Pawan Kalyan: నామినేషన్ దాఖలు చేసిన పవన్.. అప్పులు, విరాళాల లెక్క ఇదే!
April 23, 2024 / 09:33 PM IST
|Follow Us
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న నేపథ్యంలో ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. గత ఐదేళ్లలో 114.76 కోట్ల రూపాయలు సంపాదించానని చెప్పిన పవన్ తనకు 64 కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ మొత్తంలో 46.70 కోట్ల రూపాయలు 15 మంది వ్యక్తుల నుంచి తీసుకున్న రుణాలు కాగా మిగిలిన డబ్బులు మాత్రం వేర్వేరు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణం కావడం గమనార్హం.
పవన్ కళ్యాణ్ తన ఫ్యామిలీ ఆస్తుల విలువ 163 కోట్ల రూపాయలు అని వెల్లడించినట్టు సమాచారం. పవన్ గత ఐదేళ్లలో విరాళాల కోసమే ఏకంగా 20 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. ప్రభుత్వానికి వేర్వేరు పన్నుల రూపంలో దాదాపుగా 74 కోట్ల రూపాయలు చెల్లించినట్టు పవన్ అఫిడవిట్ లో పొందుపరిచారు. పవన్ కళ్యాణ్ కు డబ్బులు అప్పుగా ఇచ్చిన వ్యక్తులలో కొణిదెల సురేఖ కూడా ఉన్నారు.
సురేఖ 2 కోట్ల రూపాయలు అప్పుగా ఇచ్చినట్టు పవన్ పేర్కొన్నారు. పవన్ ప్రస్తుతం సినిమాలు చేస్తున్న నిర్మాణ సంస్థల నుంచి కూడా డబ్బులు అప్పుగా తీసుకున్నట్టు తెలిపారు. తాను విరాళాలు ఇచ్చిన మొత్తంలో పార్టీ కార్యక్రమాల కోసమే 17.15 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చినట్టు పవన్ వెల్లడించారు. వేర్వేరు సంస్థలకు 3.32 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చినట్టు పవన్ కళ్యాణ్ వెల్లడించడం గమనార్హం.
పవన్ కళ్యాణ్ దాఖలు చేసిన అఫిడవిట్ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది. పవన్ కళ్యాణ్ నామినేషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో మరింత వేగం పెంచనున్నారని సమాచారం అందుతోంది. పవన్ కళ్యాణ్ కెరీర్ పరంగా మరింత బిజీ అవుతున్నారు. పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో గెలుపు కోసం తీవ్ర స్థాయిలో శ్రమిస్తూ ఉండటం గమనార్హం. పవన్ కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు.