Prakashraj: ‘మా’లో ఉన్నది 900 మంది కాదు: ప్రకాశ్‌రాజ్
September 15, 2021 / 01:36 PM IST
|Follow Us
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు అంటే ఎందుకంత ఆసక్తి అని అడుగుతుంటారు కొందరు. 900 మంది సభ్యులు ఉన్న సంఘమే కదా… ఎందుకంత సీన్ అంటుంటారు. ఆసక్తి ఎందుకు అనేది కాసేపు పక్కన పెడితే… ‘మా’లో 900 మంది ఉన్నారా? అని అడిగితే… చిన్న డౌట్ కలుగుతుంది. గత కొన్ని పర్యాయాలుగా అంతమంది వచ్చి ఓటేయడం లేదు. దీంతో అసలు లెక్క ఏంటా? అని చాలామందికి డౌట్ వచ్చింది. దీనిపై ప్రకాశ్‌రాజ్ క్లారిటీ ఇచ్చారు.
ఈ దఫా జరుగుతున్న ‘మా’ ఎన్నికల్లో ప్రకాశ్‌రాజ్ ప్యానల్ పోటీ చేస్తోంది. ఇప్పటికే ప్రకాశ్‌రాజ్ తన ప్యానల్‌ను ప్రకటించి, ప్రచారంలోకి దిగారు. తాజాగా తన ప్యానల్ అధికారంలోకి వస్తే ఏం చేస్తాం అనేది చెప్పారు. ఈ క్రమంలో అసలు ‘మా’ సభ్యులు ఎంతమంది అనే లెక్క చెప్పారు. నిజానికి అందరూ అనుకున్నట్లు ‘మా’లో 900 మంది సభ్యులు లేరని అసలు విషయం చెప్పుకొచ్చారు. అంటే ఆయన ఉద్దేశం… లేరని కాదు. ‘మా’ను పట్టించుకునే వాళ్లు అంతమంది లేరని కాదు.
‘మా’ సభ్యుల్లో 150 మందికిపైగా యాక్టివ్ సభ్యులు కాదు. ఉదాహరణకు జెనీలియానే తీసుకొండి. మాజీ సీఎం కొడుకును వివాహం చేసుకుని వెళ్లిపోయారు. ఆమె యాక్టివ్ మెంబర్కారు. అలాంటి వాళ్లను తీసేస్తే, 750మంది మాత్రమే ఉన్నారు. అందులో మరో 147మంది స్థానికులు కాదు. చెన్నై, బెంగళూరు, కేరళ నుండి ఇక్కడకు వచ్చి షూటింగ్ పూర్తి చేసుకుని వెళ్లిపోతారు. వాళ్లకు విడిది, ఫ్లైట్ టికెట్స్‌కు డబ్బులు ఇస్తారు. ఆ లెక్కన ఉన్నది 600 మందే. అందులో కొందరు యువ కథానాయకులు, పెద్ద పెద్ద నటులు ఓటింగ్‌కు రారు. ఆ లెక్కన మరో 150 తీసేస్తే… 450 మంది మిగులుతారు అని ప్రకాశ్‌రాజ్ చెప్పారు.
ఆ 450 మందిలో 200 మంది బాగానే ఉన్నారు. వాళ్లకు అవకాశాలు, డబ్బులు ఉన్నాయి. దీంతో ఇంకా ఆదుకోవాల్సింది 250 మంది మాత్రమే. అలాంటివారిని ఆదుకోలేమా! ఇంకా చెప్పాలంటే 250లో 40 మంది రంగస్థల కళాకారులున్నారు. వాళ్లకు ఎక్కడకు వెళ్లాలో తెలియదు. కౌన్సిలింగ్ ఇస్తే, సినిమా కెమెరాకు అనుగుణంగా చక్కగా నటిస్తారు. అంటూ ‘మా’ సభ్యుల లెక్క, లబ్ధి చేకూరాల్సిన వారి లెక్క చెప్పారు ప్రకాశ్‌రాజ్.