Rajinikanth: ఏపీలో పొలిటికల్ హీట్.. రజనీకి మద్దతుగా నెటిజన్ల ట్రెండింగ్.. ఏమైందంటే?
May 2, 2023 / 04:47 PM IST
|Follow Us
ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి రాజకీయ వేడి మొదలైంది. దానికి సినిమాలకు ఏం సంబంధం ఉంది అనే డౌట్ రావొచ్చు. కచ్చితంగా ఉంది. ఎందుకంటే ఇప్పటి పొలిటికల్ వార్కి సెంటర్ పర్సన్ తలైవా రజనీకాంత్ కాబట్టి. అవును ఇటవల జరిగిన ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో రజనీకాంత్ ప్రసంగం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చకు దారి తీసింది. ఈ విషయంలో వైఎస్ఆర్సీపీ దుమ్మెత్తి పోస్తుంటే.. మరోవైపు టీడీపీ వారిని దీటుగా ఎదుర్కుంటోంది. అయితే నెటిజన్లు #YSRCPApologizeRajini అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రజనీకాంత్‌కు YSRCP నేతలు క్షమాపణలు చెప్పాలంటూ ఆయన అభిమానులు ట్విటర్లో డిమాండ్ చేస్తున్నారు. రజనీకాంత్‌ను విమర్శించిన వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. #YSRCPApologizeRajini హ్యాష్‌ట్యాగ్‌తో కామెంట్లు పెడుతూ… మీమ్స్ పోస్ట్ చేస్తున్నారు. దీంతో ఈ విషయంలో గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. విజయవాడలో ఇటీవల నందమూరి తారకరామారావు శత జయంతి ఉత్సవం సందర్భంగా ఎన్టీఆర్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో తన అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు రజనీకాంత్.
30 ఏళ్ల నుండి చంద్రబాబుతో పరిచయం ఉందన్న రజనీకాంత్ ఆయన గురించి, ఆయన పనితనం గురించి గొప్పగా చెప్పుకొచ్చారు. ఆయన వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వస్తే దేశంలో ఏపీ అగ్రగామిగా ఉంటుందని కూడా చెప్పారు. అయితే రజనీకాంత్ అలా మాట్లాడడంపై ఆంధ్రప్రదేశ్ మంత్రులు రోజా, అంబటి రాంబాబుతోపాటు గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని తదితరులు తీవ్ర విమర్శలు చేశారు. రజనీకాంత్‌కు రాజకీయాల గురించి మాట్లాడే అర్హత లేదని, ఆయన తమిళనాడులో హీరో కావొచ్చుగానీ ఇక్కడ కాదు అంటూ విమర్శలు ఏశారు.
దీంతో ‘‘చిరకాల మిత్రుడు గురించి రజనీకాంత్ అలా మాట్లాడితే తప్పేముంది? ఆయన ఎవరినీ కించపరచలేదు’’ అంటూ నెటిజన్లు తమ మద్దతు తెలియజేస్తున్నారు. రజనీకాంత్, చంద్రబాబు స్నేహం ఇప్పటిది కాదు అంటూ వివరాలు చెబుతూ కొందరు ట్వీట్లు చేస్తే… ఓ వైపు రజనీకాంత్ ఫొటో, మరోవైపు వైఎస్ఆర్సీపీ నాయకుల ఫొటోలు పెట్టి ‘శివాజీ’ సినిమాలోని ‘నాన్నా పందులే గుంపులుగా వస్తాయి. సింహం సింగిల్‌గా వస్తుంది’ అనే డైలాగ్‌తో మీమ్స్ మరికొందరు షేర్ చేశారు. దీంతో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.