సినిమాల్లో హింస ఎక్కువైపోతోంది, సమాజం చెడిపోతోంది… ఇలా చాలా ఏళ్లుగా మన సినిమాల గురించి చర్చ జరుగుతూనే ఉంది. దానికి ఆ సినిమా దర్శకనిర్మాతలు చెప్పే సమాధానం… ‘మా ఉద్దేశం అది కాదు’. శ్రుతి మించని హింసనే సినిమాల్లో చూపిస్తున్నాం అని కూడా అంటుంటారు. అయితే ఇప్పుడు ఈ విషయంలో ఏదో నిర్ణయం తీసుకునేలా ఓ పిటిషన్ మధురై కోర్టులో దాఖలైంది. ఏకంగా ఓ సినిమా దర్శకుడిని సైకలాజిల్ టెస్టులు చేయాలని ఆ పిటిషన్ వేసిన వ్యక్తి కోరారు.
‘ఖైదీ’, ‘మాస్టర్’, ‘విక్రమ్’, ‘లియో’ సినిమాలతో ఎల్‌సీయూను ఏర్పాటు చేసుకున్నారు లోకేశ్ కనగరాజ్. ఈ అన్ని సినిమాల్లో ఉన్న కామన్ పాయింట్ హింస. అంటే ఇందులో హీరోలు విలన్లను చంపినప్పుడు చాలా క్రూరంగా ఉంటారు. దాంతోపాటు అన్నింటిలో మత్తుమందు, అండర్ వరల్డ్ డాన్‌లు… కనిపిస్తారు. ఒక సినిమాకు మరో సినిమాను లింక్ పెట్టి ముందుకెళ్తున్నారు. అయితే అలాంటి సినిమాలు చేయడంపై ఓ వ్యక్తి కోర్టుకెక్కారు. మధురైకి చెందిన రాజు మురుగన్ అనే వ్యక్తి లోకేశ్ కనగరాజ్‌పై పిటిషన్ దాఖలు చేశారు.
మారణాయుధాలు, డ్రగ్స్, మతపరమైన చిహ్నాలు, మహిళలు – చిన్నారులపై హింసను ఆయన సినిమాల్లో ఎక్కువగా చూపిస్తున్నారు అంటూ ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు రాజు మురుగన్. ఆయన సినిమాల వల్ల సమాజంపై చెడు ప్రభావం పడుతోందని ఆయన అంటున్నారు. అందుకే లోకేశ్ మానసిక పరిస్థితిపై సైకలాజికల్ టెస్ట్ నిర్వహించాలని రాజు కోరారు. ఈ పిటిషన్ మధురై న్యాయస్థానం బుధవారం విచారణకు స్వీకరించింది. అయితే లోకేశ్ తరఫు న్యాయవాది న్యాయస్థానానికి హాజరుకాకపోవడంతో విచారణ వాయిదా పడింది.
దీంతో ఈ విషయంలో కోలీవుడ్‌లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ కేసు మరోసారి వాదనకు వచ్చినప్పుడు ఎలాంటి వాదనలు జరుగుతాయి, కోర్టు ఏమంటుంది అనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఇలాంటి సినిమాలు దేశవ్యాప్తంగా తెరకెక్కుతున్నాయి. ఈ కేసు వల్ల మిగిలిన రాష్ట్రాల్లో కూడా సినిమాల మీద అభ్యంతరాలు వస్తాయా అనేది చూడాలి. ఇక ప్రస్తుతం లోకేశ్ (Lokesh Kanagaraj) సూపర్ స్టార్ రజినీకాంత్‌తో ఓ సినిమా తెరకెక్కించబోతున్నారు. ప్రస్తుతం దీని ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి.
ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!
ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!