రెండు స్థానాల్లోనూ జనసేనాని ఓడిపోవడంతో నిరాశలో జనసైనికులు!
May 23, 2019 / 05:36 PM IST
|Follow Us
సినిమాల్లో పవన్ కళ్యాణ్ నెం.1 అనడంలో ఎలాంటి సందేహం లేదు. రాజకీయాల్లోనూ అదే స్థాయిలో తన సత్తా చాటుతాడని ఊహించారు అందరూ. భీమవరం, గాజువాక ప్రాంతాల్లో నామినేషన్ వేయడానికి పవన్ కళ్యాణ్ జనసునామీతోపాటుగా వెళ్లినప్పుడు రెండు స్థానాల్లోనూ పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలుస్తాడు అని ప్రత్యర్ధి పార్టీలు కూడా నమ్మాయి. కానీ.. ఇవాళ వచ్చిన రిజల్ట్స్ తో మొత్తం తారుమారు అయిపోయింది. రెండు చోట్ల గెలుస్తాడని భావించిన వాళ్ళందరూ కౌంటింగ్ జరుగుతున్నంతసేపు కనీసం ఒక్క సీటు గెలిచినా బాగుండు అనేలా జరిగింది రచ్చ.
చివరికి గాజువాకలో 7000 ఓట్ల తేడాతో, భీమవరంలో 2000 ఓట్ల తేడాతో దారుణంగా ఓడిపోయాడు పవన్ కళ్యాణ్. ఇప్పటివరకూ జనసేన పార్టీకి వచ్చింది ఒకే ఒక్క సీటు. 60 స్థానాల నుంచి పోటీ చేయగా కేవలం ఒకే ఒక్క సీటు గెలవడం అనేది చాలా దారుణమైన విషయం. మరి ఆ ఒక్క సీటుతో జనసేన 5 ఏళ్లపాటు కొనసాగుతుందా లేదా అనేది వేచి చూడాల్సిన విషయం. అయితే.. ఈ దారుణమైన పరాజయం పవన్ కళ్యాణ్ కు మాత్రమే కాదు ఆయన అభిమానులకు కూడా కోలుకోలేని దెబ్బ అనే చెప్పాలి.