పవన్ కళ్యాణ్ కేవలం ఒక సినిమా కథానాయకుడు అయితే ఆయన పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చినా, సినిమాలు మానేస్తానన్నా పట్టించుకొనేవారు కాదేమో కానీ.. పవన్ జనహృదయ నేత, యువతకి పవన్ కళ్యాణ్ ఒక ఎమోషన్. అందుకే హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా ఆయన సినిమాలన్నీ సునాయాసంగా 60, 70 కోట్లు కొల్లగొడుతుంటాయి. ఎవరు ఒప్పుకొన్నా ఒప్పుకోకపోయినా గత ఎలక్షన్స్ లో ఆంధ్రాలో తెలుగుదేశం-బీజేపీ పార్టీలు భారీ మెజారిటీతో గెలవడానికి ముఖ్యకారణం పవన్ కళ్యాణ్. కేవలం పవన్ సపోర్ట్ చేస్తున్నాడనే ఒకే ఒక్క కారణంతో యువత ఆ పార్టీలవైపు మొగ్గుచూపారు. పవన్ కళ్యాణ్ కూడా ఎలక్షన్స్ అనంతరం పార్టీల నుంచి ఎలాంటి లాభాలు ఆశించక, అవసరమైతే ఆ పార్టీలనే ప్రశ్నిస్తూ పవన్ తన నైతికతను చాటుకొన్నాడు.
అలాంటి పవన్ కళ్యాణ్ నిన్నట్నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగిడారు. కొండగట్టులోని ఆంజనేయస్వామి ఆశీస్సులు తీసుకొని జనసేనానిగా జనంలో కలిసిపోయారు. అంతా బానే ఉంది కానీ.. నిన్న ఆయన ఓ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. “ప్రస్తుతం నాకు సినిమాల మీద పెద్ద ఆసక్తి లేదు, అవసరం అనుకొంటే సినిమాలకు గుడ్ బై చెప్పడానికి కూడా రెడీ” అంటు వ్యాఖ్యానించడం ఆయన అభిమానుల్ని తీవ్ర మనస్థాపానికి గురిచేసింది. పవన్ రాజకీయాల్లోకి వచ్చినందుకు ఆనందపడాలో లేక ఇకపై పవర్ స్టార్ ను వెండితెరపై చూడలేకపోతున్నామని బాధపడాలో అర్ధం కానీ కన్ఫ్యూజన్ లో మిన్నకుండిపోయారు అభిమానులు.
భవిష్యత్ లో పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఎంత క్రియాశీలక పాత్ర పోషిస్తాడు, రాజకీయాలను శాసించే స్థాయికి చేరుకొంటాడా లేదా అనే విషయం ప్రస్తుతానికి పక్కన పెడితే.. ఆయన ఇలా సినిమాలకు అర్ధాంతరంగా గుడ్ బై చెప్పడం మాత్రం స్వాగతించదగ్గ నిర్ణయం కాదు.