Pekamedalu Review in Telugu: పేక మేడలు సినిమా రివ్యూ & రేటింగ్!

  • July 19, 2024 / 09:46 AM IST

Cast & Crew

  • వినోద్ కిషన్ (Hero)
  • అనూష కృష్ణ (Heroine)
  • రితికా శ్రీనివాస్,జగన్ యోగి రాజు, మురళీధర్ గౌడ్,శృతి మెహర్, గణేష్ తిప్పరాజు,అనూష నూతుల తదితరులు (Cast)
  • నీలగిరి మామిళ్ళ (Director)
  • రాకేష్ వర్రె (Producer)
  • స్మరన్ సాయి (Music)
  • హరిచరణ్ కె (Cinematography)

‘ఎవ్వరికీ చెప్పొద్దు’ అనే సినిమాతో నిర్మాతగా మారాడు ప్రముఖ నటుడు రాకేష్ వర్రె (Rakesh Varre). ఆ సినిమా క్రిటిక్స్ ను మెప్పించడంతో మంచి రివ్యూలు, రేటింగులు పడ్డాయి. అందువల్ల ఓటీటీకి బాగా గిట్టుబాటు అయ్యింది. ఆ సినిమా ఇచ్చిన ఎంకరేజ్మెంట్ వల్ల ‘పేక మేడలు’ (Pekamedalu) అనే మరో చిన్న సినిమాను నిర్మించాడు రాకేష్. దీనిని కూడా ప్రమోట్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు. సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని (Dheeraj Mogilneni) ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తుండటం.. అలాగే ప్రీమియర్స్ కి టికెట్ రేట్లు రూ.50 మాత్రమే పెట్టడంతో ‘పేక మేడలు’ రెండు రోజుల నుండి బాగా ట్రెండ్ అవుతుంది. మరి సినిమా ఆకట్టుకునే విధంగా ఉందో లేదో తెలుసుకుందాం రండి :

కథ : బీటెక్ చదివినప్పటికీ … చదువుకు తగ్గ ఉద్యోగం చేయకుండా రియల్ ఎస్టేట్ బ్రోకర్ గా పనిచేస్తూ ఉంటాడు లక్ష్మణ్(వినోద్ కిషన్  (Vinod Kishan) ).షార్ట్ కట్లో కోటీశ్వరుడు అయిపోవాలి అనేది అతని అత్యాశ.పెళ్ళై ఒక కొడుకు ఉన్నప్పటికీ.. ఏమాత్రం బాధ్యతగా వ్యవహరించడు. పైగా అతని భార్య వరలక్ష్మీ(అనూష కృష్ణ (Anoosha Krishna)) మురుకులు వంటి పిండి వంటలు చేసి షాపులన్నీ తిరిగి అమ్మి తెచ్చిన డబ్బుని కూడా తన తాగుడు కోసం, సిగరెట్ల కోసం వాడేస్తూ ఉంటాడు. అంతేకాదు తన భార్య కర్రీ పాయింట్ కోసం డబ్బు అడిగితే..

ఆమె పేరు చెప్పి అప్పు తీసుకుని జల్సాల కోసం ఖర్చు పెట్టేస్తాడు. అలాంటి టైంలో ఓ ఎన్నారై ఆంటీ (రితిక శ్రీనివాస్) (Rethika Srinivas) ని ట్రాప్ చేసి.. ఆమె వద్ద డబ్బు కొట్టేయాలని ప్రయత్నిస్తాడు. అందుకోసం తన భార్య, పిల్లాడిని వదిలించుకోవాలి అనుకుంటాడు. ఈ విషయం తన భార్యకి, అలాగే అతని అత్తమామలకు తెలుస్తుంది. ఆ తర్వాత లక్ష్మణ్ జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి.. అనేది తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.

