ఒమిక్రాన్ భయం… పెద్ద సినిమాలపై ప్రభావం చూపిస్తుందా?
December 28, 2021 / 01:08 PM IST
|Follow Us
సంక్రాంతి సీజన్ మొదలవ్వడానికి ఇంకా పది రోజులు ఉంది. ఈ టైమ్‌లో మళ్లీ టాలీవుడ్ పొంగల్ ఫైట్ డేట్ తేలలేదు అంటున్నారేంటి? అనుకుంటున్నారా? దేశంలో పరిస్థితి చూస్తుంటే ఇదే అనిపిస్తోంది. దీనికి కారణం ఒమిక్రాన్ భయాలే. అవును దేశంలో ఒమిక్రాన్ కేసులు రోజురోజుకీ పెరుగుతూ వస్తున్నాయి. దీంతో చాలా రాష్ట్రాలు ఆంక్షల బాట పడుతున్నాయి. నైట్ కర్ఫ్యూలు విధిస్తున్నారు. అయితే ప్రస్తుతానికి ఈ ఆంక్షలు జనవరి 2వరకు మాత్రమే అని చెప్పారు. ఇదే సమస్యగా మారింది.
కొత్త సంవత్సరం సందర్భంగా వేడుకల పేరుతో ప్రజలు పెద్ద ఎత్తున రోడ్డు మీదకు వచ్చి సందడి చేస్తారు. ఈ నేపథ్యంలో ఒమిక్రాన్ వ్యాప్తి పెరుగుతుందేమో అనే భయంతో రాష్ట్ర ప్రభుత్వాలు నైట్ కర్ఫ్యూలు, ఆంక్షలు విధించాయి. జనవరి 2 తర్వాత మరోసారి సమీక్షించి నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. మరి రెండో తేదీ నాటికి దేశంలో కేసుల సంఖ్య పెరిగితే ఆంక్షలు పొడిగిస్తారా? థియేటర్లలో 50 శాతం ఆక్యుపెన్సీ విధిస్తారా? లాంటి అనుమానాలు ఉన్నాయి. ఒకవేళ ఇదే చేస్తే పెద్ద సినిమాలకు ఇబ్బందే.
‘ఆర్ఆర్ఆర్’, ‘రాధే శ్యామ్’ లాంటి పాన్ ఇండియా సినిమాలకు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, పక్క రాష్ట్రాల్లోనూ వసూళ్లు చాలా ముఖ్యం. ‘పుష్ప’కు డివైడ్ టాక్ వచ్చినా… వసూళ్ల పంట పండుతోంది అంటే పక్క రాష్ట్రాల వసూళ్లూ కారణం అని చెబుతున్న విషయం తెలిసిందే. దీంతో పక్క రాష్ట్రాల్లో ముఖ్యంగా మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, కేరళలో కరోనా ఆంక్షలు విధిస్తే… పండగ సినిమాలు ఇబ్బందులు పడతాయి. ఏపీలో ఇప్పటికే టికెట్ ధరల సమస్య ఉంది.
దీంతో జనవరి 2 తర్వాత పండగ సినిమాల విషయంలో క్లారిటీ వస్తుందని అంచనా వేస్తున్నారు. ఆంక్షలు పెంచితే, సినిమాలు వాయిదా వేసే అవకాశం పరిశీలించొచ్చని టాక్. ఒకవేళ అదేజరిగితే అభిమానులకు తీవ్ర నిరాశ తప్పదు. అయితే ఈ రెండు సినిమాలు వెనక్కి వెళ్లిపోతే ‘భీమ్లా నాయక్’, ‘బంగార్రాజు’ సినిమాలు ట్రాక్ మీదకు తీసుకొచ్చేస్తారని తెలుస్తోంది. ఆ విధంగా పవన్ కల్యాణ్, నాగార్జున ఫ్యాన్స్‌కు సంతోషం కలుగుతుంది. సో కొత్త సంవత్సరం రెండో రోజు క్లారిటీ వస్తుంది.