అన్నీ అలాంటి పాత్రలే వస్తుంటే చాలా చిరాకుగా ఉంది: పాయల్
June 1, 2019 / 06:29 PM IST
|Follow Us
తొలి చిత్రంలో పాత్ర పరంగా తారలకు ఎలాంటి ముద్ర పడితే ఆ తర్వాత నటించే చిత్రాల్లో వారిని అదే కోణంలో ఊహించు కుంటుంటారు ప్రేక్షకులు. కొందరు తారలు తమకు వచ్చిన ఆ ఇమేజ్ చట్రం నుంచి అంత సులువుగా బయట పడలేరు కూడా. చాలా తక్కువమంది తారలు మాత్రమే తమకు లభించిన ఇమేజ్ను పక్కన పెట్టేసి…విభిన్నమైన పాత్రలను ఎంపిక చేసుకుంటుంటారు. ఇప్పుడు పాయల్ రాజ్ఫుట్ పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీలేదు. ఆర్ఎక్స్ 100 వంటి హిట్ చిత్రంలో హాట్ ఫోజులతో రస హృదయాలను కొల్లగొట్టిన పాయల్ ఇప్పుడు అభినయానికి అవకాశం ఉన్న పాత్రలకు ప్రాధాన్యమివ్వాలని నిర్ణయించుకుందని, అంతమాత్రాన గ్లామర్ పాత్రలను పక్కన పెట్టేసినట్లు కాదన్న వ్యాఖ్యలు పరిశ్రమలో వినిపిస్తున్నాయి.
వెంకటేష్, నాగచైతన్య కలయికలో తెరకెక్కుతున్న వెంకీమామ చిత్రంలో సెంటిమెంట్ మిళితమైన సన్నివేశాలలో ఆమె కనిపించున్నట్లు పరిశ్రమ వర్గాల భోగట్టా. ఇక రవితేజ కథానాయకుడిగా రూపొందుతున్న డిస్కోలాజా చిత్రంలో దివ్యాంగురాలి పాత్రలోనూ, ఇంకా తేజు (హుషారు ఫేమ్) హీరోగా శంకర్‌భాను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్డీఎక్స్ చిత్రంలోనూ పాయల్ నటిస్తోంది. ఇది మాత్రం రొమాంటిక్ ఎంటర్టైనర్ కథాంశంతో ఉంటుందని అంటున్నారు. ఇలా విభిన్నమైన సినిమాలు, పొంతనలేని పాత్రలతో పాటు అభినయానికి అధికంగా అవకాశం ఉన్న పాత్రలలో ఆమె నటించాలని నిర్ణయించుకుంది. మొత్తంమీద తనకు వచ్చిన ఇమేజ్‌కు భిన్నమైన పాత్రలను ఆమె ఎంపిక చేసుకోవడం చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.