రైతులు, మత్స్యకారులపై జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించిన పవన్!
October 15, 2016 / 01:43 PM IST
|Follow Us
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గంగా నదిని ప్రక్షాళన చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ లోని బీజేపీ ఎంపీలు నదులను కాలుష్యం చేయడానికి కంకణం కట్టుకున్నారా? అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. మాదాపూర్ ఇమేజ్ గార్డెన్స్ లో శనివారం విశ్వమానవ వేదిక ఆధ్వర్యంలో భీమవరం ప్రాంత రైతులు, మత్స్యకారులు పవన్ కల్యాణ్‌ను కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు.
ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో పవన్ మాట్లాడుతూ.. పశ్చిమ గోదావరి జిల్లా తుందుర్రు ప్రాంతంలో అలజడి సృష్టిస్తున్న గోదావరి మెగా ఆక్వాఫుడ్ పార్కు నిర్మాణాన్ని అక్కడినుంచి తక్షణమే తరలించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉభయ గోదావరి జిల్లాలు అన్నం పెట్టే జిల్లాలని, నదులను కలుషితం చేసే పరిశ్రమల ఏర్పాటు రాష్ట్రానికి మంచిది కాదన్నారు. తాను పారిశ్రామిక ప్రగతికి వ్యతిరేకిని కానని, ఆలోచనా రహితంగా పరిశ్రమలు ఏర్పాటు చేయడం మాత్రం ఏ ప్రభుత్వానికీ తగదన్నారు.
రెండు లక్షలమంది రైతులకు, 50 వేల మంది మత్స్యకారులకు జీవనాధారమైన గొంతేర్ కాలువను వ్యర్థాలతో నింపనున్న మెగా ఆక్వాఫుడ్ పార్క్ ఏర్పాటును తీర ప్రాంతానికి తరలించాలని విజ్ఞప్తి చేశారు. ఈ అంశంపై ప్రభుత్వం మొండి వైఖరి వీడకపోతే తమతో కలిసి వచ్చే పార్టీలతో శాంతియుత పోరాటాలకు సిద్ధమవ్వనున్నట్లు ప్రకటించారు. హైకోర్టు ఓ కమిటీని నియమించి తుందుర్రు పరిస్థితులపై చర్చించాలని పవన్ కళ్యాణ్ సూచించారు.