్ వంటి అన్నిట్నీ చాలా జాగ్రత్తగా మేనేజ్ చేశారు. స్లోమోషన్ షాట్స్, ఎలివేషన్ షాట్స్ ఆకట్టుకొనే విధంగా ఉన్నాయి. డైలాగ్స్ లో ప్రాసలే తప్ప అర్ధం చాలా తక్కువగా వినిపించింది. దర్శకుడు వాసు పరిమి చాలా హాలీవుడ్ సినిమాల నుండి కథ మరియు టేకింగ్ ను ఇన్స్ ఫైర్ అయ్యాడన్న విషయం ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తూనే ఉంటుంది. అందువల్ల.. టేకింగ్ కాస్త డిఫరెంట్ గా కనిపిస్తుంది తప్ప, స్క్రీన్ ప్లే కానీ ఆర్టిస్టుల నటన కానీ అలరించే స్థాయిలో లేకపోవడంతో సినిమా ఆకట్టుకోలేక డీలాపడుతుంది. నిజానికి ఈ రివెంజ్ డ్రామాను ఇంకా ఆసక్తికరంగా తెరకెక్కించేందుకు బోలెడన్ని అవకాశాలున్నాయి. కానీ.. డైరెక్టర్ మాత్రం కేవలం జగ్గూభాయ్ స్టైలింగ్ మీద మాత్రమే దృష్టిసారించి మిగతా విషయాలను గాలికొదిలేయడంతో సినిమా అటకెక్కింది.

విశ్లేషణ : ఒక్క డైరెక్టర్ తప్ప.. సినిమా కథ-కథనం-థీమ్ అన్నీ పాతవే. సో, జగపతిబాబు ఎంత స్టైలిష్ గా కనిపించినా.. శ్యామ్ కె.నాయుడు అద్భుతమైన సినిమాటోగ్రఫీ వర్క్, వసంత్ కష్టపడి కాపీ కొట్టి మరీ పేస్ట్ చేసిన ఆకట్టుకొనే బ్యాగ్రౌండ్ స్కోర్ వంటి ప్లస్ పాయింట్స్ ఎన్ని ఉన్నా.. అసలు విషయం (కథ) బలహీనం కావడంతో అందరి శ్రమ బూడిదలో పోసిన పన్నీరులా తయారయ్యింది. ఉరమాసు ఆడియన్స్ కూడా కష్టపడి చూడాల్సిన “పటేల్ సార్”ను సగటు ప్రేక్షకులు భరించడం కష్టమే.

రేటింగ్: 1.5/5

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus