Pawan Kalyan: నష్టాల బాధ్యత తనదేనని పవన్ చెప్పారా?
February 24, 2022 / 01:21 PM IST
|Follow Us
మరికొన్ని గంటల్లో థియేటర్లలో భీమ్లా నాయక్ సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమా బెనిఫిట్ షో చూడటానికి పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు సాధారణ అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు థియేటర్లలో అడ్వాన్స్ బుకింగ్స్ ఊహించని స్థాయిలో జరుగుతుండగా భీమ్లా నాయక్ రికార్డులను క్రియేట్ చేయడం ఖాయమని కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే ఏపీలో ఈ సినిమా కలెక్షన్లపై ప్రభుత్వ నిర్ణయాల వల్ల ప్రభావం పడే ఛాన్స్ ఉంది.
ఏపీ ప్రభుత్వం భీమ్లా నాయక్ బెనిఫిట్ షోలకు, అదనపు షోలకు అనుమతి ఇవ్వలేదు. పాత జీవో ప్రకారమే భీమ్లా నాయక్ టికెట్లను అమ్మాల్సి ఉంది. తక్కువ టికెట్ రేట్లకు అమ్మడం వల్ల థియేటర్ల యజమానులకు ఎక్కువ మొత్తంలో లాభాలు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. అధికారులు ఏపీలోని థియేటర్ల దగ్గర తనిఖీలు చేపడితే పలు థియేటర్లు సీజ్ అయ్యే అవకాశాలు సైతం ఉన్నాయని చెప్పవచ్చు. పవన్ కళ్యాణ్ ఈ సినిమా కోసం 50 కోట్ల రూపాయలకు అటూఇటుగా రెమ్యునరేషన్ తీసుకున్నారు.
భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కగా సులభంగానే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు. భీమ్లా నాయక్ ఆంధ్ర హక్కులు 40 కోట్ల రూపాయలకు అమ్ముడవగా సీడెడ్ హక్కులు 17 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని సమాచారం అందుతోంది. ఏపీలో కలెక్షన్లు లేదా రికవరీ గురించి ఆలోచనలు చేయవద్దని ఏపీలోని బయ్యర్లకు నష్టాలు వస్తే తన పారితోషికం నుంచి ఆ మేరకు ఇస్తానని పవన్ చెప్పినట్టు తెలుస్తోంది.
నిర్మాతలకు పవన్ హామీ ఇచ్చారని తెలిసి పవన్ నిర్ణయాన్ని ఫ్యాన్స్ ప్రశంసిస్తున్నారు. భీమ్లా నాయక్ రిలీజైన తర్వాత ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో ఏపీలో ఏ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది. పవన్ కు జోడీగా ఈ సినిమాలో నిత్యామీనన్ నటించగా రానాకు జోడీగా సంయుక్త మీనన్ నటించారు. నాన్ బాహుబలి రికార్డులను ఈ సినిమా బ్రేక్ చేస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.