నటీనటుల పనితీరు : వినోద్ కిషన్ నటన గురించి కొత్తగా చెప్పేది ఏముంది.. ‘నా పేరు శివ’  (Naan Mahaan Alla) ‘గాడ్’ (Iraivan) వంటి తమిళ సినిమాలు చూసిన వాళ్ళకి అతను ఎంత మంచి నటుడే అర్థమవుతుంది. ఇక ఈ ‘పేక మేడలు’ లో అతని నటన గురించి ఒక్క మాటలో చెప్పడం కష్టం. తన కన్నింగ్ పెర్ఫార్మన్స్ తో ఎక్కువ మార్కులు కొట్టేస్తాడు అని చెప్పాలి. ఇతన్ని తప్ప మరో నటుడిని ఈ పాత్రలో ఊహించుకోవడం కూడా కష్టంగా ఉంటుంది. అంతలా తన పాత్రలో ఒదిగిపోయాడు వినోద్. అలాగే అనూష కృష్ణ కూడా చాలా బాగా నటించింది.

ఈమెది స్ట్రాంగ్ ఉమెన్ క్యారెక్టర్ అని చెప్పాలి. సినిమా చూసి బయటకు వచ్చేప్పుడు కూడా ఈమె పాత్ర అందరినీ వెంటాడుతుంది. క్లైమాక్స్ లో అయితే విజిల్స్ కూడా వేయిస్తుంది. ఇక షేక్ శివగా గణేష్ తిప్పరాజు (Ganesh Thipparaju).. సీరియస్ గా కనిపిస్తూనే కామెడీని కూడా పండించాడు. మురళీధర్ గౌడ్ ఒకటి రెండు సీన్లకి పరిమితమయ్యాడు. మిగిలిన నటీనటులు కూడా బాగానే చేశారు.

సాంకేతిక నిపుణుల పనితీరు : దర్శకుడు నీలగిరి మామిళ్ళ (Neelagiri Mamilla) ఎంపిక చేసుకున్న కథలో కొత్తదనం ఏమీ ఉండదు. అప్పుడెప్పుడో వచ్చిన శ్రీకాంత్  (Srikanth) ‘ఆహ్వానం’ వంటి సినిమా ఛాయలు ఈ కథలో కూడా కనిపిస్తాయి. కాకపోతే స్క్రీన్ ప్లే ఎంగేజింగ్ గా ఉంది. ఫస్టాఫ్ కామెడీతో నడిపించి.. సెకండాఫ్ లో ఎమోషనల్ యాంగిల్ కి టర్న్ తీసుకున్నాడు. క్లైమాక్స్ లో అయితే ట్విస్ట్ అని అనలేం కానీ, ఎవ్వరూ ఊహించని విధంగా షాక్ ఇచ్చి కొత్తగా ముగించాడు అని చెప్పాలి. రాకేష్ వర్రె నిర్మాణ విలువలు గొప్పగా చెప్పుకునే స్థాయిలో లేవు కానీ, వంకలు పెట్టే విధంగా కూడా లేవు.

ఇలాంటి ప్రామిసింగ్ స్క్రిప్ట్ ఎంపిక చేసుకున్నందుకు అతనికి కూడా మంచి మార్కులు వేయొచ్చు. స్మరన్ సాయి సంగీతం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఒకటి రెండు పాటలు ఈ సినిమాలో ఉన్నాయి. కథనాన్ని ఎక్కడా డిస్టర్బ్ చేయకుండా అవి వచ్చి వెళ్లిన తీరు బాగుంది. ముఖ్యంగా సమాజంలో స్త్రీ ఎదుర్కొంటున్న పరిస్థితులను వివరిస్తూ వచ్చే పాట గుర్తుండిపోయే విధంగా ఉంటుంది. హరిచరణ్ కె సినిమాటోగ్రఫీ పర్వాలేదు.

విశ్లేషణ : ‘పేక మేడలు’ లో మంచి ఎమోషనల్ కంటెంట్ ఉంది. అంతర్లీనంగా ఓ మెసేజ్ కూడా ఉంది.కొన్ని లాజిక్స్ మిస్ అయినప్పటికీ.. కేవలం 2 గంటల నిడివి కలిగిన ఈ సినిమాని.. హ్యాపీగా ఈ వీకెండ్ కి ఒకసారి ట్రై చేయొచ్చు.

రేటింగ్ : 2/5

Rating

2
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus