Prakash Raj: 200 మందితో పని చేయించడానికి వస్తున్నాం: ప్రకాశ్‌రాజ్
September 15, 2021 / 03:23 PM IST
|Follow Us
ఎన్నికలన్నాక వాగ్దానాలు, హామీలు కచ్చితంగా ఉంటాయి. అది సాధారణ రాజకీయాలు అయినా, సినిమా రాజకీయాలైనా అలానే ఉంటాయి. గతంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల సమయంలో ఇలాంటి హామీలు చాలానే విన్నాం. సినిమా జనాలు కూడా విన్నారు. అయితే ఈసారి కొంచెం డిఫరెంట్‌గా జరుగుతున్నాయి. హామీలు, వాగ్దానాలతోపాటు వాటి అమలు కోసం ఏం చేస్తాం అనేది కూడా వివరంగా ప్రకటించారు ప్రకాశ్‌రాజ్. నేను ఊరికినే ‘మా’ ఎన్నికలకు రాలేదు. ఆరు నెలల పాటు హోం వర్క్ చేసుకుని వచ్చా అంటూ ప్రకాశ్‌రాజ్… ‘మా’ ఎన్నికల మీద ఆసక్తి రేకెత్తించారు.
దాంతోపాటు ‘మా’ సభ్యుల కోసం ఏమేం చేయొచ్చు అనేది కూడా వివరంగా చెప్పారు. ఈ క్రమంలో నాటక కళాకారుల గురించి కూడా మాట్లాడారు. నాటక కళాకారులకు ప్రభుత్వ పథకాలు ఉన్నాయి కదా… మరి ఎందుకు అందించటం లేదు అని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ను ఒకసారి ప్రకాశ్‌రాజ్ అడిగారట. దానికి ఆయన ‘మమ్మల్ని ఎవరూ అడగలేదు’ అని సమాధానం ఇచ్చారట. తమ ప్యానల్ అధికారంలోకి వస్తే అందరి తరఫున తాము అడుగుతాం అని చెప్పారు ప్రకాశ్‌రాజ్.
100మంది వైద్యులతో క్లబ్ ఏర్పాటు చేస్తామని ప్రకాశ్‌రాజ్ ప్రకటించారు. ఈ మేరకు ప్రముఖ వైద్యులతో ఇప్పటికే చర్చించాం అని కూడా చెప్పారాయన. మా ప్యానల్ గెలికా మూడు నెలల్లో ‘మా’ అసోసియేషన్ ఆఫీస్‌లో ప్రతి ఒక్కరికీ హెల్త్‌కార్డు ఉంటుంది. పేద కళాకారుల పిల్లలను దత్తత తీసుకుని వారి చదువుకు అయ్యే ఖర్చు భరించేలా కథానాయకులను అప్రోచ్ అవుతాం. వాళ్లు కూడా ముందుకొస్తారని ఆశిస్తున్నా అని చెప్పారు ప్రకాశ్‌రాజ్. ‘నవరస’ లాంటి ప్రాజెక్టు తెలుగులోనూ చేసి…
వచ్చిన డబ్బుతో ‘మా’ సభ్యులకు సాయం చేస్తాం. దీని కోసం త్రివిక్రమ్, పూరి జగన్నాథ్, కృష్ణవంశీ, క్రిష్, నాని, శర్వానంద్ లాంటి వాళ్లు ముందుకొస్తారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌లో ఇకపై నలుగురు కో-ఆర్డినేటర్స్ ఉంటారని చెప్పారు ప్రకాశ్‌రాజ్. ప్యానెల్లో ఉన్న 26మందికీ 26 ప్రత్యేక ఫోన్ నెంబర్ ఉంటుంది. ఈ మెంబర్స్ సినిమా సెట్స్‌కు వెళ్లి, ఆ ప్రాజెక్టులో పనిచేస్తున్న ‘మా’ సభ్యులతో మాట్లాడి సమస్యలను తెలుసుకుంటారు. వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తారు అని ప్రకాశ్ రాజ్ తన హామీల్లో చెప్పారు